-వాల్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ వ్యవస్థలన్నింటినీ బ్రష్టు పట్టించిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులన్నీ ఏకం కావడంతోపాటు, కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణ అత్యంత ఆవశ్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా అమలు చేస్తున్న ఆర్థిక విధానాల ఫలితంగా అంబానీ, అదానీల ఆస్తులు లక్షల కోట్లకు పడగలెత్తుతుండగా, పేదలు మరింత నిరుపేదలుగా మారుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత కటిక దరిద్రులున్న దేశంగా భారత్ ఉంది. ఈ నేపధ్యంలో కార్పొరేట్ విధానాలకు స్వస్తి పలికి, దానికి ప్రత్యామ్నాయంగా రైతు, కూలీ, కార్మిక, కష్టజీవుల సంక్షేమం, అభివృద్ధికి అవసరమైన ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. విజయవాడలో ఈనెల 14నుంచి 18వ తేదీ వరకు జరుగనున్న సీపీఐ జాతీయ మహాసభల్లో ఈ మూడు అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు రామకృష్ణ తెలిపారు. విజయవాడ దాసరి భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ జాతీయ మహాసభలను పురస్కరించుకుని ఈనెల 14వ తేదీ విజయవాడ నగరంలో జరుగనున్న మహా ప్రదర్శన,బహిరంగ సభలను జయప్రదం చేయాలని కోరుతూ ముద్రించిన వాల్పోస్టర్ను సీపీఐ రాష్ట్ర నేతలతో కల్సి రామకృష్ణ విడుదల చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తూ వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిందన్నారు. పాలనాపరంగా అన్ని రంగాల్లో ఘోర వైఫల్యం చెందిందన్నారు. 2014 ఎన్నికల్లో, ఆతర్వాత 2019లో ఇచ్చిన ఎన్నికల వాగ్ధానాలను సైతం ఏ ఒక్కటీ మోదీ అమలు చేయలేదన్నారు. బీజేపీకి అధికారమిస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని, రైతు ఆత్మహత్యలను సంపూర్ణంగా నిషేధిస్తానని ప్రగల్భాలు పలికిన మోదీ, అన్నదాతల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశాడని విమర్శించారు. గత 8 ఏళ్ళలో రైతుల ఆదాయం ఏమాత్రం పెరగకపోగా, ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. అలాగే రెండు కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఎన్నికల సందర్భంగా వాగ్ధానమిచ్చి, కొత్తగా ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉపాధి అవకాశాలను కూడా దెబ్బతీశారన్నారు. గత 45 సంవత్సరాల కాలంలో ఎన్నడూలేనంత నిరుద్యోగ సమస్యను సృష్టించారని ఆయన మండిపడ్డారు. అలాగే విదేశాల్లో ఉన్న నల్లధనం వెలికితీస్తానని ప్రజలను నమ్మించి, బ్యాంకులను కొల్లగొట్టి విదేశాల్లో తలదాచుకునేవారికి కేంద్రం అండగా నిలబడుతోందన్నారు. మరోవైపు నిత్యావసర ధరలు ఆకాశన్నంటుతున్నా వాటి అదుపుకు కనీస చర్యలు చేపట్టలేదన్నారు. ఇలా ఏ ఒక్క ప్రజా సమస్యను పరిష్కరించలేని మోదీ ప్రభుత్వం, ప్రజల మధ్య మత విద్వేషాలు రగిల్చి రాజకీయ లబ్ది పొందే కుయుక్తులు పన్నుతోందన్నారు. ఈ నేపధ్యంలో దాదాపు 47 సంవత్సరాల తర్వాత సీపీఐ జాతీయ మహాసభలు జరుగనున్న విజయవాడ నగరం కీలక చర్చలకు వేదిక కాబోంతుందన్నారు. ఈ మహాసభలకు దేశంలోని 29 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, అంతర్జాతీయంగా 20 దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీ నాయకులు సౌహార్ధ్ర సందేశాలిచ్చేందుకు రానున్నట్లు చెప్పారు. 14వ తేదీ మహా ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతుందని, 15వ తేదీ నుంచి ప్రతినిధుల సభలు ప్రారంభమవుతాయని రామకృష్ణ వివరించారు. ఈ మహాసభల జయప్రదానికి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ధర్మాన వెంటనే రాజీనామా చేయాలి
మూడు రాజధానుల కోసం రాజీనామా చేస్తానంటున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు తక్షణమే రాజీనామా చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. అయితే ఆనాడు అమరావతి రాజధానికి ఎందుకు అంగీకరించారు ? గతంలో కూడా రెవెన్యూ మంత్రిగా పనిచేసిన మీరు, భూసమీకరణలో రైతులు రాజధాని నిర్మాణం కోసం భూములిస్తుంటే ఎందుకు వారికి ఇవ్వొద్దని చెప్పలేదు. ఆనాడు నోరు పెగలలేదా ? లేక పడిపోయిందా ? అని ప్రశ్నించారు. మీకు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేసి విభజన హామీల్లో భాగంగా ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ రావల్సిన నిధుల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. అలాగే విశాఖపట్నం ఉక్కు, గంగవరం పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. అప్పుడు మేం కూడా మీకు సహకరిస్తామన్నారు. మోదీని కనీసం ప్రశ్నించలేని దద్దమ్మలు, అమరావతి రైతులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పాల్పడడం దుర్మార్గమన్నారు. ధర్మాన సోదరులు జగన్కు దాసోహమనడం తప్ప, వారి వల్ల ఏమీ కాదని ఉత్తరాంధ్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైందన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చి న్యాయం కోసం రోడ్డున పడ్డ రైతు కుటుంబాలకు అండగా నిలబడాల్సింది పోయి, రైతులది దండయాత్ర అంటూ రెచ్చగొట్టడానికి సీనియర్ మంత్రిగా ధర్మానకు సిగ్గుండాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, ఏఐకేఎస్ అధ్యక్షులు రావుల వెంకయ్య, రాష్ట్ర కార్యవర్గసభ్యులు జల్లి విల్సన్, అక్కినేని వనజ, పి.హరినాథ రెడ్డి, జి.ఈశ్వరయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, రైతు సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కేవీవీ ప్రసాద్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎన్. లెనిన్ బాబు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News