విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రయోగాత్మకంగా న్యూమాటిక్ డోర్లు ఏర్పాటు చేసిన రెండు బస్సులను ఆర్టీసీ ఎం.డీ. సి.హెచ్. ద్వారకా తిరుమలరావు, IPS మంగళవారం ఆర్టీసీ హౌస్ లోని కేంద్ర కార్యాలయం దగ్గర పరిశీలించారు. ఇటీవలి కాలంలో అప్పుడప్పుడూ బస్సులలో జరుగుతున్న అవాంచనీయ ప్రమాదాలు (కదులుతున్న బస్సులలో ప్రయాణీకులు ఎక్కుతూ లేదా దిగుతూ జారిపడటం వంటివి) నివారించేందుకు సంస్థ లోని అన్ని పల్లె వెలుగు మరియు ఎక్స్ ప్రెస్ బస్సులకు న్యూమాటిక్ డోర్లఏర్పాటు దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఇప్పటికే ఆదేశించి ఉన్నారు. బస్సులోని న్యూమాటిక్ డోర్ల నియంత్రణ బటన్ ని పరిశీలించి, డ్రైవర్ తో సంభాషించారు. ప్రయాణికులు ఎక్కి దిగే సమయాలలో బస్సు ముందు భాగంలోని ఎడమ వైపు ఉండే అద్దం ద్వారా వారి కదలికలను గమనిస్తూ, కండక్టర్ సూచనలను కూడా పాటిస్తూ న్యూమాటిక్ డోర్ ను జాగ్రత్తగా నియంత్రించాలని సూచించారు. డ్యూటి చేస్తున్నంత సేపూ, ప్రయాణికుల భధ్రతే ప్రధమ ధ్యేయంగా విధులు నిర్వర్తించాలని దిశానిర్దేశం చేశారు. ఈ న్యూమాటిక్ డోర్ల వలన ఈ క్రింది ప్రయోజనాలు ఉంటాయని పరిశీలనలో గమనించడం జరిగింది.
1. కొంతమంది ప్రయాణికులు తొందర పాటుగా కదులుతున్న బస్సును ఎక్కి లేదా దిగే సందర్భాలలో జరిగే ప్రమాదాలను అరికట్టవచ్చు.
2. పాసింజర్ డోరు పూర్తిగా బస్సు డ్రైవర్ నియంత్రణలో ఉంటుంది కాబట్టి, ఏ ప్రయాణికుడు త్వరపడి కదులుతున్న బస్సు నుండి దిగే ప్రయత్నం చేయలేడు.
3. అలాగే వర్షాకాలంలో, వర్షం లేదా వర్షపు జల్లులు బస్సులోకి రాకుండా ఈ డోరు అడ్డుకుంటుంది.
4. అలాగే చలి కాలంలో చలి గాలుల నుండి ప్రయాణికులకు రక్షణగా ఈ డోరు ఉంటుంది.
5. సడన్ బ్రేకులు వేసిన సందర్భాలలో బస్సులోని ప్రయాణికుల లగేజి, ఫుట్ బోర్డులో నుండి జారకుండా అడ్డు కవచంగా ఈ డోరు ఉంటుంది.
6. ప్రమాదకరమైన ఫుట్ బోర్డు ప్రయాణాన్ని పూర్తిగా నియంత్రించ వచ్చు.
ఈ న్యూమాటిక్ డోర్లు ఏర్పాటు చేసిన బస్సులను కొద్ది రోజుల పాటు ప్రయోగాత్మకంగా నడిపి, సిబ్బంది మరియు ప్రయాణికుల అభిప్రాయాలు అధ్యయనం చేసి, సంస్థలో ఎన్ని పల్లె వెలుగు మరియు ఎక్స్ ప్రెస్ బస్సులకు ఈ న్యూమాటిక్ డోర్ల అవసరం ఉన్నదో గణాంకాలు సిద్ధం చేయాలని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఎం.డి. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. ఆదేశించారు. ఈడీ (ఇంజినీరింగ్) పి. కృష్ణ మోహన్, ఈడీ (ఆపరేషన్స్) కే.ఎస్.బ్రహ్మానంద రెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎన్.వీ. రాఘవ రెడ్డి, ఈడీ విజయవాడ జోన్ గిడుగు వెంకటేశ్వర రావు, ఎన్టీయార్ జిల్లా డి.పి.టి.ఓ. ఎం.వై.దానం, ఓ.ఎస్.డి. (కొరియర్& లాజిస్టిక్స్) జి.రవి వర్మ, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ (కమర్షియల్) చంద్ర శేఖర్ మరియు ఏ.డి. (విజిలెన్స్& సెక్యూరిటి) శోభా మంజరి తదితర అధికార బృందం ఈ పర్యవేక్షణలో ఎం.డి. తో పాటు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News