-చరవాణిలో శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రి, ముఖ్యమంత్రి
-హర్దిక శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ 89వ జన్మదిన వేడుకలు అతి నిరాడంబరంగా జరిగాయి. విజయవాడ రాజ్ భవన్ వేదికగా బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి కరోనా నేపధ్యంలో అతి కొద్దిమందిని మాత్రమే అనుమతించారు. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చరవాణి ద్వారా గవర్నర్ కు శుభాకాంక్షలు చెప్పారు. ఆయురారోగ్యాలతో ప్రజా జీవితంలో మరిన్ని సంవత్సరాలు వెలుగొందాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయిడు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ దీర్ఘాయుషుతో నిండు నూరేళ్లు ఫలప్రదమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నిజాయితీతో కూడిన జీవితానికి చిరునామాగా నిలిచారని, మీ జీవితం మరింత శోభాయమానంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో కొనసాగాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సందేశంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండు జీవితం గడపాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ శుభాకాంక్షలు అందిస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పరిపూర్ణ జీవితం గడపాలని ఆకాంక్షించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన సందేశం విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ పురోగమనానికి మీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఎంతో ఉపయుక్తమన్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, శాసన పరిషత్తు సభ్యుడు తలశిల రఘురామ్, వైసిపి రాష్ట్ర కార్యాలయ ఇన్ చార్జి, ఎంఎల్సి లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు. గవర్నర్ వారి ప్రత్యేక ప్రదాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, వెనకబడిన తరగతుల శాఖ సంచాలకులు అర్జున రావు, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్, రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ అధికారి మాధవ రెడ్డి, వైద్య ప్రముఖులు బూసి నరేంద్ర రెడ్డి తదితరులు గవర్నర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కనకదుర్గమ్మ దేవస్దానం వేదపండితులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించి ప్రసాదాలు అందచేసారు. గవర్నర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ తరుపున నగరంలో ఎస్ కె సివి బాలల ట్రస్ట్ కు చెందిన అనాధ బాలలకు ప్రత్యేకంగా భోజనం అందించారు.
Prajavartha Online Telugu News