
-రాష్ట్రంలో పరిశ్రమలకు ఆధునిక ఇంధన సామర్ధ్య సాంకేతికత , ఆర్థిక సహకారం అందుబాటులోకి తేవటమే లక్ష్యం
-పరిశ్రమలు,బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒకే వేదిక పైకి
-ఈ నెల 23న విశాఖలో ఇంధన సామర్ధ్య పెట్టుబడుల సదస్సు నిర్వహించనున్న ఏపీఎస్ఈసిఎం
-ఇంధన సామర్ధ్య రంగంలో 2031 నాటికీ రూ 13.20 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు అవకాశం — డైరెక్టర్ జనరల్ , బీఈఈ
-విద్యుత్ రంగంలో ప్రత్యేకించి ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన రంగాలలో ఆంధ్ర ప్రదేశ్ అత్యుతమ పనితీరు– డీజీ బీఈఈ
-ఇంధన సామర్ధ్య రంగానికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి , ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అత్యంత ప్రాధాన్యత
-ఇంధన భద్రత , 24x 7 విద్యుత్ అందుబాటు ధరల్లో వినియోగదారులకు అందించేందుకు ఇంధన సామర్థ్యం దోహదం
-ఇంధన సామర్ధ్య పెట్టుబడుల సదస్సు విజయవంతం అవటానికి తగిన చర్యలు, ఏర్పాట్లు చేయాలి – ఎస్ఈసిఎంకు ఇంధన శాఖ స్పెషల్ సిఎస్ విజయానంద్ ఆదేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఇంధనం పొదుపు , ఇంధన సామర్ధ్య పెంపుదలకు ఆర్థికపరంగా , పర్యావరణ పరంగా ప్రయోజనాలు రావటానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ సమాయుక్తమవుతుంది. ఇందుకు సంబంధించి విశాఖపట్నం వేదిక గా ఇంధన సామర్ధ్య పెట్టుబడుల సదస్సు ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ సహకార, సమన్వయం తో మరో సారి నిర్వహించేందుకు ముందుకొచ్చింది . ఈ సందర్భంగా దేశంలో ఇంధన సామర్ధ్య రంగంలో 2031 నాటికీ రూ 13.20 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు అవకాశముందని, దీనిలో రూ 10. 72 లక్షల కోట్ల పెట్టుబడులు పరిశ్రమలు, వాణిజ్య, రవాణా రంగాల్లోనే వచ్చేందుకు ఆస్కారం ఉంటుందని బీఈఈ వెల్లడించింది.
రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్ధ్య సాంకేతికతను అందుబాటులోకి తేవటం, సదరు సాంకేతికతను ఉపయోగించుకునేందుకోసం పరిశ్రమలకు ఆర్థిక సహకారం అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈఈ తో కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్(ఏపీఎస్ఈసిఎం) ఈ నెల 23న విశాఖపట్నంలో ఇంధన సామర్ధ్య పెట్టుబడుల సదస్సు (ఇన్వెస్ట్మెంట్ బజార్) ను నిర్వహించనుంది.
ఇంధన సామర్ధ్య సాంకేతికత పై ఆసక్తి గల పరిశ్రమలను అందుకు అవసరమైన సహకారం అందించే బ్యాంకులు , ఆర్థిక సంస్థలను ఒకే వేదిక పైకి తేవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత ఏడాది మార్చి లో విశాఖపట్నం లో నిర్వహించిన ఇంధన సామర్ధ్య పెట్టుబడుల సదస్సు కు మంచి స్పందన రావడం తో బీఈఈ మరల ఇన్వెస్ట్మెంట్ బజార్ నిర్వహణ కోసం విశాఖపట్నంను ఎంపిక చేసుకుంది.
ఈ నేపథ్యం లో బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే , రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ , ఏపీఎస్ఈసిఎం అధికారులతో వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంధన సామర్ధ్య రంగంలో దేశంలో 2031 నాటికీ రూ 13.20 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు అవకాశముందని తెలిపారు. దీనిలో రూ 10. 72 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రత్యేకించి పరిశ్రమలు, వాణిజ్య, రవాణా రంగాల్లోనే వచ్చేందుకు అవకాశముందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇంధన సామర్ధ్య పెట్టుబడుల సదస్సు నిర్వహణకు తొలిదశలో ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ , తెలంగాణ , కర్ణాటక, మహారాష్ట్ర , పంజాబ్, రాష్ట్రాలను ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. ఈ ఇన్వెస్ట్మెంట్ బజార్ వేదిక పై పరిశ్రమలు , బ్యాంకులు , ఆర్థిక సంస్థలు కలిసి ఇంధన సామర్ధ్య పెట్టుబడులకు అవకాశమున్న ప్రాజెక్టులను గుర్తించడం జరుగుతుంది.
