-కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్షయ వ్యాధి రోగులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వ్యాధిని నివారించవచ్చునని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు . ప్రధాన మంత్రి టి.బి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిర ఆవరణంలోమంది క్షయ వ్యాధి గ్రస్తులకు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ లు పౌష్టికాహార కిట్లను పంపిణీచేశారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో క్షయ వ్యాధి నివారించడంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ , స్వచ్చంధ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో క్షయ వ్యాధితో బాధపడుతున్న రోగులకు పోష్టికాహారాన్ని అందించి జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చి దిద్దెందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పౌష్టికాహారం కిట్లను పంపిణీచేశామన్నారు. క్షయ వ్యాధికి సంబంధించిన లక్షణాలు అందరిలోనూ అంతర్గతంగా ఉంటాయని ఐతే అనారోగ్యంతో రోగ నిరోధక శక్తీ బలహీనంగా ఉన్న వారిలో క్షయ వ్యాధికి సంభందించిన బాక్టీరియా వృద్ధితో లక్షణాలు బయట పడతాయన్నారు. క్షయ వ్యాధి రోగులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వ్యాధిని అదుపులో ఉంచవచ్చునన్నారు. జిల్లాలో రెండువేల మంది వరకు క్షయ వ్యాధి బాధితులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు తెలుపుతున్నాయని వారందరికీ పౌష్టికాహారాన్ని, మందులను అందించడం ద్వారా క్షయ వ్యాధిని నియంత్రించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందన్నారు. అధికారులు కూడా క్షయ వ్యాధి గ్రస్తులకు పౌష్టికాహారం అందించడం లో ఆర్ధికంగా చేయూతనందించడం శుభపరిణామమని, ప్రతి ఒక్కరూ క్షయ వ్యాధి నియంత్రణ లో భాగస్వాములు కావాలని కలెక్టర్ ఢిల్లీరావు పిలుపునిచ్చారు. పౌష్టికాహార పంపిణి కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.యం.సుహసిని, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డా. జె.ఉషారాణి, టి.బి.యూనిట్ పర్యవేక్షకులు ఉన్నారు.
Prajavartha Online Telugu News