గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 11 (బుధవారం) నుండి 16 (సోమవారం) వరకు గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, ఎంఎల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, కమిషనర్ కీర్తి చేకూరి, ఎంఎల్ఏ మద్దాలి గిరిధర్ లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం వారు ఎన్.టి.ఆర్. స్టేడియంలో సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను పరిశీలించి, అధికారులు, కోచ్ లతో సమీక్షించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ వలన రెండేళ్లు సంక్రాంతి సంబరాలు నిర్వహించలేదని, ఈ ఏడాది అంబరాన్నంటేలా నిర్వహించడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేశామన్నారు. 11 నుండి 16 వరకు బృందావన్ గార్డెన్స్ లోని ఎన్.టి.ఆర్.మున్సిపల్ స్టేడియంలో సంబరాలు జరుగుతాయన్నారు. ప్రతి రోజు ఉదయం ఆటల పోటీలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, జబర్దస్త్ బృంద స్కిట్ లు, ప్రముఖ గాయకుల గానామృతం ప్రజలను అలరిస్తాయన్నారు. సంబరాల్లో భాగంగా 11, 12 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్ధులకు క్రీడా పోటీలు జరుగుతాయన్నారు. 13 నుండి భోగి పళ్ళు, భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, ముగ్గుల పోటీలు, కూచిపూడి నాట్య పోటీలు జరుగుతాయన్నారు. 16 సాయంత్రం పోటీల్లో గెలిచిన వారికి బహుమతుల ప్రధాన కార్యక్రమం ఉంటుందన్నారు. పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా శాప్ నుండి కోచ్ ల తీసుకుంటామని, సంబరాల నిర్వహణకు అధికారులతో ప్రత్యేకంగా కమిటీలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు, కార్పొరేటర్ గోపి శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, ఎస్.ఈ. భాస్కర్, సిఎంఓహెచ్ డాక్టర్ విజయలక్ష్మీ, ఎంహెచ్ఓ భాను ప్రకాష్, డిప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, ఈ.ఈ. సుందర్రామిరెడ్డి, డి.ఈ.ఈ. మహ్మద్ రఫిక్, ఎస్.ఎస్. సోమ శేఖర్, ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ నాయకులు కన్నా మాస్టర్, మేకల రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News