
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, డాక్టర్ నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు ఎన్టీఆర్ ట్రస్టు సంయుక్తంగా లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని), మాజీ ఎమ్మెల్యే జనాబ్ జలీల్ ఖాన్ అతిథిలుగా పాల్గొని స్వర్గీయ నందమూరి తారక రామారావు కి నివాళులు అర్పించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్త దాతలను అభినందిస్తూ ఎన్ టి ఆర్ ట్రస్ట్ వారి రక్త దాన పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా కేశినేని శ్రీనివాస్ నాని మాట్లాడుతూ యన్టీఆర్ అంటేనే ఒక సంచలనం, ఆయన వ్యక్తిత్వం, పని తీరు ఆదర్శం నిజంగా ఎన్టీఆర్ ఒక దేవుడు.. తెలుగు ప్రజలంతా రాముడు, అల్లా, జీసెస్ ఆయనలో చూసారని,అనేక సామాజిక అంశాల పై ప్రజలను ప్రభావితం చేస్తూ చైతన్య వంతులు చేసే సినిమాలు అందించారని, పేదల కోసం పార్టీ పెట్టి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు రాజకీయ పార్టీలు పేదలను ఓట్ల కోసం వాడుకున్నాయని, యన్టీఆర్ మాత్రమే పేదలకు కూడు, గూడు, బట్ట అనే నినాదంతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు.
1983లో పశ్చిమ నియోజకవర్గంలో టిడిపి గెలిచిందని, ఆ తరువాత ఇక్కడ పార్టీ గెలవలేదని, 40 యేళ్ళుగా నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం కూడా పెట్టలేకపోయారని, ఇటీవల పార్టీ నాయకుడు సోలంకి రాజు ముందుకు వచ్చి సొంత డబ్బుతో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారని, కొంతమంది పార్టీని ఇక్కడ అమ్మేసినా ప్రస్తుతం ఉన్న టీమ్ బాగా పని చేస్తున్నారని, టిడిపి అన్ని వర్గాలకు అండగా ఉంటుందని కలకాలం పార్టీ వర్ధిల్లాలంటే పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందనీ, ఇందులో నాకు ఎటువంటి స్వార్ధం లేదని ,పార్టీని అమ్మేసే వారు ఇక్కడ ఉండకూడదు. పార్టీ కోసం పనిచేసే వారికే ప్రాధాన్యత ఇవ్వాలనేదే నా ఉద్దేశ్యమని కేశినేని నాని అన్నారు
మాజీ శాససభ్యుడు జలీల్ ఖాన్ పార్టీ కోసం నిబద్దతతో పని చేశారని, చంద్రబాబు మీద ఉన్న అభిమానంతో పార్టీలోనే ఉన్నారని , వైసీపీలో ఉంటే డిప్యూటీ సిఎం ఆయ్యేవారని త్యాగాలు చేసిన వారికి నిబద్ధత గల వారికి ఎప్పుడు పార్టీ అండగా ఉండాలని కేశినేని ఆకాంక్షించారు. అనేక వినూత్న కార్యక్రమాలు చేస్తూ పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలపర్చుతున్న టీమ్ టిడిపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నాయకుల, కార్యకర్తల కృషి అభినందనీయమని ఎంపి కేశినేని ప్రశంసించారు .
జలీల్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీ కేశినేని నాని కృషి వల్ల టిడిపి జిల్లాలో బాగా బలోపేతం అయ్యిందని అన్న ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం అందరూ కలిసి పని చేయాలని, చంద్రబాబు సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని, పార్టీ విజయం కోసం అందరూ కష్టపడాలని, మీడియా సంచలనాల కోసం కాకుండా పనిచేసే వారిని ప్రాధాన్యత ఇవ్వాలని అని జలీల్ ఖాన్ హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో టీమ్ టిడిపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్ ఎస్ బేగ్, రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాస్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు సుకాసి కిరణ్, ఎన్ టీ ఆర్ జిల్లా కార్యాలయ కార్యదర్శి సారిపల్లి వెంకట రాధాకృష్ణ, సీనియర్ నాయకులు దనేకుల వెంకట సుబ్బారావు,జిల్లా పార్టీ కార్యదర్శి పళ్ళంటి గంగాధర్, నీలం వెంకట నారాయణ, మాజీ కార్పొరేటర్ సుకాసి సరిత, జిల్లా వాణిజ్య విభాగం నాయకులు సోలంకి రాజేంద్ర కుమార్, డివిజన్ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంఛార్జి లు, యూనిట్ ఇంఛార్జి లు,అనుబంధ విభాగాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని స్వర్గీయ నందమూరి తారకరామారావు కి ఘన నివాళులు అర్పించి సుమారు 100 కి పైగా రక్తదాతలు రక్తాన్ని దానం చేసి ఎన్టీర్ కి ఘన నివాళులు అర్పించారు.
Prajavartha Online Telugu News