Breaking News

ఏపీ భవన్, న్యూఢిల్లీ లో ఇంధన సామర్ధ్య ప్రాజెక్టు

-ఏపీ ఎస్ఈసిఎంకు కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈఈ ఆర్థిక సహకారం
-ఇంధన సామర్ధ్య చర్యల అమలు ద్వారా ఏపీ భవన్ ఏడాదికి దాదాపు 1.96 లక్షల యూనిట్ల విద్యుత్ ఆదాకు అవకాశం.. దాదాపు 139 టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గేందుకు అవకాశం.
-ఏపీ భవన్లో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ నిర్వహించిన ఏపీఎస్ఈసిఎం
-మార్చి-2023 చివరి నాటికి ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి ఏపీఎస్ఈసిఎం ప్రయత్నం చేస్తుంది
-ఇంధన పొదుపు దిశగా అడుగులు వేసిన రాష్ట్ర భవన్లలో ఆంధ్ర భవన్ మొదటి స్థానంలో నిలిచింది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంధన పొదుపు , ఇంధన సామర్థ్య కార్యక్రమాలను దేశవ్యాప్తంగా దూకుడుగా ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా 2030 నాటికి ఒక బిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) కొత్త నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీలో ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబందించిన ప్రభుత్వ భవనాల్లో ఇంధన సామర్థ్య చర్యలపై దృష్టి సారించే దిశగా చొరవ తీసుకుంటోంది. మొదటి దశలో ఢిల్లీలోని ఏపీ భవన్ నుండి ఇంధన సామర్థ్య పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించారు. న్యూఢిల్లీలోని ఇతర రాష్ట్ర భవన్లలో దశలవారీగా ఇంధన సామర్ధ్య చర్యలను అమలు చేయాలని యోచిస్తున్నారు.
ఈ మేరకు ఆదివారం బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే తరపున, బీఈఈ కార్యదర్శి ఆర్కే రాయ్ న్యూ ఢిల్లీ లోని ఏపీ భవన్లో ఇంధన సామర్థ్య చర్యలపై ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ఏ మరియు ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్ తో సమావేశమయ్యారు. జాయింట్ డైరెక్టర్ బీఈఈ అభిషేక్ శర్మ, ఏపీ భవన్ అడిషనల్ కమిషనర్ ఎన్వీ రమణారెడ్డి, సీఈవో ఏపీఎస్ఈసీఎం ఏ చంద్రశేఖర రెడ్డి ఈ సమావేశంలో పా్ల్గొన్నారు.
ఈ సమావేశంలో, ఆర్కె రాయ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) నిర్వహించిన ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ (ఐజీఈఏ)లో సిఫార్సు చేసిన విధంగా ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడంలో ఏపీ భవన్కు మద్దతు ఇవ్వాలని బీఈఈ నిర్ణయించినట్లు చెప్పారు. ఏపీ భవన్ పై ఎటువంటి భారం లేకుండా , ఇంధన సామర్ధ్య చర్యల అమలుకు బీఈఈ నుండి ఏపఎస్ఈసిఎంకు ఆర్థిక సహకారం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
జాతీయ రాజధాని ఢిల్లీలో ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడంతోపాటు కర్బన ఉద్గారాలను తగ్గించే జాతీయ లక్ష్యానికి దోహదపడే తొలి రాష్ట్ర భవన్గా ఆంధ్రప్రదేశ్ భవన్ అవతరించనుందని ఆయన తెలిపారు. ఏ రాష్ట్రమైనా ఇంధన సామర్థ్యం పెంపు నుండి ప్రయోజనం పొందవచ్చని, ఎందుకంటే ఇది ఇంధన భద్రత సాధించడంలో వారి కృషికి మద్దతు ఇస్తుందని చెప్పారు. ఆర్థిక వృద్ధి మరియు ఉద్యోగ కల్పనకు కొత్త మార్గాలను తెరచేందుకు దోహదపడుతుందన్నారు. అంతేకాకుండా ఇంధన బిల్లులను తగ్గించడంతోపాటు శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణంపై వాటి ప్రభావాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు.
విద్యుత్ ఉత్పత్తి లో అనూహ్యంగా పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ఎనర్జీ ఆడిట్ ప్రాముఖ్యతను సంతరించుకుందని తెలిపారు. ఎనర్జీ ఆడిట్ ఏదైనా సంస్థలో విద్యుత్ ను ఉపయోగించే మార్గాల గురించి మరింత అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందన్నారు. అంతేకాకుండా ఇంధన వృధా సంభవించే ప్రాంతాలను గుర్తించడంలో సహాయపడటంతోపాటు ఆయా ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
ఆంధ్ర భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమీషనర్ ఆదిత్యనాధ్ దాస్ తమ ప్రాంగణంలో ఉచితంగా ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడానికి ఏపీ భవన్ ను ఎంపిక చేసినందుకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇంధన సామర్థ్య పైలట్ ప్రాజెక్ట్ అమలుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయడంలో మరియు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్-2022 సాధించడంలో చురుకైన పాత్ర పోషించిన ఏపీఎస్ఈసీఎంను ఆయన అభినందించారు.
ఢిల్లీ దేశ రాజధాని కావడంతో, దేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీలో భవనాలు లేదా అతిథి గృహాలను కలిగి ఉంటాయని, తద్వారా రాష్ట్రాలు మరియు దేశ రాజధాని మధ్య సరైన సమన్వయం ఉంటుందని చెప్పారు. వీటిలో ఏపీ భవన్ గా ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ భవన్ న్యూ ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థగా గుర్తింపు పొందిందన్నారు. ఈ ప్రాంగణంలో వసతి, క్యాంటీన్ మరియు ఆడిటోరియం వంటి భవనాలను కలిగి ఉందని చెప్పారు. ఏపీ భవన్లో గవర్నర్ మరియు ముఖ్యమంత్రి కోసం ఇతర గదులతోపాటు రాజధానిని సందర్శించే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల కోసం సూట్ రూములు ఉన్నాయని పేర్కొన్నారు.
బీఈఈ ఆర్థిక సహాయంతో ఏపీ భవన్లో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ (ఐజీఈఏ) నిర్వహించినట్లు ఏపీఎస్ఈసీఎం సీఈవో ఏ చంద్రశేఖర రెడ్డి తెలిపారు. బీఈఈ ద్వారా ఎంప్యానెల్ చేయబడిన థర్డ్ పార్టీ ఎనర్జీ ఆడిటింగ్ సంస్థ నిర్వహించిన ఈఎనర్జీ ఆడిట్ ప్రకారం, ఇది సంవత్సరానికి సుమారు 1.96 లక్షల యూనిట్ల విద్యుత్ ను ఆదా చేస్తుందని అంచనా వేయడం జరిగిందని వెల్లడించారు. దీనిద్వారా సుమారు 139 టన్నుల కార్బన్ ఉద్గారాల తగ్గింపుతో పాటుగా రూ. 39 లక్షల విలువైన ఇంధనాన్ని ఆదా చేయవచ్చని చెప్పారు. ఇంధన సామర్థ్య చర్యల కోసం ప్రతిపాదించిన రూ. 35 లక్షల పెట్టుబడి కేవలం 13 నెలల్లో రాబట్టుకోవచ్చని వివరించారు. ఏపీఎస్ఈసీఎం మార్చి-2023 చివరి నాటికి ఈప్రాజెక్ట్ అమలును పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలను చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఏపీ భవన్ లో ప్రతిపాదించబడిన చర్యలు కాంట్రాక్ట్ డిమాండ్ తగ్గింపు, ఎల్ఈడీ స్టేజ్ లైటింగ్, స్టార్ రేటెడ్ ఎయిర్ కండిషనర్లు, వంటగదిలో ఇండక్షన్ వంట ఉపకరణాల ఉపయోగం, మోషన్ సెన్సార్ను ఇన్స్టాల్ చేయడం మరియు బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంట్ (బీఎల్డీసీ)తో సంప్రదాయ సీలింగ్ ఫ్యాన్లను భర్తీ చేయడం, హీట్ పంపులు మొదలైనవి ఉన్నాయని వెల్లడించారు.
సెక్రటరీ బీఈఈ పైలట్ ప్రాజెక్ట్లను అమలు చేయడంలో చురుకైన విధానం అవలంభిస్తున్న ఏపీఎస్ఈసీఎంను ప్రశంసించారు. 2030 నాటికి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 6.68 ఎంటీఓఈ ఇంధన ఆదా లక్ష్యాన్ని సాధించడానికి రంగాల వారీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఏపీఎస్ఈసిఎం కు ఆయన సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *