తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం సాంకేతిక శిక్షణ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒక స్కిల్ హబ్ ను ఏర్పాటులో భాగంగా జిల్లాలో నేడు తిరుపతి ఐ.టి.ఐ. నందు రెండవది ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. బుధవారం మద్యాహ్నం స్థానిక పద్మావతీ పురం నందు గల ఐ.టి.ఐ లో స్కిల్ హబ్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించి శిక్షణకు హాజరైన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత స్కిల్ హబ్ లను ఉపయోగించుకుని సాంకేతిక శిక్షణతో ఉద్యోగ అవకాశాలు పొందాలని ఇందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వంద శాతం ఉద్యోగ అవకాశాలు కల్పన దిశగా పయనిస్తున్నదని అన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన యువత ఉద్యోగ అవకాశాలు వద్దనుకుంటే స్వయం ఉపాధి ద్వారా కూడా సొంతంగా ఏర్పాటు చేసుకోవచ్చని దీనితో మరో నలుగురికి ఉపాధి అవకాశాలు కల్పించేలా శిక్షణా కాలంలో భాద్యతతో నేర్చుకోవాలని సూచించారు. నేడు ప్రారంభమయిన ఎలెక్ట్రికల్ కోర్సు 90 రోజుల కార్యక్రమంలో యువతకు ఎ.సి., వాషింగ్ మిషన్, ఫ్రిజ్ వంటి వాటిలో ఐ.టి.ఐ. సహకారంతో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఇందులో ప్రతి మూడు నెలలకు 60 మందికి శిక్షణ ఇవ్వడానికి అవకాశం ఉందని వివరించారు. నేటి నుండి శిక్షణ కు హాజరైన యువతతో ముఖాముఖీ నిర్వహించి మీరు కోర్సు పూర్తి చేసుకుని వెళ్ళేటప్పుడు భాద్యతగా మరొకరిని ఈ శిక్షణలో చేర్చగలగాలని, శిక్షణ కోసం నేడు మహిళలు కూడా హాజరవడం సంతోషమని తెలిపారు. ఈ శిక్షణ అనంతరం కేంద్ర ప్రభుత్వం జారీ చేసే దృవపత్రం, ట్రావలింగ్ అలవెన్స్ లేదా బస్ పాస్ సౌకర్యం కల్పిస్తారని అన్నారు. త్వరలో సచివాలయాలలో శిక్షణ కోసం నమోదు చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించనున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి జ్యోతి, వైస్ సర్పంచ్ రాజ్యలక్ష్మి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్యామ్ మోహన్, పి.డి. డి.ఆర్.డి.ఎ. జ్యోతి, ఇండస్ట్రియల్ ట్రైనర్ ఆనందరావు, ఐ.టి.ఐ. ప్రినిసిపల్ శ్రీలక్ష్మి, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారిని పల్లవి, నేటి నుండి శిక్షణ పొందనున్న యువత హాజరయ్యారు.
Prajavartha Online Telugu News