-చేతగాని దద్దమ్మ పాలనతో 23 సీట్లకు పరిమితమైనా తీరుమారలేదు
-చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మల్లాది విష్ణు
-31వ డివిజన్ 211 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారం కోల్పోయిన ఫస్ట్రేషన్లో ప్రతిపక్షనేత వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. శనివారం 31 వ డివిజన్ 211 వ వార్డు సచివాలయం పరిధిలో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. శ్రీనగర్ కాలనీ వీధులలో విస్తృతంగా పర్యటించి.. 332 గడపలను సందర్శించారు. చంద్రబాబు అవినీతి పాలనకు, సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనకు మధ్య వ్యత్యాసాన్ని బుక్ లెట్ల ద్వారా స్థానికులకు వివరించారు. గత ప్రభుత్వం పేదలకు చేసింది ఏమీలేదని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి నిరుపేద గడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మల్లాది విష్ణు పేర్కొన్నారు. అది చూసి ఓర్వలేక అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై ఆరా తీశారు. నిర్ణీత గడువులోగా వాటన్నింటినీ పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రజలు ఛీకొట్టినా మారని తీరు
2019 ఎన్నికలలోనే తెలుగుదేశం నేతలను రాష్ట్ర ప్రజలు దద్దమ్మలను చేసి ఇళ్లకి పరిమితం చేశారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు విమర్శించారు. కర్నూల్ వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన దిగజారుడు విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాయలసీమ ప్రాంత పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరమన్నారు. మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామని.. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. మీ 40 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఏమైపోయిందని ప్రశ్నించారు. ఒక యువకుడి చేతిలో ఘోర పరాజయం పాలైన ఫ్రస్టేషన్ చంద్రబాబులో కొట్టొచ్చినట్లు కనబడుతోందని పేర్కొన్నారు. రాజకీయాలలో ప్రతిపక్షాలు ఎప్పుడూ హుందాతనం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేగానీ చెప్పులు చూపడం, చొక్కాలు విప్పి రమ్మని పోలీసులను బెదరించడం వంటి చర్యలను ప్రజలు ఎన్నడూ హర్షించరన్నారు.
చంద్రబాబుది ఊసరవెల్లితత్వం
ఊసరవెల్లిలా ప్రాంతాన్ని బట్టి రంగులు మార్చి మాట్లాడటం, ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం ప్రతిపక్ష నేతకు షరామామూలేనని మల్లాది విష్ణు విమర్శించారు. రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని కర్నూలు ప్రాంత ప్రజల మధ్య చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోయారని.. అలాంటప్పుడు ఎవరు పిరికిపందో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మీ గత ఐదేళ్ల పాలనలో అమరావతి పేరిట ఆర్భాటం తప్ప పనులు కనీసం పునాదులు కూడా దాటకపోవడం మీ చేతగానితనానికి నిదర్శనం కాదా..? అని ప్రశ్నించారు. కనీసం ఏ ఒక్క పేదవాడికి టిడ్కో ఇంటిని ఇవ్వలేకపోయిన దద్దమ్మ పాలకులని ధ్వజమెత్తారు. కర్నూలు పర్యటనలో ప్రజల నుంచి ఏమాత్రం సానుభూతి రాకపోవడంతో.. చివరకు చంద్రబాబు రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. రాయలసీమ గూర్చి మాట్లాడే నైతిక అర్హత ఆయన ఏమాత్రం లేదని పేర్కొన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రూ. 18 వేల 180 కోట్ల జలయజ్ఞ ప్రాజెక్టులతో రాయలసీమ సర్వతోముఖాభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు పాలనలో సీమ ప్రజలకు సరైన న్యాయం జరగలేదన్నారు. మహానేత మృతితో ఆగిపోయిన రాయలసీమ అభివృద్ధిని మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరుగులు పెట్టిస్తున్నారన్నారు. ప్రజలు విజ్ఞులని.. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు ఏవిధంగా భ్రష్టు పట్టించారో.. సీఎం వైఎస్ జగన్ ఏవిధంగా వ్యవస్థలను గాడిలో పెడుతున్నరో ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు తెలిపారు. కనుక ఇకనైనా దిగజారుడు విమర్శలు మానుకోవాలని.. లేకపోతే ప్రజలంతా ఏకమై మరోసారి తరిమితరిమి కొట్టడం ఖాయమని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, జోనల్ కమిషనర్ అంబేద్కర్, డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు బెజ్జం రవి, పట్టాభి రామరాజు, మానం వెంకటేశ్వరరావు, పెరుమాళ్ల జయకర్, కనపర్తి కొండా, సామంతపూడి గోవిందరాజు(చిన్నా), అంగిరేకుల విజయ్, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News