-ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలి
-ఉద్యోగులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం
-డిటిసి యం పురేంద్ర,
-ఉద్యోగ సంఘాల నాయకులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఉద్యోగులపై భౌతిక దాడులు చేయడం అమానుషం, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని డి టి సి ఎం పురేంద్ర అన్నారు. స్థానిక బందర్ రోడ్ లోని డిటిసి కార్యాలయంలో కాకినాడ లో జరిగిన ఘటనను ఖండిస్తూ శుక్రవారం నాడు ఉద్యోగులు అధికారులు నల్ల బ్యాడ్జీలను ధరించి విధులకు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో కాకినాడలో మోటార్ వాహన తనిఖీ అధికారి చిన్నారావు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో పెంటా వెంకట కుమార్ అనే వ్యక్తి వాహనంను కూడా ఆపి తనిఖీ చేసి, కేసు నమోదు చేస్తుండగా, అ వ్యక్తి అతి దారుణంగా కొబ్బరిబోండాలు కొట్టే కత్తితో అతి కిరాతకంగా నరికి వెయ్యడం అత్యంత దారుణం అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనకు నిరసనగా మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ఘటనకు సంబంధించి డీటీసీ యం పురేంద్ర మాట్లాడుతూ ఒకరిని చంపే, దాడి చేసే అధికారం ఎవరిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరినొకరు చంపుకోవడం రాక్షసత్వం అవుతుందని డిటిసి అన్నారు. చిన్నారావుపై చేసిన ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇంకేవరూ ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండేవిధంగా కఠిన శిక్షలు అమలు చెయ్యాలని ఆయన కోరారు.
రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం రాజుబాబు మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు వారి వారి విధులను నిర్వహించడం జరుగుతుందన్నారు. తనిఖీ చేసే సమయంలో సంబంధిత రికార్డులను చూపే బాధ్యత వాహనదారులకు ఉందన్నారు. విధి నిర్వహణలో భాగంగా ఒకవేళ ఇతరులకు ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొనివెళ్లి పరిష్కరించుకోవాలె తప్ప, ఇలాంటి దాడులు చెయ్యడం అత్యంత దారుణమన్నారు. ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై భౌతిక దాడులు చెయ్యాలంటే భయపడే విధంగా శిక్షలు అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్టిఓ ఆర్ జగదీశ్వర్ రాజు, ఇతర అధికారులు , సిబ్బంది ఎస్. శ్రీనివాస్, కె ఎల్ బాబు, సిహెచ్ శ్రీనివాసరావు అబ్దుల్ సత్తార్, ఆర్ చంద్రకళ, బి జ్యోతి, కె రామచంద్రరాజు ఉద్యోగులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News