Breaking News

సెంట్రల్లో అట్టహాసంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

-ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో కలిసి కేక్ కట్ చేసిన మల్లాది విష్ణు
-ప్రగతి రథసారథి సీఎం వైఎస్ జగన్
-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో దళారీ వ్యవస్థకు తావులేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛమైన పాలనను అందిస్తున్నారని ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. బీసెంట్ రోడ్డు ఐ.వి.ప్యాలస్ నందు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా “హ్యాపీ బర్త్ డే సీఎం సార్” అంటూ అక్కచెల్లెమ్మలు చేసిన నినాదాలతో సభాప్రాంగణమంతా హోరెత్తింది. అనంతరం భారీ కేక్ కట్ చేసి జననేతకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం వచ్చిందని మల్లాది విష్ణు తెలిపారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులతో కలిసి సంబరాలలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిఒక్క హామీని తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో హామీలు అమలు చేయలేక మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి మాయం చేసిన అసమర్థ ప్రభుత్వాన్ని చూశామన్నారు. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్ల కాలంలో 99శాతం హామీలు అమలు చేసి.. ఎన్నికల మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారని కితాబిచ్చారు.

మూడున్నరేళ్లలో రూ. 310 కోట్ల సంక్షేమం
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నగదు బదిలీలు గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేదని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రాజ్యంలో నియోజకవర్గ ప్రజలకు అక్షరాలా రూ. 310.46 కోట్ల సంక్షేమాన్ని అందించినట్లు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 25,283 మందికి ప్రతినెలా క్రమం తప్పకుండా ఇంటివద్దకే పింఛన్ అందజేస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల రూ.2,750 అందించనున్నట్లు పేర్కొన్నారు. అమ్మఒడి ద్వారా 28,834 మందికి రూ. 118.98 కోట్లు., విద్యాదీవెన ద్వారా 15,024 మందికి రూ. 35.50 కోట్లు., వసతి దీవెన ద్వారా 15,024 మందికి రూ. 13.68 కోట్లు., చేయూత ద్వారా 8,542 మందికి రూ. 39.01 కోట్లు., కాపునేస్తం ద్వారా 2,088 మందికి రూ. 8.87 కోట్లు., సున్నావడ్డీ ద్వారా 44,370 మందికి రూ. 17.26 కోట్లు., చేదోడు ద్వారా 2,112 మందికి రూ. 5.51 కోట్లు., ఆసరా ద్వారా 32,510 మందికి రూ.56.35 కోట్లు., వాహనమిత్ర ద్వారా 2,916 మందికి రూ. 7.04 కోట్లు., ఈబీసీ నేస్తం ద్వారా 1,947 మందికి రూ.2.92 కోట్ల ఆర్థిక చేయూతను మూడున్నరేళ్లలో అందించినట్లు వివరించారు.

గృహ నిర్మాణంలో దేశానికే ఆదర్శం
పేదల సొంతింటి కలను ఆసరాగా తీసుకుని గత పాలకులు, జన్మభూమి కమిటీలు పేదలను నిలువునా మోసగించాయని మల్లాది విష్ణు ఆరోపించారు. కనీసం స్థలాలు కూడా లేకుండా టిడ్కో ఇళ్ల పేరిట పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. కేవలం కాగితాలకే ఇళ్లను చూపి.. ఒక్కో లబ్ధిదారుని వద్ద రూ. 50 నుంచి రూ. లక్ష వరకు అప్లికేషన్ల రూపంలో దోచుకున్నారన్నారు. ఆ సమయంలో డబ్బులు కట్టలేక ఇంట్లోని బంగారం తాకట్టు పెట్టేందుకు ప్రజలు ప్రైవేట్ బ్యాంకుల ముందు బారులు తీరడం కలిచివేసిందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్హత ఉన్న ప్రతిఒక్క పేదవాడికి పారదర్శకంగా స్థలం కేటాయించి.. ఇల్లు నిర్మించి ఇస్తున్నారని మల్లాది విష్ణు తెలిపారు. పేదల ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధతో రూ. 179.62 కోట్లు వెచ్చించి 428.62 ఎకరాలలో నియోజకవర్గంలో 22,754 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అలాగే ఒక్కో ఇంటికి రూ. లక్షా 80 వేలు చొప్పున రూ. 409.57 కోట్లు మొత్తంగా రూ. 589.19 కోట్లు పేదల గృహాలకు కేటాయించినట్లు వివరించారు.

గ్రామ స్వరాజ్య సాధనలో కొత్త ఒరవడి
గ్రామ స్వరాజ్యం ఆకాంక్షతో సచివాలయ వ్యవస్థ రూపకల్పన చేసి ప్రతి ఇంటి గడపకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను చేరువ చేశారని మల్లాది విష్ణు అన్నారు. కుటుంబంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందేలా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక ఇక్కట్లు ఎన్ని ఉన్నా ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు. కనుకనే ప్రభుత్వ పథకాల అమలులో అగ్రగామిగా నేడు రాష్ట్రం దేశవ్యాప్తంగా సంక్షేమాంధ్రప్రదేశ్‌గా ప్రశంసలు అందుకుంటోందన్నారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతిఆయోగ్ సైతం ప్రశంసించడం జరిగిందన్నారు. ప్రధాని సహా మన రాష్ట్రంలో పర్యటించిన పలువురు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి నిర్ణయాలను కీర్తించారని తెలియజేశారు.

సామాజిక న్యాయం చేతల్లో చూపిన నేత
స్వతంత్య్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ గతంలో సామాజిక ధర్మం పాటించలేదని, ఆంధ్రప్రదేశ్‌ లో మాత్రమే సీఎం వైఎస్ జగన్‌ సామాజిక న్యాయం పాటించారని మల్లాది విష్ణు అన్నారు. మంత్రివర్గం కూర్పు నుంచి నామినేటెడ్ పదవుల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దఎత్తున పదవులు కేటాయించడం ద్వారా జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీలకు ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి సామాజిక న్యాయాన్ని సీఎం వైఎస్ జగన్ చేతల్లో చూపారన్నారు. మూడేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న సామాజిక న్యాయాన్ని మేధావులు సైతం కీర్తిస్తున్నారని పేర్కొన్నారు.

చంద్రబాబుకు దిగులే దిగులు
అధికారం చేపట్టిన అనతికాలంలోనే టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి గొప్ప గొప్ప ముఖ్యమంత్రుల సరసన చేరిన సీఎం వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబుకు దిగులు పట్టుకుందని మల్లాది విష్ణు విమర్శించారు. ఓవైపు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని పైకి దొంగ ఏడుపులు ఏడుస్తూ.. ఇంకోవైపు అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం అందిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం చంద్రబాబుకి నైజంగా మారిపోయిందన్నారు. అదే సంక్షేమాన్ని అధికారంలో ఉన్న గత ఐదేళ్లు ఎందుకు అమలు చేయలేకపోయారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఆనాడు పేదల సంక్షేమాన్ని, మధ్య తరగతి ప్రజల చేయూతను పూర్తిగా విస్మరించి ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని మల్లాది విష్ణు విమర్శించారు. నేడు ప్రధాన ప్రతిపక్ష నేతగానూ ఘోరంగా విఫలమవుతున్నారని విమర్శించారు.

అనంతరం సీఎం జగన్‌ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తాము పొందుతున్న లబ్ధిని పలువురు వివరించారు. రాధ, లబ్ధిదారు మాట్లాడుతూ.. చేయూత పథకంతో అప్పుల కోసం బయట వ్యక్తుల వద్దకు వెళ్లవలసిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఇప్పటివరకు మూడు విడతల చేయూత సాయం అందినట్లు తెలిపారు. అలాగే మనవడికి రెండు సార్లు అమ్మఒడి వచ్చిందని.. ఇంటి పట్టా కూడా మంజూరైనట్లు వివరించారు. తన కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచిన జగనన్నకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, పీఓయూసిడి కె.శకుంతల, జోనల్ కమిషనర్ అంబేద్కర్, సీడీఓ జగదీశ్వరి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు శర్వాణీ మూర్తి, బాలి గోవింద్, కొంగితల లక్ష్మీపతి, ఇసరపు దేవి, కొండాయిగుంట మల్లీశ్వరి, బంకా శకుంతల, మోదుగుల తిరుపతమ్మ, ఉద్ధంటి సునీత, కుక్కల అనిత, జానారెడ్డి, కోఆప్షన్ సభ్యురాలు గుండు సుభాషిణి, వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సురేష్, సచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు, పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *