-విద్యార్థుల పట్ల అప్యాయతతో మెలిగి సమస్యను చెప్పుకునే చొరవ కల్పించండి..
-రక్తహీనత రహీత సంక్షేమ వసతి గృహలుగా తీర్చిదిద్దండి..
-10వ తరగతిలో నూరు శాతం ఫలితాలను సాధించండి..
-కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తల్లిదండ్రులను విడిచి వసతి గృహలలో చదువుకుంటున్న విద్యార్థులకు సంక్షేమ అధికారులే తల్లిదండ్రులని విద్యార్థుల పట్ల అప్యాయతతో మెలిగి సమస్యలను చెప్పుకునే చొరవ కల్పించి ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలని 10వ తరగతిలో నూరు శాతం ఫలితాలను సాధించి జిల్లాను అగ్రగామిగా నిలపాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఎస్సీ ఎస్టీ బిసి సంక్షేమ వసతి గృహ అధికారులను కోరారు.
ఎస్సీ ఎస్టీ బిసి సంక్షేమ వసతి గృహల పనితీరుపై శుక్రవారం కలెక్టరేట్‌లోని పింగళివెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సంక్షేమ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 38 సాంఫీుక సంక్షేమ వసతి గృహలలో 1274 మంది ఫ్రీ మెట్రిక్ విద్యార్థులు, 423 మంది పోస్టు మెట్రిక్ విద్యార్థులు వసతి పొందుతున్నారని వీరిలో 210 మంది పదవ తరగతి విద్యార్థులు ఉన్నారన్నారు. 27 వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహలలో 601 మంది ఫ్రీ మెట్రిక్ విద్యార్థులు, 797 మంది పోస్టు మెట్రిక్ విద్యార్థులు వసతి పొందుతున్నారని వీరిలో 117 మంది పదవ తరగతి విద్యార్థులు వసతి పొందుతున్నారన్నారు. వీరితో పాటు ఒక గిరిజన సంక్షేమ వసతి గృహంలో 15 మంది పోస్టు మెట్రిక్ విద్యార్థులకు వసతి కల్పించడం జరిగిందన్నారు. నిరుపేద వర్గాలకు చెందిన వారి పిల్లలు తల్లిదండ్రులను వీడి చదువుకునేందుకు వసతి గృహలలో ఉంటున్నారన్నారు. ఇంటర్మీడియట్ విద్య వరకు సెలవు రోజులలో మాత్రమే తల్లిదండ్రుల వద్ద ఉంటారని మిగిలిన రోజులన్ని సంక్షేమ అధికారులతోనే గడుపుతారన్నారు. అటువంటి వారిని కన్నబిడ్డలవలే అప్యాయతను పంచి వారి విద్యాబుద్దులు, ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ద చూపినప్పుడే ఉద్యోగ సార్థకత నెరవేర్చినవారవుతారన్నారు. ప్రతి విద్యార్థితో 15 నిమిషాలు ముఖాముఖి మాట్లాడి వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల గురించి తెలుసుకునప్పుడు వారసత్వ వ్యాధులపై అవగాహన ఏర్పడుతుందని తద్వారా సంబంధిత విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం శ్రద్ద వహించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రక్తహీనత కలిగిన పిల్లలకు పౌష్టికాహారం మందులను ఉచితంగా సరఫరా చేస్తుందన్నారు. వాటిని విద్యార్థులు సరైన సమయంలో సక్రమంగా వాటిని వినియోగించేలా చర్యలు తీసుకుని రక్తహీన రహిత విద్యార్థుల వసతి గృహంగా తీర్చిదిద్దాలన్నారు. వసతి గృహాలలో విద్యార్థులకు అందించే ఆహారంలో కూరలను తగిన మోతాదులో అందేలా చూడాలన్నారు. వసతి గృహాల ఆవరణలలో మునగ ఆకుకూరల మొక్కలను పెంచాలనే ఆలోచన సంక్షేమ అధికారులకు కలగాలని అప్పుడే ఆహ్లదకరమైన వాతావరణంతో పాటు పిల్లలలో మానసిక వికాశం కలిగి ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు ప్రాధమిక స్థాయి నుండే సాంకేతిక పరమైన విద్యను అందించాలనే లక్ష్యంతో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేయడం జరిగిందని వాటి ద్వారా పాఠ్యాంశాలను నేెర్చుకునేలా పర్యవేక్షించాలన్నారు. వసతి గృహాలలో నియమించిన ట్యూటర్లు సమయపాలన పాటించి విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్నారు. 10వ తరగతి పరీక్షలకు కేవలం నెలల సమయం మాత్రమే ఉందని విద్యార్థుల విద్యా బోదనపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఫలితాలలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలన్నారు. తాను ఏ రోజు, ఏ సమయంలోనైనా వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేస్తానని సమయపాలన, విద్యార్ధుల విద్య, ఆరోగ్య విషయాలలో వసతి గృహా అధికారులు ఆలసత్వం వహించిన్నట్లు గుర్తిస్తే చర్యలు తీసుకోవడానికి వెనకాడేది లేదని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
సమావేశంలో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, జిల్లా సాంఫీుక సంక్షేమ అధికారిణి యం.వి. విజయభారతి, బిసి సంక్షేమ అధికారిణి లక్ష్మీదుర్గ, జిల్లాకు చెందిన ఎస్సీ ఎస్టీ బిసి సంక్షేమ వసతి గృహ అధికారులు, సహాయ సంక్షేమ వసతి గృహ అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News