విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు నిరంతర కృషి చేయాలని పాఠశాల విద్య ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ ఐ.ఏ.ఎస్ అన్నారు. సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన 75వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి వల్ల విద్యావ్యవస్థ ప్రణాళిక మొత్తం మారిపోయిందన్నారు. ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలను నూతన విధానంతో ప్రారంభించాల్సిన ఆవశ్యతక ఎంతైనా ఉందని, విద్యావ్యవస్థను పరిపుష్టం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ‘మన బడి: నాడు- నేడు’ ద్వారా ప్రైవేటు పాఠశాలలకంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని, ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ వైపు చూసేలా మనమంతా ముందుకు సాగాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కాలంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించిన అందరికీ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్. సురేష్ కుమార్ (ఐ.ఏ.ఎస్), సమగ్ర శిక్షా అదనపు రాష్ట్ర పథక సంచాలకులు కె. నాగేశ్వర్ రావు, రాష్ట్ర SCERT డైరెక్టర్ బి. ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News