-అధికారులకు ఆదేశాలు : కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, సోమవారం 18వ డివిజన్ పరిధిలోని కృష్ణలంక, రాణిగారి తోట ప్రాంతములోని పలు వీధులలో పారిశుధ్యo మరియు అండర్ గ్రౌండ్ డ్రెయినేజి నిర్వహణ విధానమును పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. డివిజన్ పరిధిలో పారిశుధ్య కార్మికుల మస్తరు విధానము పరిశీలించారు. రాణిగారి తోట ప్రాంతములోని పలు వీధులలో స్థానికులను మంచినీటి సరఫరా విధానము, ప్రతి రోజు చెత్త సేకరణకు మరియు డ్రెయిన్స్ శుభ్రపరచుటకు సిబ్బంది వస్తున్నది లేనిది అడిగితెలుసుకొని ఎవరు చెత్తను వీధులలో లేదా డ్రెయిన్ లలో పడవేయకుండా చెత్త సేకరణకు వచ్చు పారిశుధ్య సిబ్బందికి అందించి పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదే విధంగా డివిజన్లో ఇంటింటి చెత్త సేకరణ విధానము మరియు డ్రెయిన్ నందు మురుగునీటి పారుదల తీరును పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇస్తూ, డ్రెయిన్ లలో నీటి పారుదలకు అడ్డంగా ఉన్న చెత్త మరియు వ్యర్ధములను తొలగించాలని, నూరు శాతం డోర్ టు డోర్ బాస్కెట్ కలెక్షన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజికి సంబందించి యంత్రముల ద్వారా మ్యాన్ హోల్స్ శుభ్రపరచు విధానము స్వయంగా పరిశీలిస్తూ, యు.జీ.డి నందలి మురుగునీటి పారుదలలో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా మ్యాన్ హోల్స్ పొంగిపొర్లకుండా ఎప్పటికప్పుడు మ్యాన్ హోల్స్ నందలి సిల్ట్ తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పర్యటనలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పి.రత్నావళి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్ర శేఖర్, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News