గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థలో పనిచేసే కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు అన్నారు. మంగళవారం నాజ్ సెంటర్ లోని నగర పాలక సంస్థ యల్.యల్.ఆర్ లో నగర కమీషనర్ కీర్తి చేకూరి తో కలిసి విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న లైన్ మెన్లకు విధుల్లో అవసరమైన రక్షణ పరికరాల కిట్లను అందించించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగర పాలక సంస్థలోని వివిధ విభాగాల కార్మికులు ప్రజారోగ్యం, మౌలిక వసతుల కోసం తెల్లవారుజామునుండి కష్టపడుతున్నారని అటువంటి కార్మికులకు నగర పాలక సంస్థ అండగా నిలుస్తుందన్నారు. వారితో పనిచేయించుటయే కాక వారి భద్రతకు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు. లైన్ మెన్లకు రక్షణ పరికరాలను ఇవ్వాలని కౌన్సిల్ లో ప్రత్యేకంగా తీర్మానం చేశామని, అందులో భాగంగా వారికి 10 రకాల రక్షణ పరికరాల కిట్ ను అందించుట జరిగిందన్నారు. ఇప్పటికే అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఇన్సూరెన్స్ ప్రీమియం కూడ నగర పాలక సంస్థే చెల్లించేలా చర్యలు తీసుకుందన్నారు.
కమీషనర్ మాట్లాడుతూ, ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్న 57 మంది కార్మికులకు కౌన్సిల్ తీర్మానం మేరకు ప్రతి రెండేళ్లకు రక్షణ పరికరాలు అందిస్తామన్నారు. కార్మికులు విధుల్లో తప్పనిసరిగా రక్షణ పరికరాలు ధరించాలని సూచించారు. అలాగే వీధి దీపాల సమస్యల పై ప్రజల నుండి అందే పిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో ఈ ఈ కొండా రెడ్డి, డి.ఈ.ఈ కళ్యాన్ రావు, ఏ.ఈ రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News