– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు.. దేశంలో మన రాష్ట్రంలోనే అధికమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. శనివారం గులాబీతోటలోని 200 సచివాలయ పరిధిలో స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాంతో కలిసి ఆయన ఇంటింటికీ పింఛన్లను పంపిణీ చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా ఏపీలో వైఎస్సార్ పెన్షన్ కానుక పథకాన్ని సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. తెల్లవారుజామున 6 గంటల నుంచే అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడికి వాలంటీర్లు వెళ్లి పింఛన్ డబ్బును అందజేస్తున్నట్లు తెలియజేశారు. డోర్ డెలివరీ పద్ధతిలో పెన్షన్లు అందజేయడం దేశంలోనే తొలిసారి అని కితాబిచ్చారు. అదే చంద్రబాబు గత పాలనలో పింఛన్ల కోసం లబ్ధిదారులు రోజుల తరబడి కార్యాలయాల బయట పడిగాపులు కాసే దయనీయ పరిస్థితులు ఉండేవన్నారు. పైగా 5 డివిజన్లకు కలిపి ఒకచోట ఎండలో కూర్చోబెట్టి పింఛన్ దారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవారని గుర్తుచేశారు. అటువంటి అమానవీయమైన విధానానికి సీఎం జగన్ స్వస్తి పలికారన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటివద్దకే పెన్షన్ అందిస్తుండటంతో పింఛనుదారులకు వ్యయప్రయాసలు తప్పాయని పేర్కొన్నారు. అంతేకాకుండా చంద్రబాబు గత ప్రభుత్వం పింఛన్లలో పెద్దఎత్తున కోతలు విధించేదని.. కానీ పింఛన్ అర్హతను 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించిన ఘనత సీఎం వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. గతంలో వికలాంగులకు రూ.1,500 మాత్రమే అందే పింఛన్ ను.. సీఎం వైఎస్ జగన్ రూ.3 వేలుకు పెంచారన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు గత ప్రభుత్వం కేవలం రూ.2,500 మాత్రమే ఇస్తే.. తమ ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
శాచ్యురేషన్ విధానంలో అర్హత గల ప్రతిఒక్కరికీ పింఛన్
తెలుగుదేశం హయాంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే రాష్ట్రంలో పెన్షన్లు అందేవని.. ఇందుకోసం నెలకు రూ. 420 కోట్లు ఖర్చు అయ్యేదని మల్లాది విష్ణు తెలిపారు. కానీ ఈ ప్రభుత్వంలో 62.53 లక్షల మందికి పైగా నెలకు రూ. 1,590.50 కోట్లు అందజేస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది దాదాపు 4 రెట్లు అధికమన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి టీడీపీ హయాంలో కేవలం 16,200 మందికి మాత్రమే అందే పింఛన్లను.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 48,714 మందికి పెంచడం జరిగిందన్నారు. అలాగే సెంట్రర్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 17 వేలు మాత్రమే ఉన్న పింఛన్లను 25,428 కి పెంచి ప్రతినెలా రూ.6.55 కోట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఒక్క 27వ డివిజన్లోనే 208 మందికి ప్రతినెలా 5 లక్షల 34 వేల 500 రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. అర్హులందరికీ తాము పింఛన్ అందజేస్తున్నామని చెప్పడానికి ఈ అంకెలే నిదర్శనమని పేర్కొన్నారు. పైగా ఏడాదికి రెండుసార్లు ఆగష్టు మరియు డిసెంబర్ మాసాలలో నూతన పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. తొలి విడతకు సంబంధించి నియోజకవర్గంలో ఆగష్టు నెలలో 1,460 మందికి నూతన పింఛన్లు మంజూరు చేయగా.. డిసెంబర్ మాసంలో రెండో విడత ఉంటుందని తెలియజేశారు. కనుక అర్హులైన ప్రతిఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు పిల్లుట్ల వంశీ, కురిటి శివ, బొప్పన గాంధీ, వి.బి.ఆచారి, లంకా కుమార్, మండా రాము, బాడిత అప్పారావు, బుచ్చిబాబు, అనిల్, సచివాలయ సిబ్బంది, పింఛన్ దారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News