-భూపరిపాలన ప్రధాన కమీషనర్ జి. సాయి ప్రసాద్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
డ్రోన్ సర్వే నిర్వహిస్తేనే, మిగిలిన దశల పనులు చురుగ్గా పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడుతుందని భూపరిపాలన ప్రధాన కమీషనర్ ( సి సి ఎల్ ఏ) జి.సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం రీసర్వే పురోగతి , జగనన్న భూహక్కు – భూరక్ష పత్రాల మంజూరుకు చర్యలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలలో ఇప్పటి వరకు నిర్వహించిన సమగ్ర సర్వే పూర్తయిన గ్రామాల్లో భూహక్కుదారులకు జగనన్న భూహక్కు – భూరక్ష పత్రాలను త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా జారీ చేసే అవకాశం ఉందన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా తీసిన ఫొటోలను అభివృద్ధి చేసి ఓఆర్ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్)లు జారీచేస్తారన్నారు. వాటిని బట్టి క్షేత్రస్థాయిలో సర్వే బృందాలు నిజ నిర్ధారణ, రైతుల సమక్షంలో గ్రౌండ్ వాలిడేషన్ చేపడతాయిని ఇప్పటివరకు 47,33,454 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి 4,006 గ్రామాలకు ఓఆర్ఐలు జారీ అయ్యాయిని వివరించారు. అవి సర్వే బృందాలకు చేరడంతో వాటిని బట్టి 2,790 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ (క్షేత్రస్థాయి నిజనిర్ధారణ)ను పూర్తిచేశారన్నారు. ఈ గ్రామాల్లోని భూముల విస్తీర్ణం 32,40,618 ఎకరాలు కాగా.. ఈ ప్రాంతం మొత్తం గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయిందన్నారు. రైతుల సమక్షంలో చేసే గ్రౌండ్ వాలిడేషన్ను 2,325 గ్రామాల్లో పూర్తిచేశారని, ఈ గ్రామాలకు సంబంధించి ఇప్పటివరకు 18,855 వినతులు, అభ్యంతరాలు రాగా వాటిలో 18,717 వినతుల్ని మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలు పరిష్కరించాయిన్నారు. ఇన్ని దశల తర్వాత చివరిగా రీ సర్వే పూర్తయినట్లు ప్రకటించే నెంబర్–13 నోటిఫికేషన్లను 2,119 గ్రామాల్లో పబ్లిష్ చేశారని తెలిపారు. ఆ రెండు వేల గ్రామాలకు సంబంధించి భూహక్కు పత్రాల జారీ ప్రక్రియ నడుస్తోందని, వచ్చే రెండు నెలల్లో మరో రెండు వేల గ్రామాల్లో అన్ని దశల సర్వేను పూర్తిచేసి భూహక్కు పత్రాల జారీకి రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తుందన్నారు.
జగనన్న భూహక్కు – భూరక్ష పత్రాల పంపిణీకి జాబితాను సిద్ధం చేయాలని, కలెక్టర్లు భూహక్కు- భూరక్ష పత్రాలు మంజూరు చేసే పట్టాదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఇప్పటికే సమగ్ర సర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించిన ముసాయిదా తొలుత ప్రచురించాలని, ప్రచురించిన జాబితాను కలెక్టర్లు పరిశీలించి, ఖచ్చితమైన తుది జాబితాను సిద్ధం చేసి తమకు అందజేయాలన్నారు. జిల్లాల్లో రీ సర్వే నిర్వహించాల్సిన మిగతా గ్రామాలలో త్వరితగతిన సర్వే పూర్తిచేసి భూహక్కు పత్రాల పంపిణీకి సిద్ధం చేయాలని చెప్పారు. మ్యుటేషన్లు పెండింగ్ లో ఉండకుండా సకాలంలో పరిష్కరించాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కృష్ణాజిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ, ఈ వారంతో కలిపి మొత్తం 335 గ్రామాల రీ సర్వే పూర్తయిందని ఇంకా 94 గ్రామాలు జిల్లాలో మిగిలి ఉన్నాయని వాటిని మార్చి 15వ తేదీ లోపు సర్వే ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. డ్రోన్ల పై మానిటరింగ్ చేస్తున్నామని, గ్రౌండ్ ఫ్లోటింగ్ ముందు అందరికీ నోటీసులు పంపిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఆర్డీవోలు అందరూ తాహసిల్దార్ నుంచి వీఆర్వోలు వరకు రీ సర్వే పనులపై పర్యవేక్షిస్తున్నారని విధి నిర్వహణలో ఎవరైనా అలక్ష్యం వహిస్తే వారిపై చర్యలు సైతం తీసుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలో గ్రామసభలు 21 పెండింగ్ లో ఉన్నాయని త్వరలో వాటిని నిర్వహిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. రీ సర్వే పనులు మరింత చురుగ్గా కొనసాగడానికి 100 రోవర్లు అవసరం ఉందని కలెక్టర్ దృష్టికి సర్వే ఏడి తీసుకొచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, మచిలీపట్నం ఆర్డీవో ఐ. కిషోర్, గుడివాడ ఆర్డీవో పద్మావతి, ఉయ్యూరు ఆర్డిఓ ఎన్. విజయకుమార్, జిల్లా సర్వే సెటిల్మెంట్ అధికారి ఎస్. గోపాల రాజా, కోఆర్డినేషన్ సెక్షన్ సూపర్నెంట్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News