-నియోజకవర్గ ప్రజలందరూ వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి: ప్రభుత్వ విప్చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి*
-ప్రజల ఆరోగ్యమే పరమావధిగా చేపట్టిన ఆరోగ్య పరీక్షలను చంద్రగిరి నియోజక వర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్
-అధికారులు ఎంతో నిబద్ధతతో వైద్య పరీక్షల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:జే సి
తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి రోగ నిర్ధారణ అయినచో రోగం ముదరకుండానే వాటికి చికిత్స అందించే దిశలో నేడు పాకాల మండలం బందార్లపల్లి గ్రామం నుండి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, జెసి డికే బాలాజీ లతో కలసి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉన్నదని ప్రభుత్వ విప్ మరియు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.
బుధవారం సాయంత్రం పాకాల మండలం బందార్లపళ్లి గ్రామంలో ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన వైద్య పరీక్షల కార్యక్రమ ప్రారంభ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు, ఆరోగ్య రక్షణ ధ్యేయంగా ప్రపంచంలోనే ఎక్కడా చేపట్టనటువంటి ఈ గొప్ప యజ్ఞానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ఒకటిన్నర సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడదామనుకున్నప్పటికీ వీలు కాలేదని, నేటికి మంచి కలెక్టర్, జెసి, జిల్లా యంత్రాంగం సహకారంతో ఈ కార్యక్రమం పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుందని నియోజకవర్గంలోని ప్రజలందరూ తప్పనిసరిగా ఈ వైద్య పరీక్షలు చేయించుకుని రోగ నిర్ధారణ అయితే దాని చికిత్సకు చర్యలు చేపడతామని, 104 సేవల ద్వారా డాక్టరు తో ఫాలో అప్ పరీక్షలు, మందులు అందించడం జరుగుతుందని, అవసరమైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ద్వారా చికిత్స అందివ్వడం జరుగుతుందని, తదనుగుణంగా ఫాలో అప్ చర్యలు ఉంటాయని తెలిపారు. మీ ఆరోగ్యం కొరకు 15 నిమిషాలు కేటాయించి వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారని తెలిపారు. తుడా సహకారంతో నిర్వహించే ఈ ఉచిత వైద్య పరీక్షల నిర్వహణ కార్యక్రమంలో నాణ్యమైన అధునాతనమైన ఎక్విప్మెంట్ ద్వారా పరీక్షలు ఉంటాయని, డాక్టర్లు నర్సులు అధికారులు సమన్వయంతో ఒక కుటుంబంలా ప్రజలకు సేవలు అందించాలని, ఉచిత పరీక్షలతో పాటు ప్రజలకు టెస్ట్ రిపోర్టును వాలంటీర్ల ద్వారా అందిస్తూ డాక్టర్ సలహా కూడా ఉచితంగా ఇవ్వబడుతుందని, కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనితర సాధ్యమైన ఈ చారిత్రాత్మక బృహత్తర కార్యక్రమానికి నేడు తుడా సహకారంతో శ్రీకారం చుట్టబడిందని దీనికి ఆద్యులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి గారు, వారి సంకల్పం అని అన్నారు. భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలోని సుమారు 5 లక్షల మంది ప్రజలకు 43 రకాల వైద్య పరీక్షలు, ఈసీజీ పరీక్షలు నిర్వహిస్తూ 104 తో సమన్వయం చేసి, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ సేవలు వినియోగించుకుని, అవసరమైతే మరిన్ని పరీక్షలు నిర్వహించి అన్ని వయసుల వారి ఆరోగ్యాన్ని కాపాడే దిశలో ఇంత మంచి కార్యక్రమంలో తాను పాల్గొనడానికి అవకాశం కల్పించిన ఆ తిరుమల శ్రీవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. ఎన్నో వరుస సమీక్షలు వివిధ శాఖలతో నిర్వహించి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేపట్టడానికి ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్నారని వాలంటీర్ నుండి కలెక్టర్ వరకు ఈ 90 రోజుల యజ్ఞంలో పాల్గొని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం తుడా వారి పూర్తి సహకారం తో నిర్వహించడం జరుగుతోందని అన్నారు.
అనంతరం జెసి గారు మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గంలో చేపడుతున్న ఈ వైద్య పరీక్షల లో అందరు అధికారులు సమన్వయంతో పని చేస్తూ, ప్రజలందరూ వైద్య పరీక్షలు చేయించుకునేలా వాలంటీర్లు ఇంటింటికీ అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలు కూడా ఎంతో సహనంతో వైద్య పరీక్షలు చేయించుకుని, తమ ఆరోగ్యం కొరకు సమయం కేటాయించి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమను రోగం ముదరకుండానే రక్షించుకునేలా ఉండాలని తెలిపారు. గతంలో లాగా నేటి జీవన విధానంలో ఆరోగ్య పరిస్థితులు లేవని ఏ క్షణం ఏ విధంగా ఉంటుందో తెలియని పరిస్థితులని ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ముందస్తుగా చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకోగలరు అని అన్నారు. అనంతరం ప్రీవియ కంపెనీ ఎండి ఫణి ని జిల్లా కలెక్టర్ శాలువాతో సత్కరించారు. కార్యక్రమ ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ జెసి తో కలిసి గ్రామంలోని దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో తుడా సెక్రటరీ లక్ష్మి, ఎస్ డి సి భాస్కర నాయుడు, డి ఎం హెచ్ ఓ శ్రీహరి, డి సి హెచ్ ఎస్ ప్రభావతి, డిప్యూటీ సీఈఓ ఆదిశేష రెడ్డి, డి ఎల్ డి ఓ సుశీల దేవి, జడ్పిటిసి పద్మజా రెడ్డి ఎంపీపీ లోకనాథం సర్పంచ్ సునీత తదితర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News