-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
-రాజ్ భవన్ లో ఘనంగా అమర వీరుల దినోత్సవం
-మహాత్మునికి నివాళి అర్పించిన గవర్నర్ బిశ్వభూషణ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. జాతిపిత వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నామన్నారు. విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాలులో సోమవారం గాంధీజీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మునికి ఘన నివాళి అర్పించిన గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ సర్వజన హితం నా మతం, అంటరానితనం, అంతః కలహాలను అంతం చేసేందుకే నా ఆయువు అంకితం అని గాంధీజీ అన్నారన్నారు. నిత్యం అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించారని, అదే మార్గంలో భారతావనికి స్వాతంత్య్రం అందించారన్నారు. 1948 జనవరి 30వ తేదీన బిర్లా హౌస్ వద్ద నాథూరామ్ గాడ్సే మహాత్ముడిపై కాల్పులు జరపగా, హే రామ్ అంటూ జాతిపిత ప్రాణాలు విడిచారని గవర్నర్ హరిచందన్ గుర్తు చేసుకున్నారు. మహాత్ముడి వర్ధంతిని దేశవ్యాప్తంగా షహీద్ దివస్‌గా జరుపుకుంటున్నామని, ప్రజలంతా గాంధీజీ జీవితాన్ని స్పూర్తిగా తీసుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు గాంధీ అనుసరించిన శాంతియుత మార్గం అందరికీ ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, సంయిక్త కార్యదర్శి సూర్యప్రకాష్, ఉప కార్యదర్శి నారాయణ స్వామి, రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News