-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 27 డివిజన్ దుర్గాపురం వాకర్స్ క్లబ్ నందు రూ. 12.70 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాంతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిమ్ లో ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలించిన ఆయన.. కాసేపు వ్యాయామం చేస్తూ ఉల్లాసంగా గడిపారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యజీవితంలో వ్యాయామాన్ని ఓ భాగం చేసుకోవాలని మల్లాది విష్ణు సూచించారు. కరోనా తర్వాత ప్రజలందరూ వ్యాయామంపై దృష్టి పెడుతున్నారని.. అటువంటి వారి కోసం ఓపెన్ జిమ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. దాదాపు 1,500 సభ్యత్వం ఉన్న దుర్గాపురం వాకర్స్ క్లబ్ లో నిత్యం 300 మంది వ్యాయామం, వాకింగ్ చేస్తుంటారని.. అటువంటి వారికి ఈ ఓపెన్ జిమ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పార్కుల సుందరీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం పార్కుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని.. తాను మరలా ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలో 80 శాతం వరకు పార్కుల పనులు పూర్తి చేసినట్లు వివరించారు. రూ. కోటి నిధులతో రాఘవయ్య పార్కు., రూ. 35 లక్షలతో లెనిన్ సెంటర్ పార్కు., రూ. 11 లక్షలతో జి.వి.శాస్త్రి పార్కు., రూ.28.50 లక్షలతో రాఘవచారి పార్కు., రూ. 18 లక్షలతో ముత్తవరపు నగర్ రాజకుమారి పార్కు., రూ. 8 లక్షలతో ప్రకాష్ నగర్ పార్కు., రూ. 7.50 లక్షలతో ఎ.వి.ఎస్ రెడ్డి రోడ్డులోని వీర్ల బాలరాజు పార్కు., రూ. 14 లక్షలతో తెలుగుతల్లి పార్కు., కండ్రిక రామాలయం వీధిలో రూ. 72 లక్షల నిధులతో రెండు పార్కులను అభివృద్ధి పరచడం జరిగిందన్నారు. వీటితో పాటు గులాబీతోట పార్కు, సమ్మెట రామస్వామి పార్కు, చిట్టూరి విశ్వేశ్వరయ్య పార్కు, ASR పార్కు, డంప్ సైడ్ పార్కు, ఎల్బీఎస్ నగర్ పార్కుల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. అలాగే వాంబే కాలనీ ఐకానిక్ పార్కులో 14వ ఆర్థిక సంఘం నిధులతో పనులు జరుగుతుండగా.. వచ్చే నెలలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు. అనంతరం వాకర్స్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు కురిటి శివ, బొప్పన గాంధీ, పిల్లుట్ల వంశీ, మండా రాము, భవానీ రెడ్డి, మారుతి, లంకా కుమార్, బ్రహ్మదేశం వసంతకుమార్, బలిజ అప్పారావు, దుర్గారావు, ఏసుపాదం, చిట్టెమ్మ, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News