రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కోరుకొండ మండలం కాపవరం, బూరుగుపూడి గ్రామాల పరిధిలో 25 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ళ స్థలాలు పంపిణీ కి అనువైన 586 ఎకరాలను గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె . మాధవీలత తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో కోరుకొండ మండల అధికారులు, సిబ్బందితో జాయింట్ కలెక్టర్, ఆర్డీవో లతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్క పేద వానికి సొంత ఇంటి కల సాకారం చేయవలసిన బృహత్తరమైన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇప్పటికే నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళ కార్యక్రమంలో భాగంగా స్థలాలు ఇచ్చామని తెలిపారు. అర్హత ఉన్న సొంత ఇంటి కల సాకారం కాకుండా ఉండ కూడదనే ధ్యేయం తో 90 రోజుల కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. బూరుగుపూడి, కాపవరం గ్రామాల్లో గుర్తించిన ప్లాట్స్ ను రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, కోరుకొండ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేయడం కోసం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. లే అవుట్ ల అభివృద్ధి, స్థలాలు కేటాయింపులు తదితర అంశాలపై మండల స్థాయి అధికారులు, రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, కోరుకొండ మండల తహశీల్దార్, ఎంపీడీఓ, సర్వేయర్లు, బురుగుపూడి, కాపవరం సచివాలయ సిబ్బంది, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News