గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరాన్ని స్వచ్చ, ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో 25 ప్రధాన కూడళ్ళలో 130 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల నుండి 50 వేల మంది విద్యార్ధులతో స్థానిక కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారుల ఆధ్వర్యంలో నగర పరిశుభ్రత, స్వచ్చత పై ర్యాలీలు, మానవహారాలు చేపట్టారు. కలెక్టరేట్ నుండి నాజ్ సెంటర్ వరకు జరిగిన ర్యాలీ, మానవహారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎం.ఎల్.సి. లేళ్ళ అప్పిరెడ్డి, నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, ఎం.ఎల్.ఏ. మద్దాలి గిరిధర్, ఇంచార్జి కమిషనర్ పెద్ది రోజా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని దేశంలోనే స్వచ్చ నగరంగా అగ్రస్థానంలో నిలబెట్టడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, అందులో నగరపాలక సంస్థ సహకారంతో ప్రజలు ముందుకు రావాలన్నారు. విద్యార్ధులు మానవహారంలో ప్లకార్డ్ లు చేతబట్టి, నినాదాలు ఇస్తూ ప్రజలకు అవగాహన కల్పించడానికి ముందుకు రావడం అభినందనీయమని పెర్కొన్నారు. ప్రతి నగరం, పట్టణం పరిశుభ్ర నగరంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లీన్ ఆంధ్రప్రదేశ్ చేపడుతుందని, ఇప్పటికే ప్రతి ఇంటికి 3 రకాల డస్ట్ బిన్లు అందించడం జరిగిందన్నారు. త్వరలో ఈ.ఆటోలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రజలు కూడా తమ ఇళ్ళలో వచ్చే వ్యర్ధాలను తడి, పొడి, ప్రమాదకర వ్యర్ధలుగా విభజన చేసి నగరపాలక సంస్థ ప్రజారోగ్య సిబ్బందికి ఇవ్వాలని కోరారు.
మేయర్ మాట్లాడుతూ స్వచ్చ సర్వేక్షణ్, జగనన్న స్వచ్చ సంకల్పం, స్వచ్చ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా క్లీన్ గుంటూరు కోసం ప్రజల్లో అవగాహన కల్పించడానికి నగరపాలక సంస్థ ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు అయితేనే స్వచ్చ నగర సాధన తేలిక అవుతుందన్నారు. శుక్రవారం నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్ధులు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు నగర ప్రజల్లో స్వచ్చత పై అవగాహన కోసం ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. నగరాన్ని స్వచ్చ నగరంగా మార్చుకోవడం ద్వారా నగర ప్రజలు ఆరోగ్యంగా జీవించే వాతావరణం కల్పించడమేనన్నారు. వార్డ్ సచివాలయాల వారీగా వాలంటిర్లు, కార్యదర్షుల ద్వారా ప్రతి ఒక్కరికి క్లీన్ గుంటూరు పై అవగాహన కల్పిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయానికి అనుగుణంగా నగరాన్ని స్వచ్చ నగరంగా మార్చుకోవడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.
ఎం.ఎల్.సి. మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా మార్చుకోవడం అంటే ప్రజారోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమేనని అందుకు ప్రతి ఒక్కరూ భాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రజలు కూడా వ్యర్ధాలను రోడ్ల మీద, కాల్వల్లో వేయకుండా నగరపాలక సంస్థ ప్రజారోగ్య సిబ్బందికే ఇవ్వాలన్నారు. పరిసరాల పరిశుభ్రత ద్వారా ప్రజలు తమ చుట్టుపక్కల కూడా స్వచ్చత పాటించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వచ్చ ఆంధ్రప్రదేశ్ సాధనకు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారన్నారు.
ఎంఎల్ఏ మాట్లాడుతూ క్లీన్ గుంటూరు ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని, అందుకు ప్రజలతో కలిసి అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందుకు రావాలన్నారు. ప్రజలు కూడా నగరపాలక సంస్థ ఇచ్చిన 3 రకాల డస్ట్ బిన్లను తప్పనిసరిగా వినియోగించుకోవడం ద్వారా స్వచ్చ సర్వేక్షణ్ 2023లో గుంటూరు నగరం దేశంలో మెరుగైన ర్యాంక్ సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. నగరంలోని కమర్షియల్ సంస్థలు కూడా డస్ట్ బిన్లను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఇంచార్జి కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని స్వచ్చ సర్వేక్షణ్ లో ఉత్తమ ర్యాంక్ సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే నగరంలో వార్డ్ ల వారీగా హోం కంపోస్ట్, కిచెన్, టెర్రస్ గార్డెన్స్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం అయ్యేలా వార్డ్ సచివాలయాల వారిగా కార్యచరణ సిద్దం చేశామన్నారు.
అనంతరం నాజ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మానవహారంలో ఎం.ఎల్.ఏ. మద్దాలి గిరిధర్ విద్యార్ధులతో స్వచ్చతా ప్రతిజ్ఞ చేపించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వనమా బాలవజ్రబాబు, షేక్ సజిలా, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, ఎస్.ఈ. భాస్కర్, సిటి ప్లానర్ మూర్తి, ఎం.హెచ్.ఓ. డాక్టర్ భాను ప్రకాష్, ఈ.ఈ. సుందర్రామిరెడ్డి, మేనేజర్ శివన్నారాయణ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News