
-ఏపి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
-సమగ్ర సమాచారంతో రూపొందించారంటూ ప్రముఖ డయాబెటిస్ వైద్య నిపుణులు కె.వేణుగోపాల రెడ్డికి ప్రశంసలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
నానాటికీ పెరుగుతున్న మధుమేహ వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పించడంతో పాటు వ్యాధి నియంత్రణకు విశేషంగా సేవలందిస్తున్న ప్రముఖ డయాబెటిస్ వైద్య నిపుణులు కె.వేణుగోపాల రెడ్డి(వీజీఆర్) రూపొందించిన డయాబెటిస్ అట్లాస్ బుక్ ప్రజలకు ఒక వరమని ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మధుమేహ వ్యాధి నివారణకు సమగ్ర సమాచారంతో దాదాపు 170 పేజీలతో కె.వేణుగోపాల రెడ్డి(వీజీఆర్) రూపొందించిన డయాబెటిస్ అట్లాస్ బుక్‌ను సోమవారం తాడేపల్లిలోని సజ్జల రామకృష్ణారెడ్డికి ఆయన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… మధుమేహ వ్యాధిని అశ్రద్ధ చేయడం వల్ల అనేక దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇటువంటి కీలకమైన సమయంలో వీజీఆర్ డయాబెటిస్ అట్లాస్ బుక్ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించడం పట్ల డాక్టర్ వేణుగోపాల రెడ్డిని ప్రశంసించారు. రోగులపై వ్యాధి ఏ విధంగా ప్రభావం చూపుతుందో చిత్రాలతో చక్కగా అవగాహన కల్పించారని డాక్టర్ వేణుగోపాలరెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా మధుమేహ వ్యాధి పట్ల ప్రజల్లో తీసుకొస్తున్న చైతన్యం గురించి తెలుసుకుని వీజీఆర్ డయాబెటిస్ అట్లాస్ బుక్‌ను ఆవిష్కరించారు. అదేవిధంగా డాక్టర్ వేణుగోపాల రెడ్డి వీజీఆర్ చారిటబుల్ ట్రస్టు తరఫున విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలకు సంబంధించి చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకుని అభినందించారు. సామాజిక బాధ్యతగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు అవగాహన, వైద్య శిబిరాల ద్వారా చైతన్యం కల్పించడం కోసం తాను చేస్తున్న కృషిని డాక్టర్ వేణుగోపాల రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి వివరించారు. పర్యావరణ పరిరక్షణకు దాదాపుగా ఇప్పటివరకు 40వేల మొక్కల పంపిణీ చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో డయాబెటిస్ అట్లాస్ బుక్‌ను ఇతర భాషల్లోకి అనువదించేందుకు కృషి చేస్తానని డాక్టర్ వీజీఆర్ పేర్కొన్నారు. తాను రూపొందించిన డయాబెటిస్ అట్లాస్ బుక్‌ను ఇప్పటివరకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్, హర్యాణా గవర్నర్నర్లు బిశ్వభూషణ్ హరిచందన్, బండారు దత్తాత్రేయ, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులకు అందజేసినట్లు వీజీఆర్ వెల్లడించారు. కార్యక్రమంలో స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చల్లా మధుసూదన రెడ్డి, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహన్‌రావు, ఓఎస్డీ దశరధరామిరెడ్డి, బీమవరపు కోటిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News