Breaking News

2023 ఏప్రిల్ 14న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ

– హర్యానాలో నమూనా విగ్రహాన్ని పరిశీలించిన మంత్రుల బృందం

అమరావతి/న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజా వార్త :
దేశంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోఆవిష్కరించనున్నామని అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఛైర్మెన్, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. డా.బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్ నమూనా విగ్రహాన్ని మంగళవారం మంత్రులు అధికారుల బృందంతో కలిసి హర్యానాలోని స్టుడియోలో పరిశీలించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం స్వరాజ్ మైదాన్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులను ప్రతి రోజూ సమీక్షించడం జరుగుతోందని, విగ్రహ నిర్మాణ పనుల్లో ఎక్కడా ఆలస్యం జరగకుండా అన్ని చర్యలూ తీసుకుంటోందని చెప్పారు. 2023 ఏప్రిల్ 14న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించడం జరుగుతుందని తెలిపారు. దేశంలోనే మరెక్కడా కూడా ఇంత పెద్ద అంబేద్కర్ విగ్రహం లేదని స్పష్టం చేసారు. అంబేద్కర్ భావజాలాన్ని భుజానవేసుకొని పని చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కారణంగానే ఈ విగ్రహ నిర్మాణ పనులు అనుకున్న సమయానికే పూర్తయ్యేదిశగా శరవేగంగా జరుగుతున్నాయని నాగార్జున పేర్కొన్నారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ బాబాసాహెబ్ మాట్లాడుతూ,బి ఆర్ అంబేద్కర్ భావజాలం కలిగిన వ్యక్తి మన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. విజయవాడ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని సంకల్పించటం, అందుకు అవసరమైన చర్యలు చకచక జరిగిపోవటం అంబేద్కర్ పై అయనకున్న అభిమానం గౌరవాన్ని చూపుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు జగనన్న వెంటే ఉన్నారని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా విజయవాడ లో విగ్రహ ఏర్పాటు కార్యక్రమం జరుగుతుందన్నారు. హర్యానాలోని స్టుడియోలో 125 అడుగుల ఎత్తయిన నమూనా విగ్రహాన్ని మంత్రులు పరిశీలించారు. బంక మట్టితో చేసిన అంబేద్కర్‌ విగ్రహ నమూనాను పరిశీలించి విగ్రహ నిర్మాణానికి ఆమోదం తెలపడం కోసం మంత్రులు, అధికారుల ఈ బృందం ఢిల్లీకి వెళ్లింది. మేరుగు నాగార్జునతో పాటు ఢిల్లీకి వెళ్ళిన వారిలో ఉప ముఖ్యమంత్రి,దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి జయలక్ష్మి, ఎపిఐఐసి వీసీ, ఎండి సుబ్రమణ్యం జవ్వాది, ఎపిఐఐసి ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌, కెపిసి ప్రాజెక్ట్స్‌ ఎమ్‌డి అనిల్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు. నమూనా విగ్రహ పరిశీలన అనంతరం అసలు విగ్రహ నిర్మాణం మొదలవుతుందని మంత్రులు పేర్కొన్నారు. రాబోయే అంబేద్కర్‌ జయంతి నాటికి ఈ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమవుతుందని వెల్లడించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *