-విద్యుత్ ప్రమాదాల నివారణకు పూర్తిస్థాయి భద్రతా వ్యవస్థను రూపొందించవల్సిందిగా విద్యుత్ సంస్ధలకు ప్రభుత్వం ఆదేశం
– ప్రజలను విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడటం విద్యుత్ సంస్థల బాధ్యత
-24x 7 విద్యుత్ సరఫరా ఎంత ముఖ్యమో విద్యుత్ భద్రత కూడా అంతే ముఖ్యం
-అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న విద్యుత్ భద్రతా వ్యవస్థలను అధ్యయనం చేసి తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి – విద్యుత్ సంస్థలకు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆదేశం
-సబ్ స్టేషన్ల కమిటిలతో విద్యుత్ ప్రమాదాల పై అవగాహనా సదస్సులు నిర్వహించండి
-ఆయా జిలాల్లో సూపరింటెండింగ్ ఇంజినీర్లు అవగాహనా చర్యలకు బాధ్యత తీసుకోవాలని మంత్రి సూచన
-ప్రజల్లో విస్తృతంగా విద్యుత్ భద్రత పై ప్రచారం నిర్వహించండి
-విద్యుత్ లైన్లు, ట్రాన్సఫార్మర్లు వంటి వాటిని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.
-విద్యుత్ భద్రతకు సమస్యల గురించి ఫిర్యాదు చేసేందుకు 1912 టోల్ ఫ్రీ నంబర్ గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి
-విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 7000 మంది ఎనర్జీ అసిస్టెంట్ల సేవలను సామాన్య ప్రజలలో విద్యుత్ భద్రత సందేశాన్నిప్రచారం చేయడంలో వినియోగించుకోవాలి
-విద్యుత్ భద్రత పై ప్రజలలో అవగాహన కల్పించే విషయంలో విద్యుత్ సంస్థలు చురుకుగా వ్యవహరిస్తాయి- ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , కె విజయానంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ ప్రమాదాల నివారణ పై అన్ని స్థాయిల్లో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను రూపొందించవల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలను ఆదేశించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న విద్యుత్ భద్రతా వ్యవస్థలను అధ్యయనం చేసి తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా విద్యుత్ సంస్థలను ఆదేశించింది. అలాగే విద్యుత్ ప్రమాదాల నివారణ పై పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కూడా సూచించింది.
ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విద్యుత్ ప్రమాదాల నివారణ పై అధికారులతో మరోసారి టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. సదరు విద్యుత్ ప్రమాదాలు తనకు ఎంతో బాధ కలిగించాయన్నారు. మానవ జీవితం అన్నిటికంటే విలువైనదని, మనిషి ప్రాణాలు కోల్పోతే మళ్ళి తిరిగి తీసుకురాలేమని అన్నారు. అందువల్ల రాష్ట్రంలో సాధ్యమైనంత మేర విద్యుత్ ప్రమాదాలను నివారించే వ్యవస్థను రూపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇది విద్యుత్ సంస్థల ప్రాథమిక బాధ్యత అని ఆయన స్పష్టం చేసారు.
ఇందుకోసం అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న విద్యుత్ భద్రతా వ్యవస్థలను అధ్యయనం చేయాలనీ మంత్రి సూచించారు. వీటి ఆధారంగా స్థానిక అవసరాలకు తగినట్లు కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను రూపొందించాలని ఆయన ఆదేశించారు.
దీనిలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా విద్యుత్ ప్రమాదాల పై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కలిగించవచ్చన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సబ్ స్టేషన్ల కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఆ సమావేశాల్లో విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణకు సంబందించిన అంశాలను చర్చించాలని సూచించారు. ఈ కమిటీల సహకారంతో గ్రామాల వారీగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహిచాలన్నారు.
విద్యుత్ ప్రమాదాల నివారణ రక్షణ చర్యల పై పత్రికలు , వివిధ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. అలాగే పోస్టర్లు, కరపత్రాలు పంపిణి వంటి చర్యలు, సోషల్ మీడియా వేదికలను కూడా విరివిగా వినియోగించుకుని విద్యుత్ ప్రమాదాల పై ప్రచారం నిర్వహించాలన్నారు. జిల్లాలో ఉన్న సూపరింటెండింగ్ ఇంజినీర్లు ఈ బాధ్యత తీసుకోవాలన్నారు. అలాగే క్షేత్ర స్థాయిలో పనిచేసే ఇంజినీర్లు , సిబ్బందికి విద్యుత్ భద్రత, ప్రమాదాల నివారణ, ప్రజలను విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడే వివిధ అంశాల పై శిక్షణ ఇవ్వవలసిన అవసరముందన్నారు.
విద్యుత్ భద్రతకు సంబంధించిన ఏవైనా సమస్యల గురించి ఫిర్యాదు చేసేందుకు 1912 టోల్ ఫ్రీ నంబర్ గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఆ ఫిర్యాదులను డిస్కమ్లు తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 7000 మంది ఎనర్జీ అసిస్టెంట్లకు విద్యుత్ భద్రతా అంశాల పై శిక్షణ ఇచ్చి, వారి సేవలను సామాన్య ప్రజలలో విద్యుత్ భద్రత సందేశాన్ని ప్రచారం చేయడంలో వినియోగించుకోవాలని మంత్రి ఆదేశించారు.
అలాగే విద్యుత్ ప్రమాదలు జరిగే ఆస్కారం ఉన్న చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్సు స్టాఫ్ , అధికార సిబ్బంది, కాంట్రాక్టు ఏజెన్సీలు వీటిని కచ్చితంగా పాటించాలన్నారు. విద్యుత్ లైన్ల మరమత్తు పనులు నిర్వహించేటపుడు లైన్ల క్లియరెన్స్ వంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. విద్యుత్ పనులు నిర్వహించే చోట్ల ప్రమాదాల నివారణకు లోకల్ ఎర్తింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
ఇటీవల అనంతపూర్ లో విద్యుత్ ప్రమాదం జరిగిన వెనువెంటనే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు రూ 10 లక్షలు చెక్కులను పరిహారంగా అందజేశారు. అలాగే మున్ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు
ప్రజలకు విద్యుత్ భద్రత కల్పించే విషయంలో ఎంతైనా వ్యయం చేసేందుకు ప్రభుత్వం వెనుకాడబోదని మంత్రి పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం , భద్రత కన్నా ఏది ఎక్కువ కాదన్నారు . విద్యుత్ సంస్థల బలోపేతానికి , ప్రభుత్వం ఇప్పటికే రూ 40,000 కోట్ల ఇచ్చిన విషయాన్నీ మంత్రి గుర్తుచేశారు . విద్యుత్ లైన్లలో భద్రత విషయంలో విద్యుత్ సంస్థలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
అలాగే విద్యుత్ భద్రతను పెంపొందించేందుకు అవసరమైన సాంకేతికతను మెరుగుపరుచుకోవాలన్నారు . అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యుత్ భద్రత విషయంలో అవలంబిస్తున్న పద్ధతుల పై అధ్యయన చేయాలన్నారు. మన రాష్ట్రములో ఏ విధంగా విద్యుత్ భద్రతను మెరుగుపరచవచ్చో నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలన్నారు . వినియోగదారులకు 24×7 విద్యుత్ సరఫరాకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నామో విద్యుత్ భద్రతకు సంబంధించి అంతే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేసారు
విద్యుత్ సబ్ స్టేషన్ల వారీగా విద్యుత్ భద్రత తనిఖీలు నిర్వహించాలని , అవసరమైన చోట్ల యుద్ధ ప్రాతిపదికన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి సూచించారు. విద్యుత్ భద్రత చర్యల పై అలసత్వం వహించిన అధికారుల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .
డిస్కమ్ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ జాతీయ నివేదిక ప్రకారం గత మూడేళ్ల క్రితం దేశంలో 22,442 విద్యుత్ ప్రమాదాల సంభవించినట్లు మంత్రికి వివరించారు. దీని పై మంత్రి స్పందిస్తూ, రాష్ట్రంలోనే గాక దేశంలోనూ విద్యుత్ భద్రత అత్యంత ప్రాముఖ్యమైనదని , దీనిని దృష్టిలో ఉంచుకుని, విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రపంచం లో అత్యుత్తమ ప్రమాణాలను అధ్యయనం చేయాలని విద్యుత్ సంస్థలను ఆదేశించారు .
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా యావత్ విద్యుత్ వ్యవస్థ పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, సిఎండీ ఏపీ ట్రాన్స్కో బీ శ్రీధర్ , ట్రాన్స్కో జెఎండీలు ఐ పృథ్వి తేజ్ , బీ మల్లా రెడ్డి , డిస్కామ్ సిఎండీలు , జె పద్మ జనార్ధన రెడ్డి, కె సంతోష రావు తదితర ఉన్నతాధికారులు ఇంధన శాఖ మంత్రికి వివరించారు. అలాగే విద్యుత్ భద్రత పై ప్రజలలో అవగాహన కల్పించే విషయంలో కూడా విద్యుత్ సంస్థలు చురుకుగా వ్యవహరిస్తాయని వారు తెలిపారు.అలాగే గృహాల్లో విద్యుత్ ఓవర్ లోడ్ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తద్వారా గృహాల్లో జరిగే విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చునని వినియోగదారులకు విజ్ఞప్తి చేసారు.
అలాగే హై టెన్షన్ విద్యుత్ లైన్ల సమీపంలో గృహాలు, ఇతర నిర్మాణాలను చేపట్టవద్దని సూచించారు. గృహాల్లో విద్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన చర్యల పై ప్రతీ వినియోగదారునికీ అవగాహన కలిగేలా క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకుంటామని మంత్రికి వివిరించారు.
Prajavartha Online Telugu News