-సంక్రాంతి ప్రత్యేక సర్వీసులను విశేషంగా ఆదరించిన ప్రయాణీకులు
-తిరుగు ప్రయాణానికి తగినన్ని బస్సులు ఏర్పాటు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్రాంతికి ముందు రోజుల్లో అనగా 06.01.2023 నుండి 14.01.2023 వరకు APSRTC రికార్డు స్థాయిలో 3,392 ప్రత్యేక బస్సులు నడిపింది. సంక్రాంతికి ముందు రోజుల్లో 3120 ప్రత్యేక బస్సులను నడపాలని యోచిస్తున్నట్లు APSRTC 16.12.2022న మీడియా ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. సాధారణ ఛార్జీలకే తగిన సంఖ్యలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నందున ఏపీ, తెలంగాణ, తదితర ప్రాంతాల ప్రజలు ప్రైవేట్ బస్సుల కంటే, ఏపీఎస్ఆర్టీసీ బస్సులకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. తిరుగు ప్రయాణ టిక్కెట్ ఛార్జీపై 10% రాయితీ సౌకర్యం కూడా ప్రయాణికులను APSRTC వైపు ఆకర్షించేలా చేసింది. గత సంవత్సరం APSRTC సంక్రాంతి ముందు రోజుల్లో 2,400 ప్రత్యేక బస్సులను మాత్రమే నడిపింది.
సంక్రాంతి ప్రత్యేక బస్సులకు ‘సాధారణ ఛార్జీలు’ వసూలు చేయడం వల్ల ప్రయాణికులు ఇతర వాహనాలను ఆశ్రయించకుండా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సులకే ఎక్కువ మొగ్గు చూపారు. దీని ఫలితంగా స్థూల ఆదాయం బాగా పెరిగింది. గత సంవత్సరం సాధించిన ఆదాయం రూ . 7.17 కోట్లుతో పోలిస్తే, ఈ సంవత్సరం 50% అదనపు ఛార్జీలు లేకుండానే అదనంగా రూ. 7.90 కోట్ల ఆదాయం ఆర్జించడం జరిగింది. కాగా, గత ఏడాది ఇవే రోజుల్లో సాధించిన రూ.107 కోట్ల ఆదాయం కంటే ఈ సంవత్సరం రూ. 141 కోట్ల ఆదాయం APSRTC సాధించగలిగింది.
APSRTC, గత ఏడాది హైదరాబాదు నుండి AP లోని వివిధ ప్రాంతాలకు 824 బస్సులు నడపగా, ఈ సంవత్సరం 1,483 ప్రత్యేక బస్సులను నడిపింది. హైదరాబాద్లో సరైన మౌలిక సదుపాయాలు లేనప్పటికీ పెద్ద ఎత్తున బస్సులు నడిపి, ప్రయాణికుల నుండి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ప్రత్యేక సర్వీసులను నిర్వహించగలిగింది.
కాగా, ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మరియు ఇతర అంతఃరాష్ట్రాలకు వెళ్లే తిరుగు ప్రయాణికుల కోసం రద్దీని బట్టి ముందస్తు సీట్ల రిజర్వేషన్ కల్పిస్తూ, బస్సులు నిరంతరం అందుబాటులో ఉంచడం జరిగింది. సంక్రాంతి ముందు రోజుల్లో మా APSRTC సేవలను విశేషంగా ఆదరించినందుకు ప్రయాణికులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. AP అంతటా అన్ని ప్రదేశాల నుండి తగిన సంఖ్యలో తిరుగు ప్రయాణం కోసం APSRTC బస్సులను సిద్ధం చేసినందున, APSRTC బస్సులను ఆదరించి మా సేవలను పొందడం కొనసాగించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News