-విజయవాడ నుండి బటర్ ప్లై పార్కు వరకు రవాణ సౌకర్యం ఏర్పాటు…
-జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో అద్భుతమైన అందాలకు నిలయమైన బటర్ ప్లై పార్కును పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు సమీపంలోని కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ నందు గల బటర్ ప్లై పార్కును శుక్రవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సందర్శకుల నేత్రాలకు అద్భుతమైన దృశ్య కావ్యమైన మూలపాడు బటర్ ప్లై పార్కును పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో ఎన్నో అద్భుతమైన అందాలు దాగివున్నాయన్నారు. రంగురంగులతో కూడిన వందలాది రకాల సీతాకోక చిలుకలు ఈ ప్రాంతంలో విహరిస్తువుంటే వాటిని చూసి ఆహ్లాదించేందుకు వేయి కళ్ళు కూడా చాలవన్నారు. ఈ కొండ ప్రాంతం నుండి జాలువారే జలపాతాలు రాతిసోయగాలు వంటివి సందర్శకులను ఆకట్టుకుంటాయన్నారు. ట్రెకింగ్ చేసే యువతకు ఈ ప్రాంతం అనువుగాను ఆహ్లాదకరంగాను ఉంటుందన్నారు. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ సహజత్వానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. దాదాపు 30 వేల ఎకరాలు విస్త్తీరణం గల రిజర్వు ఫారెస్ట్‌లో జింకలు, కుందేళ్లు, నెమ్మళ్లు, దుప్పీ, అడవిపందులు, కోతులు వంటి వన్య ప్రాణులతో పాటు నక్కలు, తోడేళ్ళు వంటివి సంచరిస్తాయాని అటవి శాఖ అధికారులు తెలియజేశారన్నారు. పార్కు చుట్టు ఫెన్సింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని, 50 లక్షల రూపాయల వ్యయంతో సందర్శకులకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాట్లను చేసి బటర్ ప్లై పార్కును అభివృద్ధి చేయనున్నామన్నారు. జలపాతాల వద్ద బటర్ ప్లై పార్కులో సందర్శకులు సేదతీరేందుకు పగోడాలను ఏర్పాటు చేసి టాయిలెట్లు, విద్యుత్, త్రాగు నీటి సౌకర్యాం కల్పించాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. నిత్యం వందలాది మంది సందర్శకులు కొండపల్లి ప్రాంతంలో కొండపల్లి ఖిల్లా, కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రం పవిత్ర సంగమం వంటి పర్యాటక కేంద్రాలను సందర్శించడం జరుగుతుందని అటువంటి వారుకి బటర్ ప్లై పార్కును సందర్శించేలా రవాణా సౌకర్యాని కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. బటర్ ప్లై పార్కు అభివృద్దికి ప్రణాళికను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించామని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. బటర్ ఫ్లై పార్కు పర్యాటనలో కలెక్టర్ వెంట ఫారెస్ట్ రేజ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటి ఫారెస్ట్ రేజ్ ఆఫీసర్ అనీల్‌కుమార్, యంపిపి పాలడుగు జోత్స్న, యంపిడివో బి. రామకృష్ణ నాయక్, తహాశీల్థార్ యం.సూర్యారావు, అటవి శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Prajavartha Online Telugu News