అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రబీలో కూడా రైతులకు విత్తనాల పరంగాగాని, ఎరువుల పరంగాగాని ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం వ్యవసాయశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్.జగన్ మాట్లాడుతూ ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ఆహార ధాన్యాల ఉత్పత్తి, సేకరణపై సీఎంకు అధికారులు వివరాలందించారు. 2014`19 మధ్య ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి 153.95 లక్షల మెట్రిక్ టన్నులు.2019`20 నుంచి 2022`23 ఖరీప్ వరకూ సగటు ఆహారధాన్యాల ఉత్పత్తి 166.09 లక్షల మెట్రిక్ టన్నులు. రబీకి సంబంధించి ఇ` క్రాప్ బుకింగ్ ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభిస్తామని వెల్లడిరచారు. మార్చి మొదటి వారంలో తుది జాబితా వెల్లడిస్తామన్నారు. సీఎం ఆదేశాల ప్రకారం ఆర్బీకేల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు, కిసాన్ డ్రోన్లు, రైతులకు 50శాతం సబ్సిడీతో వ్యక్తిగత వ్యవసాయ పరికరాల పంపిణీపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టు తెలిపారు. ఈ ఏడాది మార్చి, మే`జూన్ నెలల్లో ఈ కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు. 2వేల డ్రోన్లను పంపిణీ చేసేదిశగా కార్యాచరణ చేశామన్నారు. తొలివిడతగా రైతులకు 500 ఇస్తామని తెలిపారు. గత డిసెంబరు నుంచే డ్రోన్ల వినియోగంపై శిక్షణ ప్రారంభించామని తెలిపారు.శిక్షణ పొందినవారికి సర్టిఫికెట్లు ఇస్తున్నామన్నారు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ యూనివర్శిటీ ద్వారా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలని, ఉత్తరాంధ్రలో కూడా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌పై కార్యాచరణ, శాయిల్ టెస్టింగ్ ప్రతి ఏటా కూడా ఏప్రిల్ మాసంలో జరిగేలా చూసుకోవాలన్నారు. టెస్టు అయిన తర్వాత సర్టిఫికెట్లను రైతులకు ఇవ్వాలన్నారు. ఫలితాలు ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలన్నదానిపై రైతులకు మార్గనిర్దేశం చేయాలన్నారు. అప్పుడు ఆ పంటకు అవసరమైన పోషకాలను సూచించాలన్నారు.
నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్న ల్యాబుల్లో వీటి పరీక్షలు వెంటనే జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు అన్నారు.
భవిష్యత్తులో ప్రతి ఆర్బీకేలో కూడా శాయిల్ టెస్ట్ పరికరాలు ఉంచాలన్న సీఎం. దీనికి సంబంధించి శిక్షణ కార్యక్రమాలను కూడా రూపొందించుకోవాలని సీఎం అన్నారు. ప్రతి గ్రామంలో శాయిల్ టెస్టింగ్ తర్వాత మ్యాపింగ్ జరగాలన్నారు. దీనివల్ల ఎరువులు, రసాయనాల వినియోగం అవసరాలమేరకే జరుగుతుందని, రైతులకు పెట్టబడులు ఆదా అవడంతో పాటు, కాలుష్యం కూడా తగ్గుతుందన్నారు. మాండస్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధంకావాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
సీఎం ఆదేశాల మేరకు సబ్సిడీపై వెంటనే విత్తనాలు అందించామని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023ను ప్రకటించిన నేపథ్యంలో చిరుధాన్యాల వినియోగంపై కార్యాచరణ రూపొందించామని అధికారులు అన్నారు. ధాన్యం సేకరణపై సీఎంకు వివరాలు అధికారులు అందించారు. సీఎం ఆదేశాల మేరకు మొదటి సారిగా గన్నీబ్యాగుల డబ్బులు, రవాణా ఖర్చులు ఇవన్నీకూడా రైతులకు ఇచ్చామన్నారు. సీఎం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలమేరకు ఇప్పటికే రైతులకు 89 శాతం చెల్లింపులు జరిగాయన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రైతులకు చెల్లింపులు చేశామన్నారు. సంక్రాంతి పండుగ వేళ రైతుల్లో సంతోషాన్ని నింపిందని తెలిపారు. ఇప్పటివరకూ రూ. 5,373 కోట్లు విలువైన ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇంకా సేకరణ కొనసాగుతుందన్నారు. ఆయా ప్రాంతాల్లో పంటల సీజన్లను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి రెండోవారం వరకూ సేకరణ కొనసాగుతుందన్నారు.
ఇ`క్రాప్ డేటా మేరకు ధాన్యం కొనుగోలు చేయాలన్న చేయాలని సీఎం అన్నారు.
స్థానిక వీఏఓ నుంచి డీఆర్‌ఓ నుంచి సర్టిఫై చేసిన తర్వాతనే సేకరణ ముగిస్తామనిఅధికారులు అన్నారు. సీఎం ఆదేశాల మేరకు మిల్లర్లు లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తొలిసారిగా ధాన్యం సేకరణ బాగా జరిగిందన్నారు. మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మిగిలిన సేకరణ కూడా జరగాలన్నారు. రైతులకు ఎక్కడా నష్టంలేకుండా చూడాలన్నారు. ఇప్పుడున్న ప్రక్రియను మరింత బలోపేతం చేయాలన్నారు.
రైతులకు మిల్లర్లతో పని ఉండకూడదని సీఎం అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద విక్రయంతోనే రైతుల పని ముగుస్తుంది. ఆతర్వాత అంతా ప్రభుత్వానిదే బాధ్యత. ఈ అంశాలన్నీ రశీదులమీద స్పష్టంగా పేర్కొనాలన్నారు. ఏమైనా సమస్యలున్నా, మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం ఉన్నా ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక నంబర్‌ను ఏర్పాటు చేయాలని, రైతులు ఫిర్యాదు చేయగానే వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ విషయంలో గత ప్రభుత్వం ఏరోజు కూడా రైతులకు ఈ రకంగా మేలు చేయలేదన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే.. సేకరణ కూడా ఈ ప్రభుత్వంలో అధికంగా జరిగిందన్నారు. చివరకు చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించిందన్నారు. చంద్రబాబు హయాంలో ఏడాదికి ధాన్యం కొనుగోలు సేకరణకు సుమారు రూ.8వేల కోట్లు అయితే మన ప్రభుత్వం హయాంలో ఏకంగా రూ.15వేల కోట్లు సగటున ఏడాదికి ధాన్యం సేకరణకు పెడుతున్నామన్నారు. అంతేకాదు ఎప్పుడూ లేని విధంగా రైతులకు అనుకున్న సమయానికే చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, వివక్షలేకుండా, అవినీతికి తావులేకుండా జరుగుతోందన్నారు. ఇంతకుముందు రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన సందర్భం లేదన్నారు. అలాంటి ధాన్యాన్నికూడా మనం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామన్నారు.
రేషన్‌లో కోరుకున్న వారికి చిరు ధాన్యాలు అందించడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నామన్న పౌరసరఫరాలశాఖ అధికారులు తెలిపారు.
ఈ సమీక్షలో వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎం వి యస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు ఐ తిరుపాల్‌రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ (ఎఫ్‌ఏసీ) వై మధుసూధన్‌రెడ్డి, మార్కెటింగ్, సహకారం ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్, ఏపీ స్టేట్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ అండ్ ఎండీ జీ వీరపాండ్యన్, సివిల్ సఫ్లైస్ డైరెక్టర్ ఎం విజయ సునీత, వ్యవసాయశాఖ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్ధ వీసీ అండ్ ఎండీ జీ శేఖర్‌బాబు, ఏపీ మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ పాండే, ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎ విష్టువర్ధన్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News