Breaking News

పేదల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

-గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షలో మల్లాది విష్ణు
-వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 15 వేల ఇళ్లు పూర్తి కావాలని ఆదేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పేదల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి మంజూరైన 29,964 ఇళ్ల నిర్మాణాలపై సుధీర్ఘంగా చర్చించారు. తొలి దశలో 14,986 ఇళ్లు ఉండగా.. 5,460 నిర్మాణాలు ప్రారంభమైనట్లు అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వీటిలో నున్న లేఅవుట్ కు సంబంధించి 2,760., సూరంపల్లిలో 1,550., కొండపావులూరులో 1,150 ఇళ్లు ఉన్నట్లు తెలిపారు. ఆయా గృహ నిర్మాణాల పురోగతిని ఎప్పటికప్పుడు తనకు తెలియపరచాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. జూన్ 2023 నాటికి శ్లాబ్ వర్క్ పూర్తికావాలని.. డిసెంబర్ 2023 నాటికల్లా ఎట్టిపరిస్థితుల్లోనూ గృహప్రవేశాలు జరగాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధతో రూ. 179.62 కోట్లు వెచ్చించి 428.62 ఎకరాలలో నియోజకవర్గంలో 22,754 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు మల్లాది విష్ణు తెలిపారు. అలాగే ఒక్కో ఇంటికి రూ. లక్షా 80 వేలు చొప్పున రూ. 409.57 కోట్లు మొత్తంగా రూ. 589.19 కోట్లు పేదల గృహాలకు కేటాయించినట్లు వివరించారు. వీటితో పాటు రూ. 32 లక్షలలో చేపట్టిన అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను సైతం సత్వరం పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి నిర్దేశ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నించాలన్నారు. ఏమైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రధానంగా లేఅవుట్ లలో నీటి వసతి, విద్యుత్ సదుపాయాలపై దృష్టి సారించాలన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి సదుపాయం కల్పించాలన్నారు. మరోవైపు తెలుగుదేశం నాయకులు వేసిన కేసుల కారణంగా అమరావతి ప్రాంతంలో సొంతింటికి దూరమైన 7 వేల మందికి సైతం త్వరలో ఇళ్ల పట్టాలు అందజేస్తామని తెలియజేశారు. అనంతరం సెకండ్ ఫేజ్ లో 7,502 ఇళ్లతో పాటు.. మూడవ ఫేజ్ లో హెచ్ ముత్యాలంపాడు, కవులూరులో 5,187 ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలన్నారు.

సొంత స్థలం కలిగిన అర్హులకు సైతం చేయూత
సొంత స్థలం కలిగి ఇళ్లు నిర్మించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ద్వారా తోడ్పాటును అందించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు మల్లాది విష్ణు సూచించారు. నియోజకవర్గంలో 148 మంది లబ్ధిదారులకు ఇప్పటికే ప్రభుత్వ సాయం మంజూరు కాగా.. 45 మంది ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించినట్లు అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వీరందరికీ ఎప్పటికప్పుడు దశలవారీగా నిధులు విడుదలయ్యేలా చూడాలని సూచించారు. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే వార్డు సచివాలయాలు లేదా ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించాలని పిలుపునిచ్చారు. మరోవైపు 2016-17 మధ్యకాలంలో ఇళ్లు నిర్మించుకున్న పేదల ఖాతాలలో కేవలం ఒక్క రూపాయి మాత్రమే వేసి గత ప్రభుత్వం చేతులు దులుపుకుందని మల్లాది విష్ణు గుర్తుచేశారు. వారందరికీ జగనన్న ప్రభుత్వం అండగా నిలవడమే కాకుండా 302 మంది ఖాతాలలో రూ. 6.33 కోట్ల నిధులు జమ చేయడం గొప్ప విషయమన్నారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే.. వారందరికీ కూడా నిధులు విడుదలయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. నగర చరిత్రలో పెద్దఎత్తున పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మల్లాది విష్ణు అన్నారు. సమీక్షలో డీఈ(హౌసింగ్) రవికాంత్, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *