

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ, గాంధీనగర్‌లో సుమారు 89 సంవత్సరాలుగా వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం (రంగస్థలం) ఎంతోమంది కవులు, కళాకారులు నిలయమై సాగుతుందని, ఎంతో చరిత్ర కలిగిన ఈ హనుమంతరాయ గ్రంధాలయాన్ని ఆధునికరించాలని ఉద్దేశంతో ఆధునీకరించబడిన భవనం శనివారం ప్రారంభోత్సవం చేస్తున్నామని గ్రంథాలయం అధ్యక్షులు డోగిపర్తి శంకర్రావు అన్నారు. శుక్రవారం గ్రంథాలయ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రెసిడెంట్ డోగిపర్తి శంకర్రావు మాట్లాడుతూ శనివారం (ఏప్రిల్ 8) సాయంత్రం 6 గంటలకు ప్రముఖ సినీ నటులు, నటీమణులు, ప్రముఖ డైరెక్టర్లు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, మేధావులు, కళాకారులు తదితరుల చేతుల మీదుగా పున: ప్రారంభిస్తామని గ్రంథాలయం అధ్యక్షులు డోగిపర్తి శంకర్రావు తెలిపారు. సుమారు 30 లక్షల వ్యయంతో సరికొత్త శోభతో అలనాటి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేశామన్నారు. సుమారు 60 మంది సభ్యత్వంతో కూడిన సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి వనరుల సమకూర్చామన్నారు. రాబోయే కళాకారులు అందరూ ఒకటి కావాలని ధ్యేయంతో పాత వైభవాన్ని తీసుకురావాలని అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆవరణ మొత్తం 4 విభాగాలు విభజించి గ్రంథాలయం, పేదల కోసం ఎగ్జామ్స్ ట్రైనింగ్ సెంటర్, రీడిరగ్ రూం, మినీ హాల్ ఏర్పాటు చేశామన్నారు. 2 నెలల 15 రోజులలో పూర్తి చేశామన్నారు. ‘వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడిటోరియం’గా తీర్చిదిద్దాలన్నేదే తమ ధ్యేయమన్నారు. మహిళలకు ప్రత్యేక వసతితో లైబ్రరరీ ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం ప్రత్యేకమైన బాక్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. వక్తలు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి కళాకారులు, కళాభిమానులు, నగరవాసులు హాజరై పూర్వం ఎలా ఆదరించారో అదే విధంగా ఇప్పుడు ఆదరించాలని కోరారు. అనంతరం ఆడిటోరియం వీక్షించి ఏర్పాటుచేసిన గత స్మృతులను చూసి ఆనందించి ఆశీర్వదించాలని కోరారు. ఇది భవిష్యత్ తరాలకు తెలియజేయాలన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించి కళాకారులను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సి.ఎ.గడ్డం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి.రామ్‌ప్రసాద్, కోశాధికారి మహబూబ్ ఆజాం, కార్యదర్శి నీలం దుర్గారావు, సభ్యులు బెల్లపు బాబ్జీ, గణప భుజంగరావు, నందివాడ నాని తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News