
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నెలరోజుల క్రిందట అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరమ్మతుల్లో భాగంగా కేటీ రోడ్ లోని వాగు సెంటర్ వద్ద గుంట ను త్రవ్వారని అది రోజు రోజుకు కుంగుతూ ప్రమాదకరంగా మారుతుందని ఎన్నికల వ్యూహకర్త తాత సుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. కేటీ రోడ్డు సిమెంట్ రోడ్డుగా మారుతున్న తరుణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరమ్మత్తులు చేపట్టారని ఇందులో భాగంగా వాగు సెంటర్లోని ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ముందు మరమ్మత్తుల కోసం త్రవ్విన చిన్నగుంట నేడు ప్రమాదకరంగా చాలా పెద్దదిగా మారటంతో అక్కడ స్థానికంగా ఉండే వ్యాపారస్తులు ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియక భయభ్రాంతులకు గురవుతున్నారనీ గురువారం నాడు తాతా సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో వెల్లడించారు. గత మూడు సంవత్సరాలుగా నత్తనడకగా ఈ రోడ్డు పనులు జరుగుతున్నాయని దీంతో ఈ రోడ్డు కు ఇరుప్రక్కలా గల వ్యాపారస్తులు వ్యాపారం లేక విలవిలలాడిపోతున్నారని అన్నారు. గతంలో రోజుకి ఐదు ఆరు వేలు అమ్మే వ్యాపారస్తులు కూడా నేడు షాపు అద్దె కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అదేవిధంగా డ్రైనేజీల్లో మురుగునీరు నిలిచిపోవడంతో ఆ మురికి కాలువ నుండి దుర్వాసన వెదజల్లుతూ దోమలకు నిలయం గా మారాయని, దీని వల్ల ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు అనారోగ్య సమస్యలతో నిత్యం పోరాడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఈ సమస్య పై నగర కమిషనర్, మేయర్, స్థానిక కార్పొరేటర్, శాసనసభ్యులు దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ సమస్యను పరిష్కరించే వరకు మండుటెండలో పాదరక్షలు లేకుండా ఉదయాస్తమయ పోరాటం చేస్తానని తాతా సుబ్రమణ్యం పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News