Breaking News

విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు


-అంతిమ లక్ష్యం– క్వాలిటీ కరెంటు .. సంస్థల్లో జవాబుదారీతనం పెంపు
-దేశ వ్యాప్తంగా సాంప్రదాయ మీటర్ల స్థానంలో 25 కోట్ల స్మార్ట్ మీటర్లు అమర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
-రాష్ట్ర ఇంధన శాఖ అధికారులతో సమావేశమైన కేంద్ర ప్రభుత్వ , బ్రిటిష్ హై కమిషన్ అధికారులు – స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పై చర్చ
-స్మార్ట్ మీటర్లతో నాణ్యమైన విద్యుత్, కచ్చితమైన విద్యుత్ బిల్లులు, అత్యుత్తమ సేవలు
-విద్యుత్ సంస్థల్లో జవాబుదారీతనం, పారదర్శకత, సామర్థ్యం పెంపు, సాంకేతిక వాణిజ్య నష్టాలు తగ్గుతాయి
-స్మార్ట్ మీటర్లతో వినియోగదారులు, డిస్కాములు కూడా ఆన్లైన్ లో విద్యుత్ వినియోగాన్ని మానిటర్ చేయవచ్చు
-స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ వినియోగం ,వోల్టేజి హెచ్చుతగుల సమాచారం ఎప్పటికపుడు విద్యుత్ సంస్థలకు అందుబాటులోకి వస్తుంది
-స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ డిమాండ్ ను ముందుగానే అంచనా వేసి తగిన చర్యలు తీసుకునే వెసులుబాటు డిస్కాములకు లభిస్తుంది — బ్రిటిష్ హై కమిషన్ అధికారులు
-ఆంధ్ర ప్రదేశ్ లో సాంకేతిక, వాణిజ్య నష్టాలు 2021-22 లో 11. 21 శాతానికి తగ్గాయి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చేపట్టిన స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్ ను ఆంధ్ర ప్రదేశ్ లో అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్, కచ్చితమైన విద్యుత్ బిల్లులు , ఉత్తమ సేవలు అందించడమే గాక , విద్యుత్ సంస్థల్లో జవాబుదారీతనం, పారదర్శకత పెరిగేందుకు స్మార్ట్ మీటర్లు ఉపయోగపడతాయని భావిస్తున్నారు . విద్యుత్ సంస్థల సాంకేతిక, వాణిజ్య నష్టాలు తగ్గేందుకు కూడా ఇవి దోహదపడతాయి.
కేంద్ర విద్యుత్ శాఖ , బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన ఫారిన్ కామన్ వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ (ఎఫ్సిడీఓ) సంయుక్తంగా ఆంధ్ర ప్రదేశ్ డిస్కాముల అధికారులకు స్మార్ట్ మీటర్ల పై ఒక అవగాహనా సదస్సును నిర్వహించారు. దీని వివరాలను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి తెలియచేసారు.
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ విద్యుత్ మీటర్ల స్థానంలో దాదాపు 25 కోట్ల స్మార్ట్ మీటర్లను అమర్చాలని నిర్ణయించినట్లు విజయానంద్ తెలిపారు. ఈ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిసిఎన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈ ఈ ఎస్ ఎల్) కు అప్పగించారు. సదరు సంస్థ ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ , హర్యానా , బీహార్ , రాజస్థాన్ , ఢిల్లీ రాష్ట్రాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టు అమలు ప్రారంభం అయింది
స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులకు విద్యుత్ బిల్లులల్లో ఖచ్చితత్వం ఉంటుంది, ఎలాంటి లోపాలు ఉండవు. తమ రోజువారీ విద్యుత్ వినియోగాన్ని వినియోగదారులు ఆన్లైన్ లో పరిశీలించుకోవచ్చు . విద్యుత్ పొదుపు చేసుకునేందుకు కూడా స్మార్ట్ మీటర్లు ఎంతగానో దోహదపడతాయి . అలాగే విద్యుత్ సంస్థల సాంకేతిక, వాణిజ్య పంపిణి నష్టాలు తగ్గేందుకు ఇవి దోహదపడతాయి. విద్యుత్ చౌర్యం వంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది .
విద్యుత్ వినియోగాన్ని, విద్యుత్ వోల్టేజి హెచ్చుతగ్గులను స్మార్ట్ మీటర్ రికార్డు చేస్తుంది. సదరు సమాచారాన్ని ప్రతి 15 నిముషాలకు ఒకసారి లేదా గంటకు ఒకసారి చొప్పున విద్యుత్ సంస్థలకు అందుబాటులో ఉంచుతుంది. ఈ స్మార్ట్ మీటర్లు ఇంటర్నెట్ కు అనుసంధానమై ఉండటం వల్ల విద్యుత్ వినియోగ వివరాలను డిస్కాములకే గాక వినియోగదారునికి కూడా ఎప్పటికపుడు అందుబాటులో ఉంటాయి . దీనివల్ల వినియోగదారులు తాము ఏ సమయంలో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారు తెలుసుకోగలుగుతారు.
బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ , గేరేత్ విన్ ఓవెన్ , బ్రిటిష్ హై కమిషన్ ఇంధన సలహాదారు సుష్మిత రామోజీ, మరియు కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ఇంధన శాఖ అధికారులను కలిసి ఆంధ్ర ప్రదేశ్ లో చేపట్టనున్న స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టు గురించి వివరించారు. స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ డిమాండ్ ను ముందుగానే అంచనా వేసి తగిన చర్యలు తీసుకునే వెసులుబాటు డిస్కాములకు లభిస్తుందని వివరించారు. దీనివల్ల విద్యుత్ సంస్థలకు ఆధునిక , సాంకేతిక ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి.
సాంకేతిక, వాణిజ్య నష్టాలు జాతీయ సగటు 22. 32 శాతం ఉండగా ,ఆంధ్ర ప్రదేశ్ లో 2021-22 లో సాంకేతిక వాణిజ్య నష్టాలు 11.21 శాతానికి తగ్గాయని అధికారులు తెలిపారు.
ఏపీఈపీడీసిఎల్ పరిధిలో 5 సర్కిళ్లలో స్మార్ట్ మీటర్ ప్రాజెక్టు అమలు చేసేందుకు రూ 947. 15 కోట్ల అంచనాతో అలాగే విద్యుత్ పంపిణి నష్టాలు తగ్గింపు పనులపై రూ 2578. 86 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సి ) కి సమర్పించారు. ఈ టెలీకాన్ఫెరెన్స్ లో డిస్కామ్ సిఎండీలు , కే సంతోష రావు, జె పద్మ జనార్దన రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *