
-పరస్పర సహకారంతో వ్యాపారాభివృద్ధి లక్ష్యంగా సదస్సుకు రూపకల్పన
-వ్యాపారవేత్తలతో పాటు వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఆహ్వానం
-వ్యాపార బంధం సుదీర్ఘంగా కొనసాగేలా మొబైల్ యాప్ ద్వారా సభ్యుల అనుసంధానం
-సదస్సులో ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ అన్నాదురై ప్రసంగం
-నెట్వర్కింగ్ సదస్సు వివరాలను మీడియాకు వెల్లడించిన బీఎన్ఐ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 19న నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఏపీ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ నిర్వహిస్తున్నట్లు బీఎన్ఐ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్ తెలిపారు. బీఎన్ఐ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. పరస్పర సహకారంతో వ్యాపారాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహణకు సంకల్పించామని అన్నారు. ఏ రంగంలోనైనా నెట్వర్కింగ్ కీలక భూమిక పోషిస్తుందని, వ్యాపార రంగంలోనూ నెట్వర్కింగ్ ను విస్తృతం చేయడం ద్వారా అద్భుత ఫలితాలను ఆవిష్కరించవచ్చని చెప్పారు. వివిధ రంగాలకు చెందిన వారిని ఒక్కచోటికి చేర్చి, వారి నడుమ సుహృద్భావ సంబంధాలను నెలకొల్పి, తద్వారా విస్తృత వ్యాపార అవకాశాలను సృష్టించేందుకు బీఎన్ఐ ఏపీ కాన్క్లేవ్ అద్భుతమైన వేదికగా నిలుస్తుందని అన్నారు. ఈ సదస్సుకు వాణిజ్యవేత్తలు, వైద్య నిపుణులు, ప్రతిష్టాత్మక సంస్థల్లోని ఉన్నత స్థాయి ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు హాజరవుతారని ప్రకటించారు. బీఎన్ఐ సభ్యులతో సహా మొత్తం 1500 మంది ప్రతినిధులను సదస్సుకు ఆహ్వానించినట్లు వివరించారు. చెన్నైకు చెందిన ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ అన్నాదురై ప్రసంగం ఈ సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. వినియోగదారుల సేవలు, వ్యాపారంలో కొత్త తరహా విధానాల గురించి అన్నాదురై ప్రసంగిస్తారని తెలిపారు. సదస్సు ద్వారా వివిధ రంగాల వారిని ఓకే వేదికపైకి తీసుకురావడంతో పాటు, వారి మధ్య వ్యాపార అనుబంధం సుదీర్ఘంగా కొనసాగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని జై దేశాయ్, విశాల్ దేశాయ్ చెప్పారు. సదస్సులో పరిచయమైన వారితో సభ్యులు తమ అనుబంధాన్ని కొనసాగించేందుకు వీలుగా మొబైల్ అప్లికేషన్ ద్వారా సభ్యులందరినీ అనుసంధానిస్తున్నామని వివరించారు. పలు ట్రేడ్ అసోసియేషన్లు, వ్యాపార సంఘాల నుంచి సదస్సుకు విశేష స్పందన లభిస్తోందని, బీఎన్ఐ జాతీయ డైరెక్టర్లు ఈ సదస్సుకు అతిధులుగా హాజరవుతారని అన్నారు. బీఎన్ఐ ఏపీ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ టైటిల్ స్పాన్సరుగా బీజ్ నెట్వర్క్, కో-స్పాన్సరుగా సార్క్స్ మీడియా, అసోసియేట్ స్పాన్సరుగా లెన్ ట్రీ వ్యవహరిస్తున్నట్లు ప్రకటించారు. వ్యాపార విస్తృతికి, వాణిజ్య అవకాశాల సృష్టికి బీఎన్ఐ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ వేదికగా నిలుస్తుందని జై దేశాయ్, విశాల్ దేశాయ్ తెలియజేశారు. నెట్వర్కింగ్ కాన్క్లేవ్ పోస్టర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో నెట్వర్కింగ్ కాన్క్లేవ్ చైర్మన్ త్రినాథ్ నండూరి, కన్వీనర్ యడ్ల పార్థసారధి, కోర్ కమిటీ సభ్యుడు తిరుమల కుటుంబరావు పాల్గొన్నారు. కాన్క్లేవ్ కు సంబంధించిన వివరాలకు, రిజిస్ట్రేషన్ కోసం 8367577779 హెల్ప్ లైన్ నంబరుకు సంప్రదించాలని బీఎన్ఐ ప్రతినిధులు సూచించారు.
Prajavartha Online Telugu News