-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-63 వ డివిజన్ 274 వ వార్డు సచివాలయ పరిధిలో రెండోరోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనలో రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలు ఏదో ఒక పథకం ద్వారా లబ్ది పొందుతున్నట్లు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సోమవారం 63 వ డివిజన్ 274 వ వార్డు సచివాలయం కొత్త రాజీవ్ నగర్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వార్డు సచివాలయ పరిధిలోని 974 గృహాలలో, 289 ఇళ్లను సందర్శించారు. మూడేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో ప్రతి గడపకు అందించిన లబ్ధి గూర్చి బుక్ లెట్ల ద్వారా వివరించారు. నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి కావలసిన కనీస సదుపాయాలన్నింటినీ ఈ ప్రభుత్వం సమకూర్చడం జరిగిందని మల్లాది విష్ణు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల మెరుగైన జీవన ప్రమాణాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. కొత్త రాజీవ్ నగర్ పార్కును ఆధునికీకరించడంతో పాటు ప్రహరీ ఎత్తును పెంచి పరిరక్షించాలని అధికారులకు సూచించారు. పలువురు గర్బిణీలు, బాలింతలతో మాట్లాడి పౌష్టికాహారం సక్రమంగా అందుతుందా.. లేదా..? అడిగి తెలుసుకున్నారు. వేలిముద్రలు పడక రేషన్ ఆగిన వృద్ధులకు ఎమ్మెల్యే చొరవతో నిత్యావసరాలను పంపిణీ చేశారు. అలాగే పరుచూరి మాధవి అనే మహిళకు మంజూరైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. అనంతరం ఈబీసీ నేస్తం అర్జీలపై సచివాలయ సిబ్బందిని మల్లాది విష్ణు ఆరా తీశారు. అర్హులైన ఏఒక్కరూ పథకానికి దూరం కాకుండా చూడాలని ఆదేశించారు.
మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలి
పర్యటనలో భాగంగా పొదుపు సంఘాల మహిళలతో మల్లాది విష్ణు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వైఎస్ జగన్ పాలనలో తామంతా సంతోషంగా ఉన్నట్లు అక్కచెల్లెమ్మలు ఎమ్మెల్యేకు వివరించారు. గత ప్రభుత్వంలో ఎన్నో బాధలు చవి చూసామని.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని విధాలా తమకు అండగా నిలుస్తోందన్నారు. జగనన్న సంక్షేమ రాజ్యంలో 90 శాతం పథకాలు మహిళల పేరిటే అందించడం జరుగుతోందని మల్లాది విష్ణు వెల్లడించారు. ఒక్క ఆసరా పథకం ద్వారానే సచివాలయ పరిధిలో 500 మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ. 43.35 లక్షల లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. చేయూత, సున్నావడ్డీ, అమ్మఒడి, కాపునేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాల ద్వారా నిజమైన మహిళా సాధికారితకు, ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం దారులు పరుస్తోందని వివరించారు. ఈ నిధులను సద్వినియోగ పరచుకుని మహిళలు వాణిజ్య, వ్యాపార, వర్తక, పాడి రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మహిళా సంక్షేమంలో వైఎస్సార్ సీపీతో పోటీ పడే రాజకీయ పార్టీ దేశంలోనే మరొకటి లేదని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కు పేదలు ఎందుకు గుర్తురాలేదు..?
రాష్ట్రంలో 31 లక్షల నిరుపేద కుటుంబాలకు ఇళ్ల రూపంలో రూ. 4 లక్షల కోట్ల విలువైన ఆస్తిని సృష్టించిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు తెలిపారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పేదల కోసం ఏనాడూ సెంటు స్థలం ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. విజయవాడ నగరంలోనూ 10వేల ఇళ్లను తాము కట్టలేమని కౌన్సిల్ లో తీర్మానించి చేతులెత్తేశారని గుర్తుచేశారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి రూ. 56,103 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి సకల సదుపాయాలతో 17 వేల జగనన్న కాలనీలలో ఏకంగా ఊళ్లనే నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. సెంట్రల్లోనూ 30 వేల మంది నిరుపేదలకు రూ. 320 కోట్లతో భూమి కొనుగోలు చేసి పట్టాల రూపంలో మహిళల పేరిట అందజేయడం జరిగిందన్నారు. అది చూసి ఓర్వలేక లక్షలాది కుటుంబాలకు మేలు చేకూరే ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రతిపక్షాలు పనిగట్టుకుని బురదచల్లుతున్నాయని మండిపడ్డారు. తెలుగుదేశం గత ఐదేళ్ల పాలనలో నిలువ నీడ లేక ఎన్నో నిరుపేద కుటుంబాలు ఇబ్బందులకు గురైనప్పుడు పవన్ కళ్యాణ్ ఏమయ్యారని మల్లాది విష్ణు ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వ చేతగానితనాన్ని, టిడ్కో ఇళ్లల్లో జన్మభూమి కమిటీల అవినీతిని ఆనాడు జనసేన అధినేత ఎందుకు ప్రశ్నించలేకపోయారన్నారు. టీడీపీ అవినీతి ప్రభుత్వంతో ఐదేళ్లు అంటకాగి మీరు సాధించిందేమిటో సమాధానం చెప్పాలన్నారు. అంతేకానీ ఇళ్ల నిర్మాణాలపై రాద్ధాంతం చేసి రాజకీయం పబ్బం గడుపుకోవాలని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు తరిమితరిమి కొడతారని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, జోనల్ కమిషనర్ అంబేద్కర్, నార్త్ ఎమ్మార్వో దుర్గాప్రసాద్, డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఈ అరుణ్ కుమార్, సిడిఓ జగదీశ్వరి, నాయకులు పసుపులేటి యేసు, మోదుగుల గణేష్, సీహెచ్ రవి, టెక్కెం కృష్ణ, లొనగాని నాగు, నాగేశ్వరరావు, కె.రవి, ఉద్ధంటి శ్రీను, తిరుపతిరావు, సచివాలయం సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News