-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-60 వ వార్డు 263వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గురువారం 60 వ డివిజన్ 263 వ వార్డు సచివాలయం పరిధి B-బ్లాక్ లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డివిజన్ ఇంఛార్జి బెవర నారాయణ, కోఆర్డినేటర్ బత్తుల దుర్గారావులతో కలిసి ఆయన పాల్గొన్నారు. 350 గడపలను సందర్శించి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో పేదల జీవితాలు ఎంతగానో మెరుగుపడ్డాయని ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చల్లని పాలన ఇదేవిధంగా కొనసాగాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పాదయాత్ర ద్వారా ప్రజలకు అవసరమైన ప్రతి విషయాన్ని గమనించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అధికారం చేపట్టిన తర్వాత పథకాల ద్వారా వాటిని తీరుస్తున్నారని మల్లాది విష్ణు తెలిపారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. త్రాగునీరు, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. కూలిన సైడ్ కాల్వలను పున:నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అలాగే రేషన్ పంపిణీలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకూడదని.. ముఖ్యంగా రేషన్ వెహికల్ ప్రతి ఇంటికీ వెళ్లాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న విద్యుత్ రాయితీని పకడ్బందీగా అమలుచేయాలన్నారు. పర్యటనలో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న వార్డు సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు.
విద్యకు అత్యధిక ప్రాధాన్యత
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని మల్లాది విష్ణు తెలిపారు. చిన్నారుల బంగారు భవిష్యత్ కోసం అమ్మఒడి, నాడు–నేడు కింద పాఠశాలల్లో సకల వసతుల కల్పన, గోరుముద్ద, విద్యాకానుక, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్.. ఇలా చేయగలిగినంతా సీఎం వైఎస్ జగన్ చేస్తున్నారని మల్లాది విష్ణు తెలిపారు. గత మూడేళ్లలో విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 53 వేల కోట్ల నిధులు ఖర్చు చేయగా.. సెంట్రల్ నియోజకవర్గంలో రూ. 236.50 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. ఇందులో పాఠశాల విద్యకు సంబంధించి రూ. 202.31 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అలాగే 28 ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 33.49 కోట్ల నిధులతో 168 అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు. వీటిలో 12 హైస్కూల్స్ కు సంబంధించి 155 అదనపు తరగతులు కాగా 16 ప్రాథమిక పాఠశాలల్లో 13 నూతన తరగతుల నిర్మాణానికి రూ. 20.21 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆయా పాఠశాలల మరమ్మతులకు మరో రూ. 13.28 కోట్లు మొత్తంగా రూ. 33.49 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు విపక్షాల కుట్ర
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చిందా అని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అధికారంలో ఉండగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాయని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పాలన మరలా గాడిన పడిందని తెలిపారు. అది చూసి ఓర్వలేక జగనన్న సర్కారును అస్థిరపరచేందుకు ప్రతిపక్షాలన్నీ విష ప్రచారం సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడి జరిగితే.. పరిగెత్తుకుంటూ వెళ్లి దాడి చేసిన వారిని పరామర్శించడం టీడీపీ, బీజేపీల దివాళకోరుతనానికి అద్దం పడుతోందన్నారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు, దాడులకు ఏ మాత్రం స్థానం లేదని తెలియజేశారు. కుళ్లిపోయిన సిద్ధాంతాలు, కుట్ర రాజకీయాలతో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు సాధించేది ఏమీ ఉండదని ఈ సందర్భంగా విపక్షాలకు మరోసారి సూచించారు. కార్యక్రమంలో డీఈ రామకృష్ణ, ఏఈ అరుణ్ కుమార్, నాయకులు ఇస్మాయిల్, బాబు, కిరణ్, ఫాతిమా, కుమారి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News