విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీలకు శాశ్వత విద్యుత్ సౌకర్యం కల్పించి లబ్దిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సంబందిత అధికారులను ఆదేశించారు.
జగనన్న కాలనీలలో విద్యుత్ సౌకర్యం మౌళిక వసతులపై శనివారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో హౌసింగ్, విద్యత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 289 జగనన్న కాలనీలలో లబ్దిదారులకు గృహలను కేటాయించడం జరిగిందన్నారు. ఇప్పటికే వివిధ కాలనీలలో 11 వేలకు పైగా గృహ నిర్మాణాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. లబ్దిదారులను చైతన్యవంతులను చేసి వారికి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయంతో పాటు బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందించి నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని సాదమైనంత మేరకు గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.లబ్దిదారులు గృహ నిర్మాణాలు పూర్తి చేసుకున్న వెంటనే విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న కాలనీలలో వీధి దీపాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. కాలనీలలో విద్యుత్ సౌకర్యం లేదనే ఫిర్యాదులు లబ్దిదారుల నుండి ఎదురుకాకుండా ముందుగానే లబ్దిదారుల అవసరాలు గుర్తించి విద్యుత్ సౌకర్యం కల్పించాలని సూచించారు. జగనన్న కాలనీలకు సంబంధించి ఇప్పటి వరకు 152 కాలనీలలో విద్యుత్ స్థంబాలను ఏర్పాటు చేయడం జరిగిందని దీనిలో 102 కాలనీలలో వీధి దీపాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 1733 మంది లబ్దిదారులకు వ్యక్తిగత విద్యుత్ మీటర్లను మంజూరు చేయడం జరిగిందని విద్యుత్ మీటర్ల అవసరాల మేరకు ధరఖాస్తు చేసుకున్న వెంటనే లబ్దిదారులకు విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ స్థంబాలు ఏర్పటు చేయడంలో గృహ నిర్మాణ, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులతో విద్యుత్ అధికారులు సమన్వయం కలిగి త్రాగునీటి పైప్‌లైన్‌లకు ఇబ్బంది కలకుండా శాశ్వత ప్రాతిపదికన విద్యుత్ స్థంబాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలన్నారు. పగటి వేళలలో విద్యుత్ దీపాలు నిరంతరాయంగా వెలుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని స్థానిక లైన్‌మన్‌లు ఖచ్చితంగా సమయపాలన పాటించేలా పర్యవేక్షణ చేసి విద్యుత్‌ను ఆదా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు విద్యుత్ అధికారులకు సూచించారు.
సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పిడి యం. రజని కుమారి, ఇఇ రవికాంత్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ డి. వెంకటరమణ, ఏపిసిపిడిసిఎల్ ఎస్ ఇ ఏ మురళి కృష్ణ, ఇఇలు యు. హనుమయ్య, జి.బి. శ్రీనివాసరావు, పి. హరిబాబు, డిఇలు యం వసంత్‌రావు, బి.వి సుధాకర్, జిల్లా కు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News