Breaking News

గోదావరి ఆర్చ్ వంతెనపై గరిష్ఠ వేగాన్ని పెంచిన దక్షిణ మధ్య రైల్వే…

-వేగ పరిమితి గంటకు 50 కిలోమీటర్లకు పెంపు
-ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనుల నిర్వహణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైల్వే ట్రాక్ మరమ్మతులపై దృష్టిని కేంద్రీకరించడం మరియు అత్యంత భద్రతతో పాటు పరిమితులకు లోబడి వీలయిన చోట్లలో గరిష్ఠ వేగాన్ని పెంచడం కోసం దక్షిణ మధ్య రైల్వే రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నది. తదనుగుణంగా జోన్ మరో ముఖ్యమైన పని చేపట్టింది. గోదావరి – కొవ్వూరు స్టేషన్ల మధ్య గోదావరి ఆర్చ్ వంతెనపై రైళ్ల గరిష్ట వేగాన్ని గంటకు 50 కిలోమీటర్లకు పెంచేందుకు తగు చర్యలు తీసుకున్నారు. 2015 సంవత్సరం నుంచి గోదావరి వంతెనపై గరిష్ఠ వేగం గంటకు 30 కిలోమీటర్లు ఉండేది. ఇటీవల 2022 ఏప్రిల్ నెలలో వేగ పరిమితిని గంటకు 40 కిలోమీటర్లకు పెంచారు. ఆ తరువాత ఇప్పుడు వేగ పరిమితిని గంటకు 50 కిలోమీటర్లకు పెంచి జరిపిన పరీక్షలు విజయవంతమయ్యాయి. విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లను 2.9 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెనపై నడుపుతున్నారు.

గోదావరి – కొవ్వూరు మధ్య దూరం 5 కిలోమీటర్లు. ఇది గూడూరు – దువ్వాడ సెక్షనులో గ్రాండ్ ట్రంక్ రూటులో (గోల్డెన్ డయాగ్నల్) ఉంది. దేశంలోని దక్షిణాది రాష్ట్రాల నుంచి తూర్పు మరియు ఈశాన్య ప్రాంతానికి ఈ వంతెన వారధి వంటిది. గోదావరి నదిపై 2.9 కిలోమీటర్ల పొడవున్న కమాను వంతెనపైన రైళ్లను గరిష్ట సామర్ధ్యంతో నడుపుతున్నందున ప్రయాణీకుల, సరుకుల రవాణాలో ఇది కీలకంగా మారింది. అంతేకాక ఈ సెక్షను పూర్తిగా సంతృప్తమైంది. అతి ముఖ్యమైన గోదావరి నదిపై ఈ వంతెన ఉన్న ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకొని 2015 నుంచి గత ఏప్రిల్ వరకు గంటకు 30 కిలోమీటర్లకు మించి వెళ్ళగూడదనే పరిమితి ఉండేది.

అప్పటి నుంచి వంతెనపై గరిష్ఠ వేగాన్ని గంటకు 30 కిలోమీటర్లకు పరిమితం చేశారు. అయితే ఇటీవల దక్షిణ మధ్య రైల్వే అధికారులు అధునాతన యంత్రాలతో సవాళ్లతో కూడిన పరీక్షలు జరిపడమే కాకుండా కఠినమైన పని పరిస్థితుల్లో స్లీపర్లను మార్చేందుకు చర్యలు తీసుకున్నారు. తద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి గరిష్ఠ వేగాన్ని గంటకు 40 కిలోమీటర్లకు పెంచడం సాధ్యమైంది. ఇప్పుడు వేగానికి సంబంధించిన పరీక్షలు జరిపి ప్రయాణీకుల రైళ్లు, గూడ్స్ రైళ్ల వేగాన్ని గంటకు 50 కిలోమీటర్లకు పెంచి రైళ్లను విజయవంతంగా నడుపుతున్నారు.

జోన్ కు సంబంధించిన ముఖ్యమైన ఈ పనిని అంకిత భావంతో పూర్తిచేసిన సిబ్బందిని, ప్రత్యేకంగా ఇంజనీరింగ్ బృందాన్ని ఇంచార్జి జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు. తూర్పు పశ్చిమాలకు వారధిగా ఉన్న ఈ వంతెనపై రైళ్ల రాకపోకల వేగాన్ని పెంచడం వల్ల రద్దీ తగ్గుతుంది. అంతేకాక రైలు సర్వీసులు నిర్వహణ సునాయాసమవుతుందని, రైలు సర్వీసుల సమయపాలన పెరుగుతుందని, రైలు ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *