Breaking News

29న రాజ్‌భవన్‌ ఎదుట నిరసనలు… : కె.రామకృష్ణ

-27, 28 తేదీల్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చ
-ఏపీ అప్పులు, వడ్డీలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఈనెల 29వ తేదీన విజయవాడ రాజ్‌భవన్‌ దగ్గర నిరసనకు దిగనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడిరచారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ సమితి ఈనెల 29న దేశ వ్యాప్తంగా గవర్నరు వ్యవస్థలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసనలకు పిలుపునిచ్చిందన్నారు. విజయవాడ దాసరిభవన్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాఖ్య(ఫెడరల్‌) వ్యవస్థ ధ్వంసానికి పాల్పడుతోందని మండిపడ్డారు.
రామకృష్ణ మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వచ్చాక గవర్నరు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని, స్వతంత్ర సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీలతో ప్రతిపక్షాలపై రాజకీయ పక్షపాతంతో దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. ఎనిమిదేళ్లుగా మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), సీబీఐ, ఇన్‌కామ్‌ ట్యాక్స్‌ (ఐటీ) వ్యవస్థలు పూర్తిగా అదుపు తప్పుతున్నాయనీ, రాజకీయ పక్షపాతంతో ప్రతిపక్షాల నేతల ఇళ్లకు వెళ్లి బెదిరించడానికీ, వారిపై కేసులు పెట్టడానికీ ఉపయోగపడుతున్నాయన్నారు. వారికి అధికార పార్టీ అయిన బీజేపీలోని నేతలెవ్వరూ కన్పించబోరనీ, కేవలం ప్రతిపక్షాలే లక్ష్యంగా పనికట్టుకుని కేంద్రం దాడులు చేయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రోజు ఈడీ, సీబీఐ నా చేతిలో పెడితే సగం మంది బీజేపీ నేతలను జైళ్లల్లో పెట్టిస్తానని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్న విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీ నేతలు ఎన్ని తప్పులు చేసినా బయట తిరగవచ్చనీ, ప్రతిపక్షాలపైన మాత్రం స్వతంత్ర సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. పైగా ఇతర పార్టీల్లో ఉంటూ, అవకతవకలు, అవినీతికి పాల్పడిన వారంతా బీజేపీ కండువా కప్పుకున్న వెంటనే పవిత్రులుగా మారిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. వాళ్లెవరూ జైళ్లకు పోవడం లేదనీ, బిజెపి కండువా కప్పుకోకుంటే మాత్రం వెంటపడుతున్నారనీ, కేసులతో వేధిస్తున్నారని, ఈ విధానాలను ప్రజలంతా నిరసించాలన్నారు. ప్రజాస్వామ్యంలో స్వతంత్ర సంస్థలు స్వేచ్ఛగా పనిచేయాలేగానీ… అధికార పార్టీనేతలనే లక్ష్యంగా ఎంచుకుని, కేంద్రం ఒత్తిడితో దాడులకు దిగడం, కేసులు పెట్టడం సరికాదని హితవుపలికారు. గవర్నరు వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని, పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాలలో గవర్నర్ల వ్యవస్థను పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో అధికార పార్టీలో ఉన్న బీజేపీకి ఏజెంట్ల తరహాగా గవర్నర్లు పనిచేస్తున్నారనీ, కొందరైతే ఏకంగా బీజేపీ కండువాలు కప్పుకున్న తరహాగా కార్యక్రమాల్ని చేస్తూ రాజ్యాంగ వ్యవస్థను, సమాఖ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని తప్పుపట్టారు. దీంతో గవర్నరు వ్యవస్థను రద్దు చేయాలంటూ సీపీఐ ముందు నుంచీ డిమాండ్‌ చేస్తోందనీ, అందులో భాగంగానే ఈనెల 29వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ గవర్నరు కార్యాలయం వద్ద (రాజ్‌భవన్‌) నిరసనలు చేపట్టనున్నామని వెల్లడిరచారు.
రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా రైతులు తీవ్రమైని ఇబ్బందులు పడుతున్నారనీ, ఇది చాలా బాధాకరమని రామకృష్ణ అన్నారు. చాలా ప్రాంతాల్లో మొత్తం పంటలన్నీ పోయాయనీ, అక్కడక్కడా పంటలు పండిన చోట గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. కొనుగోలు చేసే వారెవరూ లేరనీ, తుపాన్‌ ప్రభావంతో కల్లాల్లోని వరి పంటను పూర్తిగా రైతులు కోల్పోవాల్సివచ్చిందని వివరించారు. అన్ని రకాల పంటలు పండిరచే రైతులంతా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. దీనిపై జగన్‌ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదనీ, పైగా రైతాంగానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లుగా అర్భాటంగా ప్రచారం చేస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్బీకే కేంద్రాలపై ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందనీ, అక్కడ రైతులకు కనీసం బ్యాగ్‌లు ఇచ్చే పరిస్థితుల్వేన్నారు. ధాన్యం కొనుగోలుపైన, పంట నష్టంపైన జగన్‌ మాట్లాడటం లేదనీ, సీఎం పదేపదే 2024 ఎన్నికలే లక్ష్యంగా ఆలోచిస్తున్నారేగానీ, రైతాంగ శ్రేయస్సుపై దృష్టి పెట్టడం లేదని చెప్పారు. ఎమ్మెల్యేలు గడపగడపకూ వెళ్లడం కాదు…పొలాలకి వెళ్తే రైతుల సమస్యలు తెలుస్తాయన్నారు. చాలా జిల్లాల్లో ఇప్పటికే సీపీఐ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై పెద్దఎత్తున కార్యక్రమాల్ని చేస్తున్నామని, ఇటీవల అనంతపురం, కర్నూలులో వేలాదిమంది రైతులతో ధర్నాలు చేశారన్నారు. రైతులంతా సుభిక్షంగా ఉన్నారంటూ జగన్‌ చేస్తున్న వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. అసలు గ్రామాల్లో పంట పండిరదా? లేదా? అని పరిశీలించేవారే లేరనీ, అలాంటప్పుడు రైతులు సుభిక్షంగా ఎలా ఉంటారని సీఎంను ప్రశ్నించారు. ఈ మూడేళ్లల్లో 1670 మంది రైతులు అప్పులపాలై, ఆత్మహత్యలకు పాల్పడ్డారని సాక్ష్యాత్తూ పార్లమెంటులో చెప్పారని గుర్తుచేశారు. దానిపై సీఎం ఎందుకు జవాబివ్వరంటూ నిలదీశారు. 3070 మంది వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, దానిపైనా సీఎం ఏ మాత్రమూ స్పందించడం లేదన్నారు. రైతులంతా సుభిక్షంగా ఉంటే, ఇంతమంది రైతులు, కూలీలు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తక్షణమే యుద్ధప్రాతిపదికన రైతాంగ సమస్యలపై స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 27, 28 తేదీల్లో పార్టీ కార్యదర్శివర్గం, కార్యవర్గ సమావేశాల్లో రైతాంగ సమస్యలపై కూలంకుషంగా చర్చించి, రాబోయే రోజుల్లో రైతాంగ సమస్యలపై సమైక్య ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యోగస్తులకు వేతనాలు ఇవ్వడం లేదనీ, వారంతా రోడ్డెక్కుతున్నారని వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. కేంద్రమంత్రి ఆంధ్రప్రదేశ్‌ పేరు చెప్పకపోయినా…ఆంధ్రప్రదేశ్‌లోనే ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందనడానికి ఆమె వ్యాఖ్యలు నిదర్శనమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు సైతం తమకు వేతనాలు రావడం లేదంటూ రోడ్డెక్కారనీ, ఇవాళ రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని, మొత్తం అప్పులపాల్జేశారని, అప్పులు పుడితేనే వేతనాలు ఇచ్చే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రానికి అప్పు ఎంత ఉందనీ, దానికి వడ్డీ ఎంత చెల్లించాలనేదీ ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. జగన్‌ దిగిపోయే నాటికి రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు అప్పు ఉండబోతుందంటూ ఆర్థికవేత్తలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ అప్పుకుగాను ప్రతేటా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.లక్ష కోట్లు వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి ఉందనీ, అవి ఎక్కడ నుంచి వస్తాయంటూ ప్రశ్నించారు. అటు అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ, ఇటు ప్రభుత్వాన్ని జగన్‌ ఎలా నడుపుతారు? ఉద్యోగులకు వేతనాలెలా ఇస్తారు? సంక్షేమ పథకాలెలా నిర్వహిస్తారు? అభివృద్ధి పనులెలా చేస్తారంటూ ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్రంలోని అప్పులు, వాటికి చెల్లిస్తున్న వడ్డీలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, ఏపీ చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *