Breaking News

జనరంజక పాలన జగనన్నతోనే సాధ్యం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-27వ డివిజన్ 199 వార్డు సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ద్వారా దళారీ వ్యవస్థకు తావులేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛమైన పాలనను అందిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గురువారం 27 వ డివిజన్ 199 వ వార్డు సచివాలయ పరిధిలో స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాం, పార్టీ శ్రేణులతో కలిసి మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. దుర్గాపురంలోని రాజీవ్ గాంధీ స్ట్రీట్, సుందర్ నగర్ కాలనీ, తొట్టెంపూడి రాఘవయ్య వీధి, గణపతి రావు వీధులలో విస్తృతంగా పర్యటించి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. వార్డు సచివాలయ పరిధిలోని 927 గృహాలలో, 340 గడపలను సందర్శించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సిఫార్సులతో ప్రమేయం లేకుండా, ఎక్కడా అవినీతికి తావులేకుండా తమకు ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందుతున్నాయని మహిళలు, వృద్ధులు ఎమ్మెల్యేకు వివరించారు. గతంలో ఏ ప్రభుత్వం పేదల కోసం ఇన్ని పథకాలను అమలు చేయలేదని.. సీఎం జగన్ తోనే అది సాధ్యమైందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన గురించి, అందిస్తున్న పథకాల గురించి ప్రజలు ఎంతో గొప్పగా చెబుతుంటే సంతోషంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలే చెబుతున్నారన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 96 వార్డు సచివాలయాలు నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్నట్లు ఈ సందర్భంగా వివరించారు.

రాష్ట్ర ప్రజానీకానికి ఓ మంచి ఫ్యామిలీ డాక్టర్ లా జగనన్న సర్కారు
చంద్రబాబు పాలనలో పేద రోగులు ఆర్థిక భారంతో తీవ్రంగా చితికిపోయేవారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. కానీ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు వివరించారు. ఆగష్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో ప్రభుత్వ వైద్యాన్ని గ్రామీణ ప్రాంత పేదలకు మరింత చేరువ చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 104 వాహనాల సంఖ్యను పెంచడం, ప్రతి సచివాలయానికి నెలలో రెండుసార్లు వాహనాలు వెళ్లేలా నిబంధనలు రూపొందించడం జరిగిందన్నారు. ఒక వైద్యుడు పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తుంటే మరో డాక్టర్ 104 వాహనాలతో గ్రామీణ ప్రాంతాలను సందర్శిస్తారని తెలిపారు. కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని ఫ్యామిలీ డాక్టర్ రికార్డు చేయడంతో పాటు తగిన సూచనలు ఇస్తారన్నారు. అవసరమైన మందులను పంపిణీ చేస్తారని తెలిపారు. ఇప్పటికే నగరాలు, పట్టణాలలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ల పేరుతో వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. అయోధ్యనగర్ తో పాటు వాంబే కాలనీ, దేవీనగర్, ఇందిరానాయక్ నగర్ లలో ఒక్కొక్కటి రూ. 80 లక్షల వ్యయంతో చేపట్టిన 4 హెల్త్ సెంటర్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు. వీలైనంత త్వరలో సేవలను నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.

విపక్షాలు డ్రామా పాలిటిక్స్ మానుకోవాలి
వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ తానున్నాంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఏ ఒక్క బాధితుడికి సహాయం అందలేదనే మాట రాకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం చక్కటి పనితీరు కనబరుస్తోందన్నారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు ప్రతీది రాజకీయం చేస్తున్నాయని.. నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలు ఇవ్వడంపోయి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ ప్రతి ఒక్క బాధితుని వద్దకు వెళ్లి పరామర్శిస్తుంటే టీడీపీ పరిస్థితి ఏడుపే ఏడుపుగా తయారైందన్నారు. చంద్రబాబు తన పర్యటన మొత్తంలో ఏ ఒక్కరి చేత ప్రభుత్వం నుంచి సహాయం అందలేదనే మాట చెప్పించలేకపోయారన్నారు. దీంతో చేసేది లేక ఎల్లో మీడియా ద్వారా అసత్యాలను ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో వరదలు, కరువు వస్తే బాధితులకు తక్షణ సాయంగా ఒక్క రూపాయి అయిన అందించారా..? సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు రహదారులపై నారాలోకేష్ చేస్తున్న డ్రామా పాలిటిక్స్ ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని.. ఇకనైనా దిగజారుడు రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, నాయకులు కురిటి శివ, బొప్పన గాంధీ, పిల్లుట్ల వంశీ, మండా రాము, తుపాకుల చంద్రశేఖర్, కిలారు కోటి, కణిజం కనక, కోన చిట్టెమ్మ, షేక్ కాజా, మదీనా, ఆకుల రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *