విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగులు ఉపాధ్యాయుల జీవిత భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేయాలని , పాత పెన్షన్ పునరుద్ధరణకై ధర్మస్థలిలో సంకల్ప దీక్ష చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కే ఎన్ ఎస్ ప్రసాద్ లు డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేర్చ లేదని అన్నారు. మరో కొత్త పెన్షన్ విధానం అంటూ గ్యారేంటెడ్ పెన్షన్ విధానం అమలు చేస్తామని ప్రతిపాదించడం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎంత మాత్రము ఆమోదయోగ్యం గా లేదని తెలిపారు. ఈ మేరకు గ్యారెంటెడ్ పెన్షన్ విధానం ఆలోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానం పునరుద్దించాలని కోరుతూ ఫిబ్రవరి 3వ తేదీన గన్నవరం సమీపంలోని ధర్మస్థలి ప్రాంగణంలో సంకల్ప దీక్ష సభను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. సంకల్ప దీక్ష సభకు పెద్ద ఎత్తిన ఉద్యోగులు ఉపాధ్యాయులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముందుగా సంకల్ప దీక్ష సభకు సంబంధించిన పోస్టర్ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు ఏ కృష్ణ సుందర రావు, ఎస్పీ మనోహర్ కుమార్, ఎం హనుమంతరావు, కే శ్రీనివాసరావు, ఎం సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News