గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా గుడివాడ శాసన సభ్యులు, మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి గుడివాడలోని టిడ్కో ఇళ్లు, జగనన్న లేఅవుట్ల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సోమవారం బొమ్ములూరు సమీపంలోగల నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లు, మల్లయ్యపాలెం రూరల్, గుడివాడ అర్బన్ జగనన్న లేఅవుట్ల పురోగతిపై అధిరులతో సమీక్షించారు. డిసెంబర్ లోపు టిడ్కో గృహాలను పూర్తి చేయడంతో పాటు మౌలిక సదుపాయాలను పూర్తి చేయాలన్నారు.
అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ టిడ్కో గృహాల నిర్మాణం దాదాపుగా 90 శాతం పూర్తయ్యిందని, దాంతో పాటుగా జగన్న్న లేఔట్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయన్నారు. లబ్ధిదారులకు రుణాల మంజూరు, రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయన్నారు. డిసెంబర్ నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిచే ప్రారంభించడానికి టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, మౌలిక వసతులను పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
శాసన సభ్యులు, మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో పాలకులు టిడ్కో గృహాలను నిర్మించకుండా కాలయాపన చేశారన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మూడేళ్లలోనే 8,912 టిడ్కో గృహాల నిర్మాణాలను పూర్తి చేయగలిగామన్నారు. డిసెంబర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం రోజున ఈ గృహాలను లాంఛనంగా ప్రారంభించి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. అందుకు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రూ.55 కోట్లతో వాటర్ ట్యాంకుల నిర్మాణం, విద్యుత్, డ్రైనేజీ, రోడ్లు వంటి మౌలిక వసతులు పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.
అంతక ముందు కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యే కొడాలి నాని ఇరువురు అక్కడ జరుగుతున్న పనులను గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, టిడ్కో ప్రాజెక్ట్ అధికారి బి.చిన్నోడు, గుడివాడ ఆర్డీవో పి.పద్మావతి, గుడివాడ తాసిల్డారు కె.ఆంజనేయులు, హౌసింగ్ పిడి రామచంద్రన్, గుడివాడ ఎంపిడిఓ వెంకట రమణ, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, డి ఈ బాలాజీ నాయక్, హౌసింగ్, విద్యుత్ ఏఈ లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News