-27వ డివిజన్ 198 వ వార్డు సచివాలయం పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో పేదల జీవితాలు ఎంతగానో మెరుగుపడ్డాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సోమవారం 27 వ డివిజన్ 198 వ వార్డు సచివాలయం పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాం, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. దుర్గాపురం రజక వీధి, వినాయక టెంపుల్ వీధులలో విస్తృతంగా పర్యటించి ప్రజల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. వార్డు సచివాలయ పరిధిలోని 1,224 గృహాలలో, 441 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ప్రాంత ప్రజలు ఆప్యాయంగా పలకరించారు, కర్పూర హారతులు పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలియజేశారు. ప్రజల చల్లని దీవెనలతో సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలంతా తమను సాదరంగా ఆహ్వానిస్తున్నారని తెలిపారు. సీఎం జగనన్న పేదలకు ఉచితంగా పేదలకు ఇళ్లు ఇస్తుంటే చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు. తెలుగుదేశం నాయకులు వేసిన కేసుల కారణంగా సీఆర్డీఏ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణం కార్యరూపం దాల్చలేకపోయిందని వెల్లడించారు. వీరందరికీ నగర సమీపంలో ఇళ్ల పట్టాలు కేటాయించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు స్థలాన్వేషణలో ఉన్నట్లు వెల్లడించారు. త్వరలో పట్టాల పంపిణీని పూర్తిచేస్తామని తెలియజేశారు. డివిజన్ లో అభివృద్ధి పనులు సైతం శరవేగంగా జరుగుతున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. రూ. 12.70 లక్షలతో దుర్గాపురం పార్కు., రూ. 7.90 లక్షలతో గులాబీతోట పార్కును అభివృద్ధి పరుస్తుండటంతో పాటు ఓపెన్ జిమ్ సదుపాయం కల్పించడం జరుగుతోందన్నారు. రూ. 33.50 లక్షలతో నూతన కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా బావాజీపేట డీమార్ట్ పక్క వీధిలో రూ. 45 లక్షల నిధులతో రహదారులు, యూజిడి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుత అభివృద్ధి
‘మన బడి నాడు–నేడు’ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పర్యటనలో భాగంగా S.T.V.R.M.C. పాఠశాలను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఆరా తీశారు. జగనన్న విద్యాకానుక ప్రతిఒక్క విద్యార్థికీ అందిందా.. లేదా..? అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని.. పేరంట్స్ కమిటీ సభ్యుల సమన్వయంతో పనులు నాణ్యతతో జరిగేలా చూడాలని ప్రధానోపాధ్యాయురాలు సూర్యప్రభ గారికి సూచించారు. పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడంలో రాజీ పడే ప్రసక్తి లేదని.. గత మూడేళ్లలో సెంట్రల్ నియోజకవర్గంలో పాఠశాల విద్యకు రూ. 202.31 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు విమర్శలు అర్థరహితం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. విలీన మండలాలపై ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షనేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఆంధ్రాలోని ఎటపాక మండలం పరిధి ఐదు గ్రామ పంచాయతీల ప్రజలందరూ ఆంధ్రాలోనే ఉంటామని స్పష్టం చేస్తున్నారని మల్లాది విష్ణు తెలిపారు. జిల్లాల పునర్విభజన సమయంలో పాడేరు దూరాభారం దృష్ట్యా విలీన మండలాలకు పాలన సౌలభ్యం కోరుతూ ఆ సమయంలో కొందరు భద్రాచలంలో కలుపమని కోరితే.. వాటిని ఇప్పుడు వక్రీకరించి తెలుగుదేశం నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అసలు రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించడానికి ప్రధాన కారణం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం కాదా..? అని ప్రశ్నించారు. ఆనాడు చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్లే రాష్ట్ర విభజన జరిగిందని దుయ్యబట్టారు. చంద్రబాబు కోరడంతోనే జాతీయ హోదా కలిగిన పోలవరం రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లోకి వచ్చి ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శించారు. పోలవరాన్ని టీడీపీ ఏటిఎంలా వాడుకున్నట్లు బీజేపీ పెద్దలే పలు సందర్భాలలో బహిరంగంగా వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. చంద్రబాబు అసమర్థత, చేతగానితనం వల్లనే ప్రత్యేక హోదా అటకెక్కి.. ప్యాకేజీ తెరపైకి వచ్చిందని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన పాపాలను కడగడానికే ఈ ప్రభుత్వానికి సగం సమయం సరిపోతోందని.. ఇంకా ఏ ముఖం పెట్టుకుని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లుతారని మండిపడ్డారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, ఆర్.ఐ.(రెవెన్యూ) ప్రసాద్, నాయకులు కురిటి శివ, బొప్పన గాంధీ, పిల్లుట్ల వంశీ, మందా రాము, శీలం భవానీ రెడ్డి, వి.బి.ఆచారి, షేక్ ఖాజా, దుర్గారావు, పసుపులేటి యేసు, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News