ఇప్పటికే రాష్ట్రంలో ఇంధన సామర్ధ్య ప్రాజెక్టులను పరిశీలించేందుకు బ్యాంకులు,ఆర్థిక సంస్థలతో కలిసి ఒక ప్రత్యేక కమిటీని ఏపీఎస్ఈసిఎం ఏర్పాటు చేసింది. ఇన్వెస్ట్మెంట్ బజార్ లో ఎంపికైన పరిశ్రమలకు ఇంధన సామర్ధ్య ప్రాజెక్టులు అమలు చేసేందుకు ఆర్థిక సహకారం అందించడం జరుగుతుంది.
పరిశ్రమల్లో ఇంధన సామర్ధ్య సాంకేతికతను అమలు చేయడం వల్ల తక్కువ మొత్తం లో విద్యుత్ ,ఇంధన వనరులను ఉపయోగించుకుని నాణ్యమైన , ఎక్కువ ఉత్పాదకతను సాదించేందుకు దోహదపడుతుంది. దీనివల్ల విద్యుత్ పై పరిశ్రమలు చేసే వ్యయం తగ్గటమే గాక పర్యావరణ పరిరక్షణకు దోహదకారి అవుతుంది.
అంతేగాక చిన్న ,మధ్య తరహా పరిశ్రమల్లో కాలం చెల్లిన సాంకేతికత స్థానాల్లో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు దోహదపడుతుంది. అలాగే పెద్ద పరిశ్రమల్లో సాంకేతిక మెరుగుదలకు ఉపయోగపడుతుంది. పరిశ్రమల నిర్వహణ వ్యయం కొంత మేర తగ్గేందుకు సహాయపడుతుంది.
దేశంలో తొలిసారిగా ఇంధన సామర్ధ్య పెట్టుబడుల సదస్సు ను నిర్వహించిన ఘనత ఆంధ్ర ప్రదేశ్ కే దక్కుతుందని బీఈఈ డైరెక్టర్ జనరల్ ప్రశంసించారు. గత ఏడాది విశాఖపట్నం లో నిర్వహించిన సదస్సు కు పరిశ్రములు,ఆర్థిక సంస్థల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావటం హర్షణీయమన్నారు. ఈ ఏడాది కూడా పెట్టుబడుల సదస్సు విజయవంతం అవ్వాలని ఆయన ఆకాంక్షించారు.
విద్యుత్ రంగంలో ప్రత్యేకించి ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన రంగాలలో ఆంధ్ర ప్రదేశ్ చేస్తున్న అత్యుతమ పనితీరును గుర్తించి మరోసారి విశాఖపట్నంలోని పెట్టుబడుల సదస్సు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ఇంధన సామర్ధ్య పెట్టుబడుల సదస్సులో రూ 300 కోట్ల విలువైన ప్రాజెక్టులను గుర్తించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంధన సామర్ధ్య ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పరిశ్రమల నుంచి ఏపీఎస్ఈసిఎంకు ప్రతిపాదనలు వస్తే వాటికి అవసరమైన సాంకేతిక ప్రక్రియ నిర్వహించి , ఆర్థిక సంస్థలకు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యూనియన్ బ్యాంకు , ఎస్బీఐ, పీఎన్బీ, ఎస్ బ్యాంకు , ఐ ఓ బీ , బ్యాంకు అఫ్ ఇండియా , సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా తదితర బ్యాంకులతో ఇప్పటికే ఫైనాన్సియల్ కమిటి ను ఏపీఎస్ఈసిఎం ఏర్పాటు చేసింది .
ఇంధన సామర్ధ్య రంగానికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి , ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు . ఇంధన భద్రతను పెంపొందించడంలో , 24x 7 విద్యుత్ అందుబాటు ధరల్లో వినియోగదారులకు అందించడానికి, ఇంధన సామర్థ్యం కొంత మేర దోహదం చేస్తుందన్నారు. పెట్టుబడుల సదస్సుకు విశాఖపట్నం ను ఎంపిక చేసుకున్నందుకు ఆయన బీఈఈకు కృతఙ్ఞతలు తెలిపారు.
పరిశ్రమలల్లో ఇంధన సామర్ధ్యాన్ని ప్రోత్సహించేందుకు పరిశ్రమల శాఖ అందిస్తున్న సహకారం అభినందనీయం అన్నారు. ఇంధన సామర్ధ్య పెట్టుబడుల సదస్సు విజయవంతం అవటానికి తగిన చర్యలు, ఏర్పాట్లు చేయాలనీ ఎస్ఈసిఎం అధికారులను ఆయన ఆదేశించారు. వివిధ పరిశ్రమలుకు, బ్యాంకులకు ఇప్పటికే ఆహ్వానం పంపినట్లు ఏ పీఎస్ఈసీఎం అధికారులు తెలిపారు.
Prajavartha Online Telugu News