-కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడుగా ప్రైవేట్ స్వచ్చంద సంస్థలు భాగస్వామ్యం కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు. ఏ కొండూరు మండలం కృష్ణారావుపాలెం గురుకుల పాఠశాల భోజన శాల అభివృద్ధికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ (సిఎస్ఆర్)లో భాగంగా అపర్ణ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ సంస్థ అందించిన లక్ష రూపాయల విరాళ చెక్‌ను బుధవారం నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావును సంస్థ ప్రతినిధులు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారన్నారు. నాడు`నేడు పథకం ద్వారా పాఠశాలల అభివృద్ధిలో భాగంగా అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రహరిగోడల నిర్మాణం,పెయింటింగ్, గ్రీన్ చాక్‌బోర్డ్ ఏర్పాటు, ఫ్యాన్లు, రక్షిత త్రాగునీటి సౌకర్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తున్నారన్నారు. రాష్ట్రంలో విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో అమలు చేసేలా ఆసక్తి కనపరుస్తున్నాయన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి చర్యలకు ప్రైవేటు సంస్థలు స్వచ్చంద సంస్థ భాగస్వామ్యం తోడైతే విద్య రంగం మరింత అభివృద్ధి పదంలో పయనిస్తుందన్నార.భోజన శాల షెడ్డు నిర్మాణానికి సహకరించాలని అధికారులు అపర్ణ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ సంస్థ దృష్టికి తీసుకురాగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటి ఫండ్ నుండి లక్ష రూపాయలు విరాళాన్ని అపర్ణ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ సంస్థ అందజేయడం పట్ల అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. ఇదే స్పూర్తితో మరిన్ని సంస్థలు విద్యా రంగ అభివృద్దికి సహకరించేందుకు దాతలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు విజ్ఞప్తి చేశారు.
విరాళ చెక్కు అందించిన వారిలో అపర్ణ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ సంస్థ మేనేజర్ (లైజనింగ్) డి. శ్రీనివాస్, కంభంపాడు విటిరో టైల్స్, మైన్ ఇన్చార్జి కె. విశ్వనాదం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ టి. ప్రసాద్‌రావు ఉన్నారు.
Prajavartha Online Telugu News