విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి పేద ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల దివంగత ప్రముఖ సి. పి. ఎం. నేత పుచ్చలపల్లి సుందరయ్య జీవించి వుంటే సంతోషం వ్యక్తం చేసివుండేవారని సీనియర్ పాత్రికేయులు, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు, మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు లో రోటరీ వృద్దాశ్రమంసముదాయం లోని ఆయన నివాసంలో సి. రాఘవాచారి ప్రెస్ అకాడెమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు గురువారం పాటూరు రామయ్య ను దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా పలు సామాజిక అంశాలపై రామయ్య తమ అనుభవాలను పంచు కున్నారు. పేదల తరపున దశాబ్దాల పోరాటం జరిపిన అనుభవంతో, తమ కలలు వాస్తవ రూపం సంతరించుకోవడాన్ని చూస్తున్నామన్నారు.31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు దక్కడం, వారు సొంత ఇంటి కలను నిజం చేసుకోబోతుండడం తమకు అమిత ఆనందాన్నిస్తోందన్నారు. నాలుగు పర్యాయాలు శాసన సభ్యునిగా పని చేసినప్పటికీ తమకు ఇప్పటికీ ఇంటి స్థలం గాని, స్వంత ఇల్లు గాని లేవని ఆయన చెప్పారు.ప్రజా శక్తీ సబ్ ఎడిటర్ గా పనిచేస్తోన్న సమయం లో పుచ్చలపల్లి సుందరయ్య తమకు వ్యవసాయ కార్మికుల విభాగం బాధ్యులుగా కూడా వినియోగించారని ఆయన తెలిపారు.ప్రస్తుతం పరిపాలనంతా పేదల సంక్షేమం దిశగా జరుగుతోందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. ఒక నిరుపేద వ్యవసాయ కార్మికుడి కుటుంబంలో వైద్యం కోసం అప్పులు చేసుకునే పరిస్థితి లో మార్పు కనిపిస్తోందన్నారు.నిరుపేదబాల బాలికలు బూట్లు,యూనిఫారం దుస్తులు ధరించి,పుస్తకాలు నిండిన బ్యాగ్ లతో ప్రభత్వ పాఠశాలలకు వెళ్తుండడం తమకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. ప్రస్థుత కాలంలో జర్నలిజంలో విలువలు పూర్తిగా పడి పోవడం తమకు వేదన కలిగిస్తోందన్నారు. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తుల లేదా సంస్థల అభిప్రాయాలను, ఆరోపణలతో సమానంగా ప్రచురించే సాంప్రదాయం ఉండేదన్నారు. ప్రస్తుతం పలు మీడియా సంస్థలు అదేపనిగా ప్రభుత్వం పై, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి పై చేస్తోన్న దుష్ప్రచారం సరికాదన్నారు. విధాన నిర్ణయాల్లో ఉండే లోపాలు ఎత్తి చూపడంసరియైన పద్దతి అని ఆయన అన్నారు. ఎన్నికల అనంతరం ఏర్పడిన ప్రభుత్వం ప్రజాతీర్పుగా భావించాలని, ఎన్నికల్లో ఓటమి పాలైనవారు ప్రజల్లో వుంటూ వారి విశ్వాసాన్ని చూరగొని తిరిగి విజయం పొందడమే సరియైన పద్దతి అని ఆయన పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్టుగా గుర్తుంచుకుని తమను గౌరవించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాము వ్రాసిన “వ్యవసాయ కార్మికోద్యమ సంక్షిప్త చరిత్ర”, :”పాతూరి రామయ్య ఉద్యమం, జీవితం” పుస్తకాలను ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని కు ఆయన బహుకరించారు.
ఈ కార్యక్రమం లో ప్రెస్ అకాడెమీ సెక్రెటరీ ఎం. బాల గంగాధర తిలక్, కంటెంట్ ఎడిటర్ కలమండ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News