విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షునిగా పిళ్ళా నివాస్ ను నియమిస్తున్నట్లు జాతి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ మరియు ఇంచార్జ్ బోను దుర్గా నరేష్ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన బీసీ సంక్షేమ సంఘం కార్యక్రమంలో నివాస్ ను అధ్యక్షునిగా నియమిస్తూ నియామక పత్రాన్ని నివాస్ కు దుర్గానరేష్ అందజేశారు. ఈ సందర్భంగా దుర్గా నరేష్ మాట్లాడుతూ జనవరి 25న సిద్ధార్థ కాలేజీలో జరిగిన హలో బీసీ సభ విజయవంతమైందని తెలిపారు. ఈ సభకు రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి ప్రముఖ బీసీ నాయకులు హాజరయ్యారని చెప్పారు. బీసీ కులజనగణన జరగాలని అలానే బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీలకు న్యాయం చేయాలని ఫిబ్రవరిలో జరుగనున్న పార్లమెంట్ సమావేశాలు సందర్భంగా ఫిబ్రవరి 8, 9 తేదీలలో జంతర్ మంతర్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏ పార్టీకి సంబంధం లేదని ఈ బీసీల అభివృద్ధి కోసం పని చేస్తుందని సూచించారు. నూతనంగా నియమితులైన యువజన అధ్యక్షుడు పిళ్ళా నివాస్ మాట్లాడుతూ యువజన అధ్యక్షునిగా తనను నియమించినందుకు బిసి అధినాయకులు ఆర్ కృష్ణయ్యకు, దుర్గా నరేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది పదవిగా కాకుండా బాధ్యతగా స్వీకరిస్తానన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో బీసీ సంక్షేమ యువజన సంఘాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. యువత నాయకులుగా ఎదగడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. బీసీ లకు చట్టసభలో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. బీసీ ల హక్కుల సాధన కోసం చేపడుతున్న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ నగరంలోని కొందరు ఆర్ కృష్ణయ్యను విమర్శిస్తున్నారని, సంఘంలో విభేదాలు సృష్టిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే సహించమని హెచ్చరించారు. ఆర్ కృష్ణయ్య ను విమర్శించే అర్హత, స్థాయి ఎవరికి లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పోతిన వరప్రసాద్, అధికార ప్రతినిధి హరిబాబు, ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జ్యోతి, నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మహాత్మ గాంధీ, జ్యోతిరావు పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Prajavartha Online Telugu News