Breaking News

పరిశ్రమలకు 24 x 7 నాణ్యమైన విద్యుత్…మాది పూచి

-ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , కే విజయానంద్
-పరిశ్రమలో ఇంధన సామర్థ్యం, సాంకేతికత అమలుకు ప్రభుత్వ ప్రోత్సాహం
-ఇందుకోసం భారీ పరిశ్రమల్లో పాట్ పథకం అమలు
-రాష్ట్రంలో పాట్ ఫలితాలను ప్రకటించిన ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
-దాదాపు రూ 5709 కోట్ల విలువైన 0. 818 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వివలెంట్(ఎంటీఓఈ) ఇంధనం ఆదా
-2.464 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గుదల
-పాట్ అమలులో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఆంధ్ర ప్రదేశ్
-పరిశ్రమలకు 24 x 7 విద్యుత్ సరఫరా తో పారిశ్రామిక ప్రగతి, ఆర్థికాభివృద్ధి , ఉపాధి కల్పన
-పరిశ్రమల విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎప్పటికపుడు ఆధునీకరించండి- ముఖ్య మంత్రి
-ఇంధన సామర్థ్యం తో పరిశ్రమల విద్యుత్ పొదుపు , ఉత్పత్తి వ్యయం తగ్గుదల , నాణ్యమైన ఉత్పత్తితో ఆర్థిక ప్రయోజనాలు
-పాట్ వర్క్ షాప్ ను ప్రారంభించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే విజయానంద్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పరిశ్రమలకు 24 x 7 నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. దీనివల్ల పారిశ్రామిక అభివృద్ధి తో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఉపాధికల్పన మెరుగవుతాయని ఆయన పేర్కొన్నారు .
భారీ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యం , సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన పెర్ఫార్మ్ , అచీవ్, ట్రేడ్ (పాట్) పథకం పై అవగాహనా సదస్సు బుధవరం నాడు విజయవాడ లో జరిగినది . రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీ ఎస్ఈ సిఎం) నిర్వహించిన ఈ సదస్సులో రాష్ట్రంలోని వివిధ భారీ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్పెషల్ సి ఎస్ విజయానంద్ రాష్ట్రంలో పాట్ పథకం ఫలితాలను ప్రకటించారు. రాష్ట్రంలోని 36 భారీ పరిశ్రమల్లో దాదాపు రూ 5709 కోట్ల విలువైన 0. 818 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వివలెంట్(ఎంటీఓఈ) (బొగ్గు, చమురు, గ్యాస్, లిగ్నైట్ మొదలైన వాటిని కలిగి ఉంటుంది) ఇంధనం ఆదా అయిందని పేర్కొన్నారు. అంతే గాక 2.464 మిలియన్ టన్నుల మేర కార్బన్ ఉద్గారాలు తగ్గాయని తెలిపారు . రాష్ట్రంలో పాట్ పథకం వల్ల భారీ పరిశ్రమలలో ఇంధన సామర్థ్యం పెరిగిందని పేర్కొన్నారు.
పరిశ్రమలకు 24 x 7 నిరంతర, నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలనే దృఢ నిశ్చయం తో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు . అయితే విద్యుత్ ను సమర్థవంతంగా వినియోగించుకోవటం ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ను ఆదా చేయటమే కాకుండా పారిశ్రామిక ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని మరింత నాణ్యమైన ఉత్పత్తులు సాధించవచ్చునని ఆయన పేర్కొన్నారు.
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ అమలు చేస్తున్న పాట్ పథకాన్ని భారీ పరిశ్రమలు సమర్ధ వంతంగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసారు. ఈ పథకంలో భాగంగా నూతన ఇంధన సామర్ధ్య సాంకేతికత సహాయంతో తక్కువ విద్యుత్ తో ఎక్కువ పారిశ్రామిక ఉత్పత్తి సాధించడం పై అవగాహన పెంచుకొని అమలు చేయాలని కోరారు.
పాట్ పథకం కింద ఇంధన పొదుపు లక్ష్యాలను సాధించిన పరిశ్రమలకు ఇంధన పొదుపు సర్టిఫికెట్లను బీఈఈ మంజూరు చేస్తుందని తెలిపారు. వీటిని మార్కెట్లో విక్రయించడం ద్వారా ఆయా పరిశ్రమలు ఆర్థిక ప్రయోజనాలు పొందుతాయని తెలిపారు. అలాగే ఇంధన పొదుపు లక్ష్యాలను సాధించలేని పరిశ్రమలు సదరు ఇంధన పొదుపు సర్టిఫికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. పరిశ్రమలలో ఆధునిక ఇంధన సమర్ధ వినియోగ సాంకేతికతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం పాట్ పథకాన్ని అమలు చేస్తున్నదని వివరించారు.
పరిశ్రమలకు 24 x 7 విద్యుత్ సరఫరాతో పాటు వాటిలో సమర్ధ ఇంధన వినియోగం పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని విజయానంద్ పేర్కొన్నారు. పాట్ పథకం అమలులో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు . పరిశ్రమల నిర్వహణలో విద్యుత్ సరఫరా కీలక పాత్ర పోషించే దృష్ట్యా పారిశ్రామిక విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎప్పటికపుడు ఆధునీకరించి మరింత బలోపేతం చేయాలనీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆదేశించారు.
అవాంతరాలు లేని నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా నాణ్యమైన పారిశ్రామిక ఉత్పత్తికి దోహదకారి అవుతుందని ఆయన తెలిపారు. దీనివల్ల వృద్ధి రేటు పెరగడంతో పాటు ఆర్థికాభివృద్ధి , ఉపాధి కల్పనకు దోహదకారి అవుతుందని తెలిపారు. భారీ పరిశ్రమల్లో ప్రత్యేకంగా విద్యుత్ క్యాప్టివ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే 24x 7 నిరంతర విద్యుత్ ను సరఫరా చేస్తున్నదని ఆయన తేలిపేరు. దీనివల్ల పరిశ్రమలు విద్యుత్ పై చేసే వ్యయం పెద్ద ఎత్తున తగ్గుతుందని తెలిపారు.
రాష్ట్రంలోని ఇటీవల కాలంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం బాగా పెరిగిందని ఆయన తెలిపారు. విశాఖపట్నం లో 2018-19 విద్యుత్ డిమాండ్ తో పోలిస్తే 2021-22 లో 21. 9 శాతం విద్యుత్ డిమాండ్ పెరిగిందని తెలిపారు.
పాట్ పథకం లోని మరిన్ని పరిశ్రమలను తీసుకురావడం ద్వారా రాష్ట్రంలోని ఇంధన సామర్థ్యం మరింత మెరుగవుతుందని పరిశ్రమకు విద్యుత్ ను పెద్ద ఎత్తున ఆదా చేయవచ్చునని పేర్కొన్నారు. తద్వారా అటు పరిశ్రమలతో పాటు ఇటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని తెలిపారు.
పాట్ పథకం అమలుకు సహకారం అందిస్తున్న రాష్ట్ర పరిశ్రమల శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు . ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు పరిశ్రమల శాఖ సహకారం కొనసాగించాల్సిందిగా కోరారు . రాష్ట్రంలో పాట్ పథకం అమలుకు సహకారం అందిస్తున్న బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ (బీఈఈ) కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందింస్తుందని తెలిపారు. ఇందుకోసం పారిశ్రామిక వేత్తలు కూడా తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేసారు.
ఈ సందర్భంగా ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలోని పద్మ సిరామిక్స్లో ఐఐటీ హైదరాబాద్తో కలిసి ఎంఎస్ఎంఈల్లో ఐఓటీ ఆధారిత ప్రదర్శన ప్రాజెక్టును ఏపీఎస్ఈసీఎం అమలు చేసిందన్నారు. ప్రాజెక్ట్ విజయవంతమైందని మరియు వినూత్నమైన IOTటెక్నాలజీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని తెలిపారు. . అలాగే, ఏపీ ఎస్ఎస్ఈసిఎం 65 ఎంఎస్ఎంఈ యూనిట్లలో IoT పవర్ మానిటరింగ్ పరికరాలను ఇన్స్టాల్ చేసింది. దీని ద్వారా పరికరాల పవర్ ఫ్యాక్టర్ను మెరుగుపరచడానికి పరికరాల జీవితాన్ని మరియు వాటి ఉత్పాదకతను మెరుగుపరచడానికి దోహదపడుతుందని ఆయన తెలిపారు. దీనివల్ల ఎంఎస్ఎంఈ లు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారని తెలిపారు.
ఏపీఎస్ఈసిఎం సి ఈ ఓ , ఏ చంద్ర శేఖర రెడ్డి, ఫిక్కీ సంస్థ జాయింట్ డైరెక్టర్ పుష్పేంద్ర నాయక్, కిషోర్సింగ్ పాటిల్, అసోసియేట్ మేనేజర్ టెక్, ఈఈఎస్ఎల్ , మాల్వీ మెహ్రోత్రా, ప్రాజెక్ట్ ఎకనామిస్ట్, బీఈఈ మరియు సిమెంట్, పవర్ ప్లాంట్, స్టీల్ వంటి వివిధ పరిశ్రమల ప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *