విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కౌలు రైతులను జాయింట్ లయిబులిటీ గ్రూప్స్ (జెఎల్‌జి)గా ఏర్పరచి బ్యాంకుల నుండి రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ సలహా మండలి చైర్మన్, కలెక్టర్ డిల్లీరావు అధికారులను కోరారు.
నగరంలోని క్యాంప్ కార్యాలయం నుండి గురువారం కలెక్టర్ డిల్లీరావు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో కౌలు రైతులకు రుణాలు, ధాన్యం కొనుగోలు, కిసాన్ డ్రోన్స్ పైలట్ల శిక్షణ తదితర అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌలు రైతులకు బ్యాంకుల నుండి రుణాలు మంజూరు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డు లేని పక్షంలో నాలుగు నుండి ఐదుగురు కౌలు రైతులను జాయింట్ లయిబులిటీ గ్రూప్స్ (జెఎల్‌జి) గా బ్యాంకుల నుండి రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డులను మంజూరు చేసినప్పటికి బ్యాంకర్లు కౌలు రైతులకు రుణాల మంజూరులో ఇబ్బందులను బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలన్నారు. పంటల బీమాకు సంబంధించి ముఖ్యంగా మిర్చి పంటకు అందించాలవలసిన పంటల బీమాను త్వరితగతిన రైతులకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆధునాతన సాంకేతికతను వ్యవసాయ రంగంలో వినియోగించుకునే విధంగా కిసాన్ డ్రోన్స్ పైలట్ల శిక్షణకు కస్టమ్ హైరింగ్ సెంటర్స్‌లో నాలుగు నుండి ఐదుగురు సభ్యులను ఎంపిక చేసి వారిలో ఇంటర్‌గాని, పదవ తరగతి గాని అర్హత ఉన్నవారికి డ్రోన్ పైలట్ శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణ వ్యవసాయ భూమికి క్రిమిసంహారిక మందులు, ఎరువులను పిచికారి చేసేందుకు వినియోగించే కిసాన్ డ్రోన్స్ పట్ల రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పైలట్ శిక్షణను ఉచితంగా అందిస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. రైతులు కస్టమ్ హైరింగ్ గ్రూపులుగా ఏర్పడితే డ్రోన్స్‌ను పొందవచ్చునన్నారు.
మొక్కల పెరుగుదలకు సహాయకారిగా ఉంటున్న మైక్రోన్యూట్రియంట్‌ను సబ్బిడీపై రైతులకు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని, ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ళలో తేమ శాతంపై రైతులను మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కొనుగోలు కేంద్రాలలో యంటియు 1318 వరి రకం ధాన్యం కొనుగోళ్ళు చేయడంలో కొన్ని చోట్ల ఉన్న ఇబ్బందులను పరిష్కరించాలని సభ్యులు కాన్ఫరెన్స్ దృష్టికి తీసుకురాగా తక్షణమే ఇబ్బందులను పరిష్కారించాలని కలెక్టర్ డిల్లీరావు పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ను ఆదేశించారు.
కాన్ఫరెన్స్‌ర్‌లో జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యం విజయభారతి, పౌరసరఫరాల శాఖ డియం శివరామముర్తి, అగ్రి ఎడ్వయిజరీ బోర్డు చైర్మన్ దామోదర్ రెడ్డి, సభ్యులు నాగయ్య, బ్రహ్మయ్య, క్రిషి విజ్ఞాన కేంద్రం సుబ్బయ్య ఉన్నారు.
Prajavartha Online Telugu News