విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టైలర్ ఫెడరేషన్ ప్రక్రియను కొనసాగించాలని ఏపి టైలర్స్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏపీ టైలర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ సొసైటీస్ చీఫ్ ప్రమోటర్స్ ఎస్.కె.అమీర్ జానీ మాట్లాడుతూ రాష్ట్ర టైలర్ల అభ్యర్ధన మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జగనన్న చేదోడు పధకం ద్వారా ఆర్ధిక సహాయాన్ని ఇస్తూ..ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన టైలర్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ డెవలప్మెంట్ చేయమని చైర్మన్‌ను నియమిస్తూ సంభందిత చేనేత జౌళిశాఖ అధికారులకు జీవో నెం.121 ద్వారా ఆదేశాలు ఇవ్వడమైనదని తెలిపారు. జీవో నెం.121, ఇచ్చి 15 నెలలు గడచిపోయినా చైర్మన్, దానికి సంభందిత అధికారులు రాష్ట్ర టైలర్ కార్మికుల హక్కుగా ఉన్న టైలర్ ఫెడరేషన్ ప్రక్రియను కొనసాగించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. టైలర్ ఫెడరేషన్ బైలాను పరిశీలించి తమకు బోర్డు ఏర్పాటు చేసే విధముగా సంభంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. లక్షలాదిగా ఉన్న టైలర్ కార్మికుల సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తారని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సొసైటీస్ చీప్ ప్రమోటర్స్ జె.వెంకటసుబ్బారావు, వీనస్‌బాబు, తేజస్విరాజు, అబ్దుల్ లతీఫ్, ఎస్.కె.హుస్సేన్, ఎస్.కె.బాజీ, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News