-రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులకు లబ్దిచేకూర్చే విధంగా ఆయిల్ పామ్ ధరలను నిర్ణయిస్తామని రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్, ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో ఆయిల్ పామ్ ఎఫ్.ఎఫ్.బి. ప్రైసింగ్ ఫార్ములా ఖరారు కమిటీ సమావేశం మంత్రి అద్యక్షతన జరిగింది. రాష్ట్ర ఆయిల్ పామ్ రైతుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఆయిల్ పామ్ డెవలపర్స్ అండ్ ప్రాసెసర్స్ అసోషియేషన్ ప్రతినిధులు మరియు ఉధ్యాన వన శాఖ అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఆయిల్ పామ్ రైతులకు లబ్దిచేకూర్చే విధంగా జగనన్న ప్రభుత్వం పలు విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుని అమలు చేయడం జరుగుచున్నదన్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆయిల్ పామ్ రైతులకు ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు పర్చడం జరిగిందన్నారు. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ ధరల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూర్తిగా రూపుమాపుతామని ఇచ్చిన హామీకి అనుగుణంగా ఆంధ్రా ఆయిల్ పామ్ రైతులకు రూ.84 కోట్ల మేర వ్యత్యాస ధరను చెల్లించడం జరిగిందన్నారు. అదే విధంగా ఆయిల్ ఎక్స్ ట్రాక్షన్ రేషియే శాతం ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ శాతాన్నే ఆంధ్రాలో కూడా అమలు పర్చుతామని ఇచ్చిన హామీనీ కూడా రాష్ట్రంలో అమలు పర్చడం జరుగుచున్నదన్నారు. ఫలితంగా గత ప్రభుత్వ హయాంలో టన్ను ఎఫ్.ఎఫ్.బి. (Fresh Fruit Buch) ధర కేవలం రూ.7,600/- లు మాత్రమే ఉండగా, జగనన్న ప్రభుత్వం ప్రస్తుతం రూ.18,300/- లను రైతులకు చెల్లించడం జరుగుచున్నదన్నారు. గత ఆయిల్ ఇయర్ 2021 నవంబరు 1 ప్రారంభం నుండి 2022 అక్టోబరు 31 మగింపు వరకూ ఆయిల్ రికవరీ శాతాన్ని 19.22 గాను మరియు నట్స్ రికవరీ శాతాన్ని 10.25 గాను పరిగణిస్తూ రైతులకు ఆయిల్ పామ్ ధరలను చెల్లించడం జరుగుచున్నదన్నారు. అదే విధంగా ఈ ఏడాది ఆయిల్ ఇయర్ ప్రారంభం 2022 నవంబరు 1 నుండి 2023 అక్టోబరు 31 మగింపు వరకూ కూడా రైతులకు లబ్దిచేకూర్చే విధంగా ఆయిల్ పామ్ ఎఫ్.ఎఫ్.బి. ప్రైసింగ్ ఫార్ములా ను ఖరారు చేస్తామని మంత్రి తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని తీసేసిన నేపధ్యంలో ఆయిల్ పామ్ ధరలు కాస్త తగ్గముఖం పట్టినప్పటికీ రాష్ట్రంలో ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలు ఏమాత్రం దెబ్బతిన కుండా రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
సమావేశం ప్రారంభంలో రాష్ట్ర ఆయిల్ పామ్ రైతుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మరియు ఆయిల్ పామ్ డెవలపర్స్ అండ్ ప్రాసెసర్స్ అసోషియేషన్ ప్రతినిధులు వారి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చి వాటన్నింటినీ పరిష్కరించే విధంగా ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు.
రాష్ట్ర ఉద్యాన వన శాఖ కమిషనర్ డా.ఎస్.ఎస్.శ్రీధర్, ఏ.పి.ఆయిల్ ఫెడ్ వి.సి. మరియు ఎం.డి. బాబురావు, రాష్ట్ర ఆయిల్ పామ్ రైతుల సంక్షేమ సంఘం అద్యక్షులు బొబ్బా వీర రాఘవ రావు, జనరల్ సెక్రటరీ వి.రంగారావు, జాతీయ ఆయిల్ పామ్ రైతుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ క్రాంతి కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